నా నవ్వు చూసి గుర్తుపడుతున్నారు: సీరియల్ నటి మధుమిత

ABN , First Publish Date - 2020-05-16T02:37:20+05:30 IST

నిత్యం ఎనర్జిటిక్‌గా ఉండే త్రిభాషా నటి మధుమిత. చిన్న వయసులోనే ఎక్కువ సీరియల్స్‌లో నటించిన చలాకీ పిల్ల. నటజీవితారంభంలో ఎదురైన ఒక చేదు అనుభవాన్ని

నా నవ్వు చూసి గుర్తుపడుతున్నారు: సీరియల్ నటి మధుమిత

నిత్యం ఎనర్జిటిక్‌గా ఉండే త్రిభాషా నటి మధుమిత. చిన్న వయసులోనే ఎక్కువ సీరియల్స్‌లో నటించిన చలాకీ పిల్ల. నటజీవితారంభంలో ఎదురైన ఒక చేదు అనుభవాన్ని గుణపాఠంగా తీసుకుని పట్టుదలతో సర్వశక్తులనూ నటనమీదే కేంద్రీకరించి మంచి నటిగా పేరుతెచ్చుకుంది మధుమిత. మధ్య తరగతి జీవితాలకు ప్రతిబింబాలే టీవీ సీరియల్స్‌  అంటున్న ఆమె అంతరంగం..


కన్నడకుట్టి మధుమిత

చిక్‌మంగళూరు ఆమె స్వస్థలం. ఆమె తండ్రి హిరన్నయ్య. తల్లి పారిజాత. ముగ్గురు సంతానంలో మధ్యమురాలు. ఆమెకు అక్క, చెల్లి ఉన్నారు. ఆమె తండ్రి ఒక కర్మాగారంలో పనిచేసి రిటైరయ్యారు. తల్లి ఒక ఎగుమతుల కంపెనీలో స్టోర్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.


బాల్యం నుంచీ అదే కోరిక

నాట్యం అంటే మధుమితకు ప్రాణం. చిన్నప్పటినుంచీ ఎంతో బాగా నాట్యం చేసేది. భరతనాట్యంతో ఇంటా బయటా అందరి ప్రశంసలు పొందుతూ, వెస్ట్రన్‌ డాన్స్‌ కూడా నేర్చుకుంది. ముఖంలో అద్భుతమైన హావభావాలు పలికిస్తూ, తన నాట్యంతో అందరినీ ఆశ్చర్యపరిచేది. ‘‘నువ్వు మంచి నటి అవుతావు. నీకు మంచి భవిష్యత్‌ ఉంది’’ అని ఆమె నాట్య గురువు ప్రోత్సహించేవారట. అప్పటినుంచీ నటి కావాలని ఒక బలమైన కోరిక ఆమెలో నాటుకుపోయింది. కాలేజీ స్థాయిలో ఎంతోమంది స్నేహితుల్ని సంపాదించుకుంది. స్కూల్లో నాటికలు, నాట్యం, ఇతర సాంస్కృతిక పోటీల్లో చురుగ్గా పాల్గొంటూ ఎన్నో బహుమతులు పొందేది. బీకాం గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసింది.



ఎప్పుడు సెల్ఫ్‌కాన్ఫిడెన్స్‌ కోల్పోలేదు

ఊహ వచ్చినప్పటినుంచీ ఎక్కడ ఆడిషన్స్‌ జరిగినా వెళ్ళి పాల్గొనేది మధుమిత. వయసు సరిపోలేదనో, నటనలో పరిపక్వత లేదనో వెళ్ళినచోటల్లా ఆమెకు నిరాశే ఎదురయ్యేది. అయినా పట్టువదలకుండా సుమారు 40సార్లు ఆడిషన్స్‌కు హాజరైంది. ‘‘వందలాదిమంది ఆడిషన్స్‌కు వచ్చేవారు. అంతమందిని చూసి ఆశ్చర్యపోయేదాన్ని. కానీ అంతమందిని చూసి ఎప్పుడు నా గుండె జారిపోలేదు. ‘నేనే సెలక్ట్‌ అవుతా’ అనే ఆత్మవిశ్వాసం ప్రతిసారీ నాలో తొణకిసలాడేది తప్ప, ఎప్పుడూ దేనికోసమూ టెన్షన్‌ పడలేదు. ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ఇక పైచదువులకో, ఉద్యోగానికో వెళ్ళిపోదామనుకున్న దశలో చేసిన అంతిమ ప్రయత్నం ఫలించడంతో నటిగా నా కెరీర్‌ ప్రారంభమైంది’’ అన్నారు ఆమె.


