అమ్మాయిలు స్ట్రాంగ్‌గా, డేరింగ్‌గా ఉండాలి: సీరియల్ నటి

ABN , First Publish Date - 2020-05-24T04:23:29+05:30 IST

తెలుగు కన్నడ భాషల నటి చైత్ర రై. జీ తెలుగు సూపర్‌ హిట్‌ సీరియల్‌ ‘అత్తారింట్లో అక్కాచెల్లెళ్ళు’లో ద్విపాత్రాభినయం చేస్తూ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతోంది. తెలుగు

అమ్మాయిలు స్ట్రాంగ్‌గా, డేరింగ్‌గా ఉండాలి: సీరియల్ నటి

తెలుగు కన్నడ భాషల నటి చైత్ర రై. జీ తెలుగు సూపర్‌ హిట్‌ సీరియల్‌ ‘అత్తారింట్లో అక్కాచెల్లెళ్ళు’లో ద్విపాత్రాభినయం చేస్తూ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతోంది. తెలుగు–కన్నడభాషల్లో అవలీలగా పదిహేను సీరియల్స్‌ చేసేసి, నటనలో మంచి అనుభవం సంపాదించుకుని, రయ్‌....రయ్‌...న దూసుకుపోతోంది చలాకీ చైత్ర. ‘‘అమ్మాయిలు ఎప్పుడూ శాంత స్వభావం, అంతి మంచితనం చూపిస్తూ ఉండిపోతే కుదరదు, మనలో భయం ప్రవేశించిందంటే ఓడిపోయినట్టే, తప్పు చేసినప్పుడు కదా ఎవరైనా భయపడేది? అందుకే అమ్మాయిలు స్ట్రాంగ్‌గా ఉండాలి, డేరింగ్‌‌గా ఉండాలి, నా సీరియల్‌లో సారాంశం కూడా అదే’’ అంటూ అమ్మాయిల వెన్ను తడుతున్న చైత్ర మనోగతం


కన్నడ కుట్టి చైత్ర రై. స్వరాష్ట్రంలో సీరియల్స్‌ నటిగా విజయకేతనం ఎగరేసి, తెలుగులో కూడా లీడ్‌ రోల్స్‌లో, టైటిల్‌ రోల్స్‌లో దూసుకెళ్తోంది. కర్ణాటక కూర్గ్‌ నగరం చైత్ర స్వస్థలం. మినీ కాశ్మీర్‌గా పిలిచే పర్యాటక ప్రాంతం. టెన్త్‌ వరకు అక్కడే చదువుకుంది చైత్ర. తర్వాత చికమంగళూరులో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చేసింది. చైత్ర తండ్రి వాసురై. తల్లి గులాబి రై. తమ్ముడు చేతన్‌. 


నటిగా తొలి అవకాశం

బెంగళూరులో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు శిక్షణ సమయంలో, కాఫీ డేకు వచ్చిన ఒక సినిమా దర్మకనిర్మాతలు చైత్రను చూసి, తమ కొత్త చిత్రంలో లీడ్‌రోల్‌కి అవకాశమిచ్చారు. చక్కటి ఉద్యోగం సంపాదించుకోవాలనుకోవడంతప్ప, అప్పటివరకు చైత్రకు అలాంటి ఆలోచనే లేదు. తల్లిదండ్రులు అంగీకారంతో, చైత్రతోపాటు మరో ఐదుగురిని ముంబయి అనుపమ్‌ ఖేర్‌ నటశిక్షణాలయంలో 15రోజులు, తర్వాత బెంగళూరులో ప్రముఖ ఆర్టిస్ట్‌ మోహన్‌ జునైడ్స్‌ దగ్గర నృత్యశిక్షణ ఇప్పించారు. సినిమా సాంగ్స్‌ రికార్డింగ్ కూడా పూర్తై, షూటింగ్‌కు వెళ్ళే సమయంలో, ఆకస్మికంగా చిత్రనిర్మాణం ఆగిపోయింది. 


