యువ కథానాయకుడు సాయిధరమ్‌తేజ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ‘రిపబ్లిక్’ విడుదలకు ముందే ఆయన కోలుకున్నా, సినిమాలు మొదలెట్టలేదు. ఇప్పుడు మళ్లీ సెట్లోకి అడుగుపెట్టబోతున్నారు. సోమవారం నుంచి ఆయన తన కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొనున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో తెలియజేస్తూ ఓ వీడియోని విడుదల చేశారు. రోడ్డు ప్రమాదం తరవాత తనని ఆసుపత్రిలో చేర్పించిన సయ్యద్‌తో పాటుగా తనకు చికిత్స చేసిన వైద్యులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘నా కొత్త సినిమా నిర్మాతలైన సుకుమార్ గారికీ, బాపినీడు గారికీ ధన్యవాదాలు. నేను పూర్తిగా కోలుకునేంత వరకూ వాళ్లు నా కోసం ఎదురు చూశా’’రన్నారు. తన ప్రమాద సమయంలో ధరించిన హెల్మెట్‌ని చూపిస్తూ, ‘‘ఈ హెల్మెట్ ధరించడం వల్లే నేను ప్రాణాలతో ఉన్నా. ద్విచక్ర వాహన దారులంతా తప్పకుండా హెల్మెట్ ధరించండి’’ అంటూ సందేశం అందించారు.