Sravana Bhargavi Controversy: అసలు ‘ఒకపరి కొకపరి ఒయ్యారమై’ అనే కీర్తన అర్థమేంటి..? శ్రావణ భార్గవి పనిపై స్కాలర్స్ ఏమంటున్నారంటే..

ABN , First Publish Date - 2022-07-20T14:35:06+05:30 IST

ఒకపరి కొకపరి కొయ్యారమై..' అనే కీర్తన విషయంలో ప్రముఖ నేపథ్య గాయని శ్రావణ భార్గవి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వివాదాలకు దారితీయడం, దాని మీద అన్నమయ్య వంశస్థులతో సహా మరికొందరు అభ్యంతరాలు తెలియజేస్తూ, ఆ వీడియోను తీసేయని డిమాండ్ చేయడం తెలిసిందే.

Sravana Bhargavi Controversy: అసలు ‘ఒకపరి కొకపరి ఒయ్యారమై’ అనే కీర్తన అర్థమేంటి..? శ్రావణ భార్గవి పనిపై స్కాలర్స్ ఏమంటున్నారంటే..

విషయజ్ఞానం లేకే వివాదం.. అన్నమయ్య స్కాలర్స్ విమర్శ 

శ్రావణ భార్గవిపై దాడిని తప్పుబట్టిన సాహితీవేత్తలు 


'ఒకపరి కొకపరి కొయ్యారమై..' అనే కీర్తన విషయంలో ప్రముఖ నేపథ్య గాయని శ్రావణ భార్గవి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వివాదాలకు దారితీయడం, దాని మీద అన్నమయ్య వంశస్థులతో సహా మరికొందరు అభ్యంతరాలు తెలియజేస్తూ, ఆ వీడియోను తీసేయని డిమాండ్ చేయడం తెలిసిందే. అయితే, అన్నమయ్య స్కాలర్స్ మాత్రం ఈ వివాదాన్ని టీకప్పులో తుపాను అని కొట్టిపారేస్తున్నారు. అన్నమయ్య సాహిత్యం మీద ఆవగింజంతైనా అవగాహన లేని వాళ్లు గోరంతలు కూడా లేనిదాన్ని కొండంతలు చేయాలని చూస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు.శ్రావణ భార్గవి తీసుకున్నది అన్నమయ్య కీర్తన కాదని, అన్నమయ్య జీవ, భావ వారసుడు (కుమారుడు) పెద తిరుమలయ్య రచన అని ముందుగా తెలిపారు.  


‘ఒకపరి కొకపరి ఒయ్యారమై’- అర్థమేమిటి? 


తెలుగు- తమిళ ఉభయ భాషా రచయిత, అన్నమయ్య స్కాలర్ అవినేని భాస్కర్ ఆ కీర్తన, దాని అర్థం ఇలా వివరించారు:


పల్లవి: 

ఒకపరి కొకపరి కొయ్యారమై

మొకమున కళలెల్ల మొలచినట్లుండె

తాత్పర్యం:

కళలన్నీ ముఖములో మొలకలెత్తినట్లు నిత్యం కొత్తకొత్త ఒయ్యారాలతో కనిపిస్తుందట పురుషోత్తముని ముఖం! 


చరణం 1: 

జగదేక పతిమేన చల్లిన కర్పూర ధూళి

జిగిగొని నలువంక చిందగాను

మొగి చంద్రముఖి నురమున నిలిపె గాన

పొగరు వెన్నెల దిగబోసినట్లుండె

తాత్పర్యం:

అలంకరణకోసం దేవుడి ఒంటిపైన చల్లిన కర్పూరధూళీ కింద రాలుతుందట. ఆ తెల్లటి ధూళి వెలుతురు చిమ్ముతు నలువైపులా రాలుతు ఉందట. తెల్లటి ధూళి చిందితే వెలుతురు రావడం ఏంటా అంటారా? కారణం ఉంది. అమ్మవారు చంద్రముఖికదా? ఆమెను గుండెపైన అయ్యవారు పొదుముకున్నారుకదా? రాలే తెల్లటి కర్పూర ధూళి పొగరువెన్నెలలు కురిసినట్టు కనిపిస్తుందంటే అది ఆ చంద్రముఖి మహిమేనట!


చరణం 2:

పొరిమెరుగు చెక్కుల పూసిన తట్టు పునుగు

కరిగి యిరుదెసల కారగాను

కరిగమన విభుడు గనుక మోహ మదముల

తొరిగి సామజ సిరి తొలకి నట్టుండె

తాత్పర్యం:

భలేగా మెరిసిపోతున్న ఆయన బుగ్గలకు పూసిన మేలురకం పునుగు చెక్కిళ్ళనుండి కారుతుందట. రెండుపక్కలా కారుతువున్న ఆ పునుగు ఎలా ఉందంటే మదపుటేనుగు చెంపలపైన స్రవించే ద్రవంలా ఉందట. (మగ ఏనుగుకి మదమెక్కిన సమయాల్లో ఒంటిలో టెస్టోస్ట్రాన్ హార్మోన్ ఎక్కువవ్వడంవల్ల కంటికీ చెవికీ మధ్యభాగంలో నీరు ఊరి స్రవిస్తుంది). మదపుటేనుగుతో పోల్చడం ఏంటి? అమ్మవారిని కరిగమన అని అంటాం కదా? అంటే ఏనుగువంటి ఒయ్యారమైన నడకగలది అని అర్థం. కాబట్టి స్వామివారిని కరిగమన విభుడు అన్నాడు కవి. దేవుడికి దేవిపైనున్న మోహాన్ని మదపుటేనుగు చంపలపైన ఒలికిపోతున్న ద్రవంతో పోల్చాడు కవి.