కన్నడ సీరియల్‌ నటిగా

‘పుట్‌మల్లి’ అనే కన్నడ సీరియల్‌లో నెగిటివ్‌ పాత్ర చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది మధుమిత. దీనినే తర్వాత తెలుగులో ‘కథలో రాజకుమారి’గా తీశారు. ‘స్టార్‌ సువర్ణ’ ఛానల్‌లో వచ్చిన ఈ సీరియల్‌తో ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చాయి. మైథలాజికల్‌ సీరియల్‌ ‘శని’ ఆమె రెండో సీరియల్‌. ఇందులో శనిని ప్రతిఘటించే నీలిమ పాత్రలో నటించింది. ఆమె చేసిన మరో కన్నడ సీరియల్‌ ‘జై హనుమాన్‌’. ఇందులో లక్ష్మీదేవిపాత్రలో ప్రేక్షకులను సమ్మోహన పరచిందామె.


‘నెంబర్‌ 1 కోడలు’లో హీరోయిన్‌గా

‘మనసున మనసై’ తెలుగులో ఆమె మొదటి సీరియల్‌. ఇందులో హీరో చెల్లెలుగా రాధ పాత్రలో సెకండ్‌ హీరోయిన్‌గా నటించింది మధుమిత. ప్రస్తుతం ఏక కాలంలో రెండు సీరియల్స్‌లో నటిస్తోంది. జీ తమిళ్‌ ఛానల్‌లో ప్రసారమవుతున్న ‘పిర్యాదవరవేండుం’ మధుమితకు హీరోయిన్‌గా తొలి సీరియల్‌. ఇందులో దుర్గ పాత్రలో తమిళ ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోంది. మరోవైపు జీ తెలుగు ఛానల్‌లో ప్రసారమవుతున్న ‘నెంబర్‌ 1 కోడలు’ సీరియల్‌లో కూడా హీరోయిన్‌గా సరస్వతి పాత్రలో నటిస్తోంది. ఆరంభంలోనే ఈ సీరియల్‌ టీవీ ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి రేటింగ్‌తో నడుస్తోంది.


బిందాస్‌గా ఉండే పాత్ర

‘నెంబర్‌ 1 కోడలు’ సీరియల్‌లో సరస్వతి పాత్ర మధుమితకు తెగ నచ్చేసిందట. ‘‘ఇందులో బిందాస్‌గా ఉండే రాజమండ్రి అమ్మాయి పాత్ర నాది. ఎలాంటి కష్టాన్నైనా భరించగల ‌శక్తిసామర్థ్యాలున్న పాత్ర. అందరికీ ఎంతో హెల్ప్ ఫుల్‌గా ఉంటూ, మనసులో ఏదీ దాచుకోకుండా అన్నీ బయటకు చెప్పే అరమరికలు లేని పాత్ర. తమిళ్‌లో చేస్తున్న దుర్గ, నెంబర్‌ 1 కోడలులో సరస్వతి..ఈ రెండూ క్వయిట్‌ ఆపోజిట్‌ పాత్రలు. దుర్గ చాలా కామ్‌ గోయింగ్‌. ఏదైనా ముఖంమీదే మాట్లాడేతత్వం సరస్వతిది. చాలా చలాకీ. ఈ పాత్ర నాకు బాగా నచ్చింది. రియల్‌ లైఫ్‌లో కూడా నా తత్వం అదే. నా దగ్గర ఎలాంటి సీక్రెట్లూ ఉండవు. నా తీరుకు ఈ పాత్ర సరిపోయింది, అందుకే ఈ పాత్రకు బాగా కనెక్ట్‌ అయిపోయా’’ అన్నారు. దివ్యాంగురాలైన తన చెల్లెలి సంరక్షించుకోవడం కోసం చదువు మానేస్తుంది సరస్వతి. ఆమెను శ్రద్ధగా చూసుకుంటూ ఉంటుంది. ఆ క్రమంలోనే హీరో రాహుల్‌ పాత్ర ఆమెకు తారసపడుతుంది. అప్పటినుంచీ కథ మరో కొత్త మలుపు తిరుగుతుంది.


పాత్రను అర్థం చేసుకుని నటిస్తా..