కన్నడ నటిగా జైత్రయాత్ర

అప్పటికే ఈ రంగంలో కొన్ని మెళకువలు తెలుసుకున్న చైత్ర, ఫొటో షూట్‌ చేసి పాపులర్ కావడంతో, ‘కుసుమాంజలి’ కన్నడ సీరియల్‌ నటిగా అవకాశం పొంది, తొమ్మిదేళ్ళక్రితం కెమేరా ముందుకు వచ్చింది చైత్ర. స్కూల్లో చదువుకుంటున్నప్పటినుంచీ ఈ సీరియల్‌ చూసేదట. నెక్స్ట్‌ జనరేషన్‌ నటిగా 200 ఎపిసోడ్స్‌లో చైత్ర నటించిన తర్వాతే 2000ఎపిసోడ్స్‌గా వచ్చిన ఈ సీరియల్‌ ముగిసింది. జీ కన్నడలో ‘గజ్జెపూజ’ ఆమె కెరీర్‌లో రెండో సీరియల్‌. తండ్రి ఇద్దరు కూతుళ్ళ కథ ‘బొంబై ఆటవయ్య’ (మనుషుల్ని బొమ్మలుగా చేసి ఆటాడించే దేవుడు), ‘బణ్ణదబుగురి’ (ఆటవస్తువు), ‘యుగాది’, ‘పౌర్ణమి’, ‘నాగమణి’, ‘రాధాకల్యాణం’... ఇలా ఎన్నో కన్నడ సీరియల్స్‌లో నటించింది చైత్ర. ‘రాధాకల్యాణం’ సీరియల్‌ ఆమెకు అన్నింటికంటే చాలా ఎక్కువ గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. విదేశాల్లో షూటింగ్‌ చేసిన మొట్టమొదటి కన్నడ సీరియల్‌ ఇదే.


తెలుగులో తెరంగేట్రం చేసిందిలా

చైత్ర రైకి తెలుగులో మొదటిసారి ‘అష్టాచెమ్మా’ (2013) సీరియల్‌లో హీరోయిన్‌ స్వప్నపాత్రలో అవకాశం దొరికింది. ఐదున్నరేళ్ళు ప్రసారమైన ‘అష్టాచెమ్మా’ సీరియల్‌లో మొదట నెగిటివ్‌ షేడ్‌తో ప్రారంభమై, పాజిటివ్‌ స్థాయికి టర్నవుతుంది. మొత్తం సీరియల్‌ స్టోరీ స్వప్న పాత్ర చుట్టూ నడుస్తుంది.  ‘‘ప్రేక్షకులకు కన్నీళ్ళు పెట్టించి, వారి హృదయాల్ని కదలించిన ఈ నా మొదటి సీరియల్‌కే మంచి పేరు వచ్చింది’’ అన్నారు చైత్ర. ఈ సీరియల్‌ పెద్ద హిట్‌. ఆ తర్వాత వరుసగా, ‘అలా మొదలైంది’, ‘అత్తో అత్తమ్మ కూతురో’, ‘దటీజ్‌ మహాలక్ష్మి’, ‘ఒకరికి ఒకరు’, ‘మనసున మనసై’ సీరియల్స్‌లో నటించింది. 



విభిన్నమైన పాత్రలు

‘ఒకరికి ఒకరు’ సీరియల్‌లో తన కళ్ళను దానం చేసిన ఉదాత్తమైన పాత్రలో, అదే సీరియల్‌లో గడుసైన వడ్డీవ్యాపారిగా మాస్‌ పాత్రలో ప్రేక్షకులను మెప్పించింది. ‘అత్తో అత్తమ్మ కూతురో’ సీరియల్‌లో నిరోషా కూతురుగా టైటిల్‌రోల్‌ చేసింది. హీరో హీరోయిన్లు, పుట్టినప్పుడే ప్లేసులు మారిపోతారు. అలా కన్నతల్లి దగ్గరకే కోడలుగా కాపురానికి వెళ్ళిన కూతురు పాత్రలో నటించింది. ‘మనసున మనసై’ సీరియల్‌లో కాలు పోగొట్టుకుని నాట్య కళాకారిణి కావాలనే కోరిక నెరవేరక క్షోభ అనుభవించిన హీరోయిన్‌ దక్ష పాత్రలో నటించింది. 


దటీజ్‌ మహాలక్ష్మి

జీ తెలుగులో చైత్ర రై చేసిన మొదటి సీరియల్‌ ‘దటీజ్‌ మహాలక్ష్మి’. ఆమెకు ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టిన సీరియల్‌ ఇది. ఇందులో మహాలక్ష్మిగా టైటిల్‌రోల్‌ చేసింది. ముగ్గురు అక్కచెల్లెళ్ళలో ఒక్కర్తెగా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ ఉద్యోగం చేస్తూ, కుటుంబభారం మోసే పాత్రలో ప్రేక్షకులను మెప్పించింది చైత్ర. కట్నం ఇవ్వలేదని పుట్టింటికి చేరుకున్న అక్క, ఆ బాకీ వసూలు చేసుకోవడానికి ఆమె వెంటే వచ్చి తిష్టవేసిన బావ, చదువకునే చెల్లెలు, గొంతెమ్మ కోర్కెలు తీర్చమని మంకుపట్టుపట్టే అమ్మానాన్న పాత్రలతో ఏడాదిన్నరపాటు ఈ సీరియల్‌లో అద్బుతమైన నటన కనబరిచి మంచి పేరు తెచ్చుకుంది చైత్ర.


