సాత్వికాభినయం ఆయన ఆభరణం!

ABN , First Publish Date - 2022-04-10T06:31:05+05:30 IST

ఇంజనీరింగ్‌ డిగ్రీ చేత్తో పుచ్చుకుని తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన నటులు చాలా తక్కువ మంది కనిపిస్తారు.

సాత్వికాభినయం ఆయన ఆభరణం!

ఇంజనీరింగ్‌ డిగ్రీ చేత్తో పుచ్చుకుని తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన నటులు చాలా తక్కువ మంది కనిపిస్తారు. వారిలో మన్నవ బాలయ్య ఒకరు. ఆయన అసలు పేరు బాలకృష్ణ అయినా తాతగారి పేరుతోనే  చిత్రపరిశ్రమలో సుదీర్ఘ కాలం  కొనసాగారు. ‘యాక్టర్‌ను కావాలనే ఆలోచన నాకు ఎప్పుడూ లేదు. చిన్నప్పటినుంచీ డాక్టర్‌ కావాలనుకున్నాను. అందుకోసం కృషి చేశాను కూడా. మెడిసిన్‌, ఇంజనీంగ్‌ కోర్సుల్లో అడ్మిషన్స్‌ ఒకేసారి వచ్చాయి. అయితే మెడిసిన్‌లో సీటు వచ్చిన సంగతి నాకు  తెలియక పోవడంతో ఇంజనీరింగ్‌లో జాయిన్‌ అయ్యాను. ఆర్టిస్ట్‌ని కావడం మాత్రం యాదృచ్చికం’ అనేవారు బాలయ్య. హీరోగా పన్నెండు చిత్రాల్లో, విలన్‌గా ఒకటిరెండు సినిమాల్లో, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా దాదాపు 300 సినిమాల్లో నటించారు. సాత్వికాభినయం, స్పష్టమైన గొంతు, ఆ గొంతులో వినిపించే సన్నని జీర.. బాలయ్యకు ప్లస్‌ పాయింట్స్‌ అని చెప్పవచ్చు. ‘మొనగాళ్లకు మొనగాడు’ వంటి చిత్రాల్లో ఆయన విలన్‌గా కూడా నటించారు కానీ ఆ తరహా పాత్రలకు ఆయన ముఖంలోని సాఫ్ట్‌నెస్‌ అడ్డు పడింది. 


లెక్చరర్‌గా పనిచేస్తూ సినిమాల్లోకి

ఇంజనీరింగ్‌ పూర్తయిన తర్వాత అసిస్టెంట్‌ లెక్చరర్‌గా మద్రాసులో కొంత కాలం పనిచేశారు బాలయ్య. ఆ తర్వాత  ప్రమోషన్‌ రావడంతో కాకినాడ  పాలిటెక్నిక్‌ కాలేజిలో లెక్చరర్‌గా చేరారు. మూడేళ్లు అక్కడే పనిచేసేసరికి ఆ ఉద్యోగం అంటే బోర్‌ కొట్టి మళ్లీ మద్రాసుకు వెళ్లిపోయారు బాలయ్య. ఇది జరిగిన కొన్ని రోజులకు కాలేజిలో తనకు సీనియర్‌ అయిన తాపీ చాణక్య బాలయ్యను వెదుక్కుంటూ వచ్చి సారథీ వారి ‘ఎత్తుకు పై ఎత్తు’ చిత్రంలో హీరోగా అవకాశం ఇచ్చారు. అలా 1957 జులై 7న నటుడిగా తన కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు బాలయ్య. ‘ఎత్తుకు పై ఎత్తు’ షూటింగ్‌ ప్రారంభమైన రెండో రోజునే బాలయ్య వాళ్లబ్బాయి తులసీరామ్‌ పుట్టారు. 


పన్నెండు చిత్రాల్లో హీరోగా

కాస్త గుర్తింపు వచ్చాక సాంఘిక చిత్రాల్లోనే కాదు పౌరాణిక సినిమాల్లో కూడా హీరో ఛాన్సులు వచ్చాయి బాలయ్యకు . ‘పార్వతీకల్యాణం’, ‘మోహినీ రుక్మాంగద’, ‘మనోరమ’ చిత్రాలో శివుడు  పాత్రలు పోషించారు. ‘కృష్ణప్రేమ’సినిమాలో కృష్ణుడిగా నటించారు. ‘గుళ్లో పెళ్లి’, ‘తల్లీబిడ్డలు’ తదితర 12 చిత్రాల్లో హీరోగా నటించారు బాలయ్య. హీరోగా గుర్తింపు తెచ్చుకుని ఎదుగుతున్న సమయానికి యుక్త వయసు దాటిపోయింది. దానికితోడు యువ హీరోల పోటీ పెరిగింది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మారాల్సి వచ్చింది. 