చరణం 3: 

మెరయు శ్రీవేంకటేశు మేన సింగారముగాను

తరచైన సొమ్ములు ధరియించగా

మెరుగు బోడీ అలమేలు మంగయు తాను

మెరుపు మేఘము గూడి మెరసినట్టుండె

తాత్పర్యం:

శ్రీవేంకటేశుడు బోలేడన్ని నగలు ఒంటిపైన ధరించుకుని, మెరిసిపోయే సొగుసుగల పద్మాసనితో(అలర్ మేల్ మంగై) కలిసి దర్శనమిచ్చే ఆ దృశ్యం ఎలా ఉందీ? మెఱుపు, మేఘము కలిసి మెఱినంత కాంతివంతంగా ఉందిట! (కారు మబ్బు ఆయన రంగు, తళతళలాడే మెఱుపేమో ఆవిడ రంగు!)


( ఈ కీర్తన ఇక్కడ వినొచ్చు)


అనుభూతిని అన్వయించుకునే అనుభవం ముఖ్యం

అన్నమయ్య కీర్తనలకి అర్థం కంటే, వాటి అనుభూతిని అన్వయించుకునే అనుభవం ముఖ్యమని అంటారు అన్నమయ్య స్కాలర్స్. శ్రావణ భార్గవి చేసిన ప్రయత్నం కూడా అటువంటిదే అని వారి అభిప్రాయం. తాళ్లపాక పెద తిరుమలాచార్యుల వారు శ్రీ వేంకటేశ్వరుడి ముఖాన కొంగొత్త వయ్యారాలతో మొలకెత్తిన కళల్నీ దర్శించే ప్రయత్నం చేస్తే, అటువంటి కళల్ని ఒక స్త్రీ(తన)లో ప్రదర్శించే ప్రయత్నం చేశారు శ్రావణ భార్గవి. ఆ వ్యక్తీకరణలో ఎంతవరకు ఆమె సఫలమయ్యారు, విఫలమయ్యారు అనే చర్చ చేయొచ్చు. అంతేగానీ, ఆ ప్రయత్నాన్నే తప్పుబట్టడం, దానివల్ల అన్నమయ్యకి అపచారం జరిగిందని గొడవ చేయడం తప్పు అని అంటున్నారు. 


అన్నమయ్య రచించిన 32 వేల కీర్తనలకు గాను మనకి దొరికి, పరిష్కరించబడి, తిరుమల తిరుపతి దేవస్థానం- అన్నమయ్య ప్రాజెక్ట్ (TTD- Annamayya Project) చేత ప్రచురించబడిన 12 వేల కీర్తనలు (29 సంపుటాలు)లో మొదటి నాలుగు సంపుటాలు తప్ప మిగతా 86 శాతం కీర్తనలు శృంగార కీర్తనలే.

"తొలితరం పండితులు అప్పటికే వయో వృద్ధులవటం వలన అన్నమయ్య సాహిత్యాన్ని పరిష్కరించే పని తోనే సరిపోయింది వారికి. వాటిని విశ్లేషించి వాటిలోని కవితా గంధాలని వెలికి తీసే పనికి వారెవ్వరూ పూనుకోలేదు. బహుశా ఇబ్బంది లేనందున కాబోలు, అన్నమయ్య రాసిన భక్తి-వేదాంత సంకీర్తనల గురించే హెచ్చు మాట్లాడారు గానీ వీరంతగా తమ చూపుని శృంగార కీర్తనల వైపు తిప్ప లేదు. అన్నమయ్య రాసిన వాటిలోంచి ఎంపిక చేసుకుంటూ భక్తి ప్రాధాన్యం ఉన్నవీ, వైరాగ్య భావనలతో ఉన్నవీ ఎక్కువగా పాడుతున్నారు తప్పితే ఆయన రాసిన అద్భుత శృంగార సంకీర్తనలని ఇంకా విస్తృతంగా పాడటమే లేదు!” అంటారు ప్రముఖ కవయిత్రి, అన్నమయ్య స్కాలర్ జయప్రభ. అన్నమయ్య మీద “వలపారగించవమ్మ వనిత నీ – యలుక చిత్తమున కాకలి వేసినది”,  "కాంతల మనసులోని కఱవు వాసె – అంతటా జవ్వన మనే ఆమని కాలమున," అనే రెండు గొప్ప  గ్రంథాలను రచించారు ఆమె. 


"అన్నమయ్య పదాలు పరవశానంద సంపదకు నెలవు. ఈ శరీరమే పరవశానికి, ఆనందానికి, సుఖదుఃఖ్ఖాలకి నిలయమైనది. ప్రతీ భావానికి ఆధారమైనది. బుద్ధిని కూడా వహించేది దేహమే. ఇటువంటి దేహాన్ని గురించి అన్నమయ్య చేసిన కల్పనల్లో ఉన్నంత కాంతికి సమానమైనది ఒక్క సూర్యునిలోనే మళ్ళీ నాకు కనిపించింది..." అంటారు జయప్రభ. ఎటువంటి అశ్లీలం లేని, శృంగారం కూడా కనిపించని శ్రావణ భార్గవి  వీడియో మీద సంప్రదాయం సాకుతో వివాదం చేస్తున్న వారికి అన్నమయ్య పదాల ఆ సూర్యతేజస్సు అర్థమయ్యే అవకాశమే లేదు అని అన్నమయ్య స్కాలర్స్ అభిప్రాయపడుతున్నారు.

**************

Updated Date - 2022-07-20T14:35:06+05:30 IST