మధుమిత ఇప్పటివరకు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఏడు సీరియల్స్‌లో నటించి, మంచి అనుభవం కూడగట్టుకుంది. ‘‘పాత్రను అర్థం చేసుకుని నటించడంతప్ప, ఎప్పుడూ హోమ్‌వర్క్‌ చెయ్యలేదు. ‘నెంబర్‌ 1 కోడలు’ సీరియల్‌ దర్శకులు శ్రీనివాస్‌ అన్నీ నాకు చక్కగా చెబుతూ ఎంతో సహకరిస్తారు. ఏదైనా అర్థం కాకపోతే, సీనియర్‌ నటులను కూడా సంప్రదిస్తాను. మొదట్లో తెలుగు భాష అర్థంకాక చాలా ఇబ్బంది పడ్డాను. నా తోటి నటీనటులందరి సహకారంతో ఏడాది కాలంగా తెలుగు నేర్చుకున్నా. ఇప్పుడు బాగా మాట్లాడుతున్నా. తెలుగు–కన్నడ భాషా లిపులు దగ్గర దగ్గరగా ఉంటాయి కనుక కూడబలుక్కుని చదువగలుగుతున్నా’’ అన్నారు మధుమిత.


ఆ చేదు అనుభవమే..

‘‘కెరీర్‌ ఆరంభంలో నాకు ఎదురైన ఒక చేదు అనుభవమే నన్నొక మంచి నటిగా తీర్చిదిద్దింది’’ అన్నారు మధుమిత. ఒక సందర్భంలో, హావభావాల్లో పెర్ఫెక్షన్‌ తేవడానికి ఎంతో నెర్వస్‌కు గురయ్యారు మధు. ఆ సమయంలో సహనం కోల్పోయిన దర్శకుడు ఆమెపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అప్పటినుంచీ పట్టుదలతో సర్వశక్తులూ నటనమీదే కేంద్రీకరించి, పరిశీలనాదృక్పథాన్ని అన్నీ ఆకళించుకునేవారు. అందరి హావభావాలను పరిశీలిస్తూ, సీన్‌కు తగ్గట్టు తక్షణం ఎలా స్పందించాలో అర్థం చేసుకోవడంపైనే దృష్టి పెట్టి ఏకాగ్రతతో కృషి చేశారు మధు. ఈ నేపథ్యంలో, ఇటీవల రెండు వారాల క్రితం తమిళ్‌ సీరియల్‌లో దుర్గ పాత్ర చేస్తున్నప్పుడు షాట్‌ ఓకే కాగానే సెట్‌లో ఉన్నవాళ్ళంతా మధుమిత నటనకు ముగ్ధులై చప్పట్లు కొట్టేశారట. ఆ క్షణంలో ఆమెకు, పాత చేదు అనుభవం గుర్తుకువచ్చి అక్కడే కన్నీళ్ళు పెట్టుకుని ఏడ్చేశారట. ‘ఆనాడు అలా తిట్లు – ఈనాడు ఇలా చప్పట్లు’ అని ఆమె ఆనందబాష్పాలు రాల్చారట. ‘‘ఎందుకు ఏడుస్తున్నావు? ఇంత బాగా నటించావుకదా?’’ అని అందరూ వచ్చి చుట్టూమూగి ఆమెను ఓదార్చారట. ఇప్పటికీ ఆ దర్శకుడు సురేష్‌ను గురువుగా భావించి ఆయనతో ఆప్యాయంగా మాట్లాడుతూ ఉంటుందట మధుమిత. ‘‘నటిగా ఎదగడానికి నాలో పట్టుదల పెంచి పరోక్షంగా నాకు ఆయన చాలా సహకరించారు, ఆయన మాటల్ని నేను ఛాలెంజింగ్‌గా తీసుకున్నాను. ఇక జీవితంలో ఎవరిచేతా ఇలా అనిపించుకోకూడదు, చాలా బాగా చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నా, నా నట జీవితంలో అదొక గొప్ప అనుభవం’’ అన్నారు మధుమిత. ‘నెంబర్‌ 1 కోడలు’ సీరియల్‌లో తనకు అత్తయ్యగా నటిస్తున్న ప్రముఖ నటి సుధాచంద్రన్‌ నటనను, ఆమె హావభావాలు చూసి మధుమిత ఫిదా అయిపోతోందట. ‘‘ఆమెతో కలిసి పనిచేయడం గొప్ప గౌరవంగా భావిస్తాను’’ అన్నారామె.