ఎన్టీఆర్‌తో పదికి పైగా సినిమాలు

క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మారిన తర్వాత ఎన్టీఆర్‌తో కలసి ‘శ్రీకృష్ణ పాండవీయం’, ‘పాండవవనవాసం’, ‘శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ’, ‘బబ్రువాహన’, ‘మంచి మనిషి’, ‘వివాహబంధం’, ఇరుగు పొరుగు’ వంటి చిత్రాల్లో నటించే అవకాశం బాలయ్యకు వచ్చింది. అలాగే హీరో కృష్ణ నిర్మించిన చిత్రాల్లో కూడా బాలయ్య తప్పనిసరిగా ఉండేవారు. ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రంలోని అగ్గిరాజు పాత్ర ఆయనకు ఎంతో పేరు తెచ్చింది. 

క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా బాలయ్య సెకండ్‌ ఇన్నింగ్స్‌ ‘పెద్దరికం’ చిత్రంతో మొదలైంది. ఆ తర్వాత ‘గాయం’, ‘యమలీల’, ‘అన్నమయ్య’, ‘పెళ్లిసందడి’, ‘మన్మధుడు’, ‘మల్లీశ్వరి’, ‘పాండురంగడు’, ‘శ్రీరామరాజ్యం’ వంటి చిత్రాల్లో ఆయన నటించారు. లాయర్‌ వేషాలు, జడ్జి వేషాలు కూడా వేశారు.  2013లో వచ్చిన ‘రామాచారి’ ఆయన చివరి చిత్రం. 


చిత్రనిర్మాణం తప్పనిసరి అయింది

బాలయ్య విఠలాచార్య దర్శకత్వంలో రెండు చిత్రాల్లో నటించారు. కానీ ఓ సారి తన సొంత చిత్రంలో అవకాశం ఇస్తానని చెప్పి తిప్పించుకుని చివరకు లేదనేశారు. దాంతో బాలయ్యకు పౌరుషం వచ్చింది. నేనేమిటి, నా చదువేమిటి, వీళ్ల చుట్టూ వేషాల కోసం ఎందుకు తిరగాలనే పట్టుదల వచ్చి సొంతంగా చిత్రనిర్మాణ సంస్థను ప్రారంభించారు. అమృతా ఫిల్మ్స్‌ బేనరుపై ఆయన నిర్మించిన  తొలి చిత్రం ‘చెల్లెలి కాపురం’. ఈ చిత్రానికి కథకుడు ఆయనే. కె.విశ్వనాథ్‌ దర్శకత్వం  వహించిన ఈ చిత్రంలో శోభన్‌బాబు హీరో. నాలుగున్నర లక్షల రూపాయల వ్యయంతో తయారైన ఈ చిత్రం పెద్ద  హిట్‌ అయింది. ఈ సినిమా తర్వాత హీరో కృష్ణతో ‘నేరము-శిక్ష’ చిత్రాన్ని నిర్మించారు. దీనికి కూడా విశ్వనాథే దర్శకుడు. సినిమా హిట్‌  అయింది. బాలయ్య పద్ధతులు నచ్చి, హీరో కృష్ణ ఆయనకు సహకరించి, మరో మూడు చిత్రాలు చేశారు. ఇవన్నీ హిట్టే.  కృష్ణంరాజుతో ‘నిజం చెబితే నేరమా’ , చిరంజీవితో ‘ఊరికిచ్చిన మాట’ చిత్రాలు నిర్మించారు. తన కుమారుడు తులసీరామ్‌ను హీరోగా పరిచయం చేస్తూ ‘పసుపుతాడు’ చిత్రాన్ని నిర్మించారు బాలయ్య. అయితే ఆర్టిస్ట్‌గా తగిన గుర్తింపు రాకపోవడంతో  మూడు  చిత్రాల తర్వాత తెరమరుగయ్యారు తులసీరామ్‌. 

చక్కని ప్లానింగ్‌తో, అనుకున్న బడ్జెట్‌తో సినిమాలు నిర్మించేవారు బాలయ్య. చెప్పిన సమయానికి ఆర్టిస్టులకు పారితోషికాలు ఇచ్చేవారు. తన బడ్జెట్‌కు అనుగుణంగా ఉన్నవారితోనే ఆయన సినిమాలు తీసేవారు. చిత్ర నిర్మాణ వ్యయం అదుపుతప్పడంతో ‘పసుపుతాడు’ చిత్రం తర్వాత 30 ఏళ్ల క్రితమే చిత్రనిర్మాణం ఆపేశారు బాలయ్య.


దర్శకుడిగానూ గుర్తింపు

కథకుడిగా, నటుడిగా, నిర్మాతగానే కాకుండా దర్శకుడిగా కూడా బాలయ్య మంచి పేరు తెచ్చుకున్నారు. తన బేనర్‌లో నిర్మించిన  ‘అన్నదమ్ముల కథ’, ‘నిజం చెబితే నేరమా’ (కృష్ణంరాజు హీరో), ‘ఊరికిచ్చిన మాట(చిరంజీవి హీరో)‘పసుపుతాడు’ (తులసీరామ్‌ హీరో) చిత్రాలకు బాలయ్య దర్శకత్వం వహించారు. అలాగే పద్మాలయా సంస్థ నిర్మించిన ‘పోలీస్‌ అల్లుడు’( కృష్ణ హీరో) చిత్రానికి కూడా  ఆయన దర్శకత్వం వహించారు. 

Updated Date - 2022-04-10T06:31:05+05:30 IST