అత్తారింట్లో అక్కాచెల్లెళ్ళు

ప్రస్తుతం జీ తెలుగులో ప్రసారమవుతున్న ‘అత్తారింట్లో అక్కాచెల్లెళ్ళు’ సూపర్‌హిట్‌ సీరియల్‌లో ఇద్దరు హీరోయిన్లుగా డ్యుయల్‌ రోల్‌లో ప్రే‌క్షకులను ఉర్రూతలూగిస్తోంది చైత్ర. సాయంత్రం 6.30కు ప్రసారమవుతున్న ఈ సీరియల్‌ ఇప్పటికి 255 ఎపిసోడ్స్‌పైగా పూర్తిచేసుకుంది. సంక్షిప్తంగా ఈ సీరియల్‌ స్టోరీ చెప్పాలంటే, శ్రావణి–ధరణి ఒకేరూపంలో ఉండే కవలపిల్లలు. ఎలక్ట్రిషియన్‌ పనిచేసే తండ్రి కష్టపడి తమను చదివిస్తూ ఉంటే, ఆ కష్టాన్ని తగ్గించాలని, బాగా చదువుకునే ధరణి చదువు మానేసి టైలర్‌గా స్థిరపడుతుంది. నెగిటివ్‌ షేడ్స్‌తో ఉండే అక్కయ్య శ్రావణి లాయర్‌ అవుతుంది. వీరిద్దరూ ఒకే ఇంట్లో అన్నదమ్ములకు భార్యలు (శ్రావణి–విక్రమ్‌, ధరణి–ఆదిత్య) గా అడుగుపెడతారు. చెల్లెల్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టేందుకు అక్క ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఇక అప్పటినుంచీ అలా అత్తారింట్లో సాగే హై డ్రామాలో, శాంతమూర్తిగా, సాత్వికురాలుగా ధరణి పాత్రలో, నెగిటివ్‌ షేడ్స్‌లో శ్రావణిగా నవరసాలూ పండిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది చైత్ర.


ఎవరికీ దొరకని గొప్ప అవకాశం

‘అత్తారింట్లో అక్కాచెల్లెళ్ళు’ సీరియల్‌లో ద్విపాత్రాభినయం చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నా’’ అంటోంది చైత్ర. ‘‘మంచి పాత్రలు చెయ్యాలని నటీనటులందరూ కోరుకుంటారు. కానీ ఇలా ఒకే సీరియల్‌లో నవరసాలు పండించే రెండు భిన్నమైన పాత్రలు ఎవరికీ దొరకవు. జీవితంలో ఇది నాకొక గొప్ప అవకాశం. అందుకే ఎంతో జాగ్రత్తగా ఈ రెండు పాత్రల్నీ చేస్తున్నా. ఇలా వేరు వేరు గెటప్స్‌ చేయడానికి మొదట్లో భయపడ్డా. ఒకేరోజులో రెండు పాత్రల్లో నటిస్తూ, త్వర త్వరగా గెటప్‌ ఛేంజ్‌ చేసుకుంటూ క్రమంగా గాడిలోపడి ఒకసారి నెగిటివ్‌ పాత్రలో, మరోసారి పాజిటివ్‌ పాత్రలో ఒదిగిపోతూ ఒక నటిగా నన్ను నేను తీర్చిదిద్దుకుంటున్నాను. మాస్క్‌ షాట్లు (ఒకేసారి రెండు పాత్రలు స్ర్కీన్‌మీద ఉండటం) చేయాల్సి వచ్చినప్పుడు గెటప్స్‌ మారుస్తూ వేగం అలవర్చుకున్నాను. చిన్నప్పుడు సినిమాల్లో డ్యుయల్‌ రోల్‌ చూసి నిజంగా ఇద్దరున్నారనుకునేదాన్ని. కానీ ఇప్పుడు చేస్తుంటే స్వయంగా ఆ కష్టం నాకు తెలుస్తోంది, హెక్టిక్‌ వర్కుకి అలవాటు పడిపోయాను, టెన్షన్‌ నెలకున్న సందర్భాల్ని ఎలా మేనేజ్‌చెయ్యాలో అలవాటు పడ్డాను’’ అన్నారు చైత్ర.