నెగిటివ్‌ పాత్రలంటే ఇష్టం

నెగిటివ్‌ పాత్రలంటే చాలా ఇష్టపడుతుందట మధుమిత. చెప్పాలంటే నటిగా ఆమె కెరీర్‌ నెగిటివ్‌ పాత్రతోనే మొదలైంది. ‘‘హీరోయిన్‌గా చేయాలంటే చాలా కష్టపడాలి, నెగిటివ్ పాత్రలో అయితే అనేక భావాలను సులభంగా పలికించవచ్చు. అయితే అన్ని పాత్రలూ చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధమే. విచిత్రం ఏమిటంటే ప్రేక్షకులు నన్ను పాజిటివ్‌ పాత్రలు చేసినప్పుడే చాలా బాగా రిసీవ్‌ చేసుకుంటున్నారు, అన్ని భాషల్లోనూ నా పాజిటివ్‌ పాత్రలనే మరింత ఎక్కువగా ఆదరించారు. మనం ఎంత బాగా నటిస్తే అంత బాగా ప్రేక్షకులు రిసీవ్‌ చేసుకుంటారు. నిజం చెప్పాలంటే, మధ్యతరగతి పాత్రలకే ప్రేక్షకులు ఎక్కువ కనెక్ట్‌ అవుతారు. ఎందుకంటే వాళ్ళ జీవితం అందులో కనిపిస్తుంది, ఏ భాషలో అయినా టీవీ సీరియల్స్‌లో ఎక్కువ మిడిల్‌ క్లాస్‌ పాత్రలే ఉంటాయి. వ్యూవర్‌షిప్‌ కూడా వాళ్ళే ఎక్కువ. అందుకే టీవీ సీరియల్స్‌ మధ్యతరగతి జీవితాలనే ప్రతిబింబిస్తాయి’’ అన్నారు మధుమిత.


నా నవ్వు చూసి గుర్తుపడుతున్నారు

‘‘తెలుగు ప్రేక్షకులు నన్నెంతో బాగా రిసీవ్‌ చేసుకుంటున్నారు. మొన్నీమధ్య ఒక షాపింగ్‌ మాల్‌కు వెళ్ళినప్పుడు అందరూ నన్ను గుర్తుపట్టి చాలా బాగా చేస్తున్నావు, నువ్వు ఇంకా మంచి హీరోయిన్‌వి కావాలి, నీకు మంచి ఫ్యూచర్‌ ఉంది’’ అని దీవించారు. సీరియల్‌లో పాత్రను బట్టి మధ్యతరగతి దుస్తుల్లో కనిపిస్తా, బయట జీన్స్‌ వేస్తా. అందువల్ల మేకప్‌ లేకుండా నన్ను ఎవరూ గుర్తుపట్టలేరు. కానీ ప్రేక్షకులు మాత్రం నా నవ్వు చూసి, నువ్వు ‘నెంబర్‌ 1 కోడలు సీరియల్‌లో హీరోయిన్‌ సరస్వతివి కదా’ అని గుర్తుపట్టేస్తున్నారు. అందరూ వచ్చి నాతో ఫొటోలు దిగడం నాకు చాలా హ్యాపీగా ఉంది. రోజూ నాకు కనీసం పదీపదిహేనుకు తక్కువ కాకుండా ప్రేక్షకుల నుంచి కామెట్లు, మంచి సూచనలు వస్తాయి. వాళ్ళు కామెంట్స్‌, సూచనలు నటనలో నాకు బాగా ఉపయోగపడుతున్నాయి. తెలుగు ప్రేక్షకులు నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు. ‘నెంబర్‌ 1 కోడలు’ సీరియల్‌కు తక్కువ సమయంలోనే మంచి రేటింగ్‌ వచ్చింది. ఇప్పుడు నేను అందరినీ తెలుగులోనే పలుకరిస్తున్నా’’ అని ఎన్నో కబుర్లు కలబోసుకున్నారు మధుమిత.


ఇంటికెళ్ళినా అదే ఎనర్జీ

షూటింగ్‌ స్పాట్‌లో ఎంత ఎనర్జిటిక్‌గా ఉంటుందో, ఇంటికి వెళ్ళాక కూడా అంతే ఖుషీ, ఎనర్జిటిక్‌గా ఉంటుందట మధుమిత. షూటింగ్‌లో జరిగిన విషయాలన్నీ అమ్మానాన్నలతో షేర్‌ చేసుకుంటూ ఉంటుందట. హైదరాబాద్‌ ఫుడ్‌ తెగ నచ్చేసిందట. వెజిటేరియన్‌ పలావ్‌, పప్పు, రసం, కారం ఉన్న ఆహారం అంటే చాలా ఇష్టపడుతుందట. పెళ్ళి గురించి అడిగితే, ‘‘ఇంకా నాకు 21యేళ్ళే, అయినా అది నా సొంత విషయం కదా’’ అని ఎంతో పొలైట్‌గా చెప్పారు మధుమిత. అన్నట్టు అల్లు అర్జున్‌, మహేష్‌బాబు ఆమె ఫేవరెట్‌ హీరోలట. షూటింగ్‌ స్పాట్‌లో తీరిక దొరికితే, తన ఫేవరెట్‌ రైటర్‌ చేతన్‌ భగత్‌ నవలలు చదువుకుంటుందట.

Updated Date - 2020-05-16T02:37:20+05:30 IST