టాలెంటెడ్ హీరో సత్యదేవ్ (Satyadev) గత చిత్రం ‘గాడ్సే’ (Godse) ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. ప్రస్తుతం ‘గుర్తుందా శీతాకాలం’ (Gurthunda Seethakalam) అనే మూవీ విడుదలకు సిద్ధమవుతుండగా.. అతడు నటించిన వెరైటీ యాక్షన్ చిత్రం ‘కృష్ణమ్మ’ (Krishnamma). దర్శకుడు కొరటాల శివ (Koratala shiva) సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు. వివి గోపాలకృష్ణ (VV Gopalakrishna) ఈ సినిమాకి దర్శకుడు. కీరవాణి తనయుడు కాలభైరవ (Kala bhairava) సంగీత అందిస్తున్నాడు. ఆల్రెడీ సినిమా టాకీ పార్ట్ పూర్తవగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ లో సినిమాను విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీజర్ ను సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ (Saidharam Tej) చేతుల మీదుగా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘ఈ కృష్ణమ్మలాగే మేమూ.. ఎప్పుడు పుట్టామో, ఎలా పుట్టామో ఎవ్వడికీ తెలియదు. ఎప్పుడు పుట్టినా ఎలా పుట్టినా, పుట్టిన పతివోడికీ ఏదో ఒక కథ ఉండే ఉంటది. కథ నడక, నది నడత ప్రశాంతంగా సాగిపోవాలంటే.. ఎవ్వడూ కలెక్కూడదు’.. అనే సత్యదేవ్ వాయిస్ పై టీజర్ నడుస్తుంది. అందులో కనిపించిన విజువల్స్ ప్రకారం సత్యదేవ్ తన భార్యాపిల్లలతోనూ, స్నేహితులతోనూ ప్రశాంతమైన జీవనం గడుపుతుండగా.. తమకు సంబంధం లేని ఒక కేసులో వారు ఇరుక్కుంటాడని అర్ధమవుతోంది. తన పని తాను చేసుకుంటూ ఉండగా.. తనని కెలికిన వారిపై హీరో ఏ విధంగా పగతీర్చుకున్నాడు? ఇంతకీ అతడ్ని ఆ కేసులో ఇరికించాలనుకున్నవారు ఎవరు? అనే విషయం తెలియాలంటే.. సినిమా వచ్చేవరకూ ఆగాల్సిందే. చివరిలో ఎర్రవస్త్రాలు ధరించి కత్తి పట్టుకొని సత్యదేవ్ రౌద్రంగా పరుగుపెట్టడం టీజర్‌కే హైలైట్ అనిపిస్తుంది. మరి ఈ సినిమా సత్యదేవ్‌కు ఏ స్థాయిలో పేరు తెస్తుందో చూడాలి.