రియల్‌ లైఫ్‌లో ధరణిలా ఉండాలనుకుంటా

‘‘నిజ జీవితంలో ధరణి పాత్ర (అత్తారింట్లో అక్కాచెల్లెళ్ళు) లా ఉండాలనుకుంటాను’’ అన్నారు చైత్ర. ‘‘ఒక ప్రేక్షకురాలుగా ధరణిని ఇష్టపడతా. నటించేటప్పుడు మాత్రం శ్రావణి పాత్రనే ఇష్టపడతాను. ఎందుకంటే శ్రావణి పాత్రలో వేరియేషన్స్‌ ఎక్కువ. అందరూ ధరణిలా ఉంటే ఈ భూమ్మీద చెడ్డవాళ్ళే ఉండరు. కానీ ప్రతి మనిషిలో పాజిటివ్‌–నెగిటివ్‌ రెండు కోణాలు ఉంటాయి. ప్రతి మనిషిలోనూ ఒక ‘అపరిచితుడు’  ఉంటాడు అన్నారు చైత్ర. ‘‘నా సీరియల్స్‌లో నా పాత్రలన్నీ భిన్నమైనవే. ఒకదానికి మరొకటి పోలిక ఉండవు. ప్రస్తుతం నేను ఎక్కడికి వెళ్ళినా ప్రేక్షకులు నన్ను ధరణిగా గుర్తిస్తున్నారు. శ్రావణిగా (నెగిటివ్‌ రోల్‌) చూడ్డానికి ఇష్టపడటం లేదు. ఇది నాకు ఎంతో సంతృప్తినిస్తున్న సీరియల్‌’’ అన్నారు చైత్ర.



ఎంత నటుడైనా తిట్లు తినక తప్పదు

‘‘కొలిమిలో కాలి ఇనుము ఒక గొప్పరూపాన్ని తీర్చిదిద్దుకున్నట్టు, ఎంతనటుడైనా డైరెక్టర్‌తో తిట్లు తినకతప్పదు. ముఖ్యంగా నాలాంటి వాళ్ళంతా నటన నేర్చుకుని మంచి నటి అనిపించుకోవడానికి అలా ఎదిగి వచ్చినవాళ్ళమే. దర్శకుడి స్థానానికి అందరూ గౌరవం ఇచ్చి తీరాల్సిందే. అలా తీర్చిదిద్దినప్పుడే గొప్ప నటులు తయారవుతారు. నా తొలి కన్నడ సీరియల్‌ దర్శకుడు వినుబళంజ నన్ను తీర్చిదిద్దారు. నా తొలి తెలుగు సీరియల్‌లో కూడా దర్శకులు జయకుమార్‌రెడ్డి, గోపికసిరెడ్డి, గోవింద ఈమనిలు నాకు భాషనేర్పి, నటన నేర్పి నాకెంతో సహకరించారు’’ అన్నారు చైత్ర.


బాధల్ని మరపించాలి 

‘‘ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేసేవారే నటులు’’ అన్నారు చైత్ర. ‘‘ప్రేక్షకులు నిత్య జీవితంలో ఎన్నో ఒత్తిడులు, బాధలతో వినోదాన్ని ఆశ్రయిస్తారు. వారిని ఆ బాధలు మరపించి, ఆ ఫీలింగ్స్‌ నుంచి బయట పడేసినవారే నిజమైన నటులని నా ఉద్దేశం. కానీ తెలుగువారు తమ హృదయాల్లో ఎంతో మంచిస్థానమిచ్చారు. ఇక్కడికి వచ్చాక నేను వెనక్కి తిరిగి కన్నడవైపు చూడలేదు. అంతలా నన్ను ఆదరిస్తున్నారు. నెలలో పధ్నాలుగు రోజులూ మంగళూరులో తల్లిదండ్రుల దగ్గర, అత్తామామల దగ్గర గడుపుతుంది చైత్ర. ఆమె భర్త ప్రసన్నశెట్టి. ఖతార్‌లో మెకానికల్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. హైదరాబాద్ ప్యారడైజ్ బిర్యానీ అంటే ఆమెకు ఎంతో ఇష్టం. దటీజ్‌ మహాలక్ష్మి సీరియల్‌లో బెస్ట్‌ డెబ్యూ అవార్డుతోపాటు, ‘అష్టాచెమ్మా’ సీరియల్‌కు బెస్ట్‌ హీరోయిన్‌, బెస్ట్‌ విలన్‌, బెస్ట్‌ పెయిర్‌గా మూడు అవార్డులు, కన్నడ ‘రాధాకల్యాణం’ సీరియల్‌లో బెస్ట్‌ సిస్టర్స్‌ అవార్డు పొందింది చైత్ర. అంతేకాదు, తమిళ్‌ సీరియల్‌లో కూడా లీడ్‌ రోల్‌ అవకాశాలు వస్తున్నాయట. నటిగా చైత్ర సాధిస్తున్న విజయాలు చూసి ఆమె తల్లిదండ్రులు ఫుల్‌ హ్యాపీ. అత్తామామలు, భర్త కూడా మంచి ప్రోత్సాహం ఇస్తున్నారు. 

Updated Date - 2020-05-24T04:23:29+05:30 IST