సినిమా రివ్యూ: సర్కారు వారి పాట(Sarkaru vaari paata)

Twitter IconWatsapp IconFacebook Icon
సినిమా రివ్యూ: సర్కారు వారి పాట(Sarkaru vaari paata)

రివ్యూ: సర్కారు వారి పాట(Sarkaru vaari paata review)

విడుదల తేది: 12–05–2022

నటీనటులు: మహేశ్‌బాబు, కీర్తి సురేశ్‌, తనికెళ్ల భరణి, సముద్రఖని, నదియా, వెన్నెల కిశోర్‌, సుబ్బరాజు, పోసాని కృష్ణమురళి, బ్రహ్మాజీ, రవి ప్రకాశ్‌ తదితరులు. 

కెమెరా: మది

సంగీతం: ఎస్‌.తమన్‌

ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె. వెంకటేశ్‌

నిర్మాతలు: నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌, రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట

కథ–కథనం–మాటలు–దర్శకత్వం: పరశురామ్‌(Parasuram)


‘శ్రీమంతుడు’, ‘భరత్‌ అనే నేను’, ‘మహర్షి’, ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న మహేశ్‌బాబు రెండేళ్ల తర్వాత ‘సర్కారు వారి పాట’(Sarkaruvaaripaata)తో ప్రేక్షకుల్ని పలకరించారు. ఆయన నటించిన గత నాలుగు చిత్రాలు సోషల్‌ మెసేజ్‌తో తెరకెక్కినవే! ఆ కథలకు కమర్షియల్‌ అంశాలు జోడించి హీరోయిజాన్ని మిస్‌ కాకుండా చూసుకొంటూ హిట్స్‌ అందుకున్నారు. రెండేళ్ల తర్వాత వస్తున్న ఈ చిత్రానికి మహేశ్‌ ఎలాంటి కథ ఎంచుకున్నారు. ప్రేక్షకుల్ని, అభిమానుల్ని ఎంతవరకూ ఎంటర్‌టైన్‌ చేశారనేది తెలుసుకోవాలంటే ‘సర్కారు’ కథలోకి వెళ్లాల్సిందే! 


కథ:- 

మహి(మహేశ్‌బాబు) చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన కుర్రాడు. లెక్కల మాస్టార్‌ (తనికెళ్ల భరణి) సహకారంతో ఓ హాస్టల్‌లో చేరి చదువుకుని అమెరికా వెళ్లిపోతాడు. అక్కడి స్థిరపడి వడ్డీకి డబ్బులు తిప్పుతూ ఉంటాడు. తన డబ్బును వడ్డీతో సహా చెల్లించకపోతే అసలు వదిలే టైపు కాదు అతను. అక్కడే మందుకి, క్యాసినోకి అలవాటు పడిన కళావతి(కీర్తి సురేశ్‌-Keerthi suresh)తో పరిచయం ఏర్పడుతుంది. క్యాసినో కోసం అబద్ధాలు చెప్పి మహి దగ్గర డబ్బు అప్పుగా తీసుకుంటుంది. ఆమెకు కనెక్ట్‌ అయిన మహి హెల్ప్‌ చేస్తూనే ఉంటాడు. ఓ రోజు కళావతి గుట్టు రట్టు కావడంతో వడ్డీతో సహా డబ్బు కట్టాలంటాడు. ‘నేను ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకో అనగానే పదివేల డాలర్ల కోసం వైజాగ్‌లో కోటీశ్వరుడు, కళావతి తండ్రి అయిన రాజేంద్రనాథ్‌ దగ్గర వాలిపోతాడు. తీరా వైజాగ్‌లో దిగి కొన్ని సంఘటలను ఎదుర్కొన్న తర్వాత తనకు ఇవ్వాల్సింది పదివేల డాలర్లు కాదు.. పదివేల కోట్లు అని మీడియా ముందు చెబుతాడు. అసలు ఆ పదివేల కోట్ల కథేంటి. ఎయిర్‌పోర్ట్‌లో మహికి పరిచయమైన నదియాకు ఈ కథకు లింక్‌ ఏంటి? తనకు రావలసిన డబ్బును మహి రాబట్టాడా లేదా అన్నది మిగతా కథ. (Sarkaru vaari paata movie review)


విశ్లేషణ :- 

బ్యాంక్‌ నుంచి రుణాలు తీసుకున్న బడా బాబులు సమయానుకులంగా వాయిదాలు చెల్లించకుండా బాగానే ఉంటున్నారు. మధ్యతరగతి జనాలు మాత్రం వాయిదాలు చెల్లించలేక భారంతో నలిగిపోతున్నారు. బడాబాబులు బ్యాంకు రుణాల విషయంలో చేసే తప్పిదాలు సాధారణ మనుషుల తలకు చుట్టుకుంటున్నాయి అన్నది సినిమా ఇతివృత్తం. మహేశ్‌ చిన్నతనంతో కథ మొదలవుతుంది. 15 వేల బ్యాంక్‌ రుణం చెల్లించలేక తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకోవడం చూసిన మహి డబ్బు సంపాదనే లక్ష్యంగా పెట్టుకుని అమెరికాలో ఫైనాన్షియర్‌గా స్థిరపడతాడు. అక్కడ పరిచయమైన కళావతితో లవ్‌, తర్వాత తనకు ఇవ్వాల్సిన పదివేల డాలర్ల కోసం గొడవ, ఆ డబ్బు వసూలు చేయడం కోసం ఫ్లైట్‌ ఎక్కి వైజాగ్‌ చేరుకోవడం ఇవన్నీ కూడా లింక్‌ లేకుండా సాగాయి. ప్రథమార్థం అంతా మహి, కళావతి, వెన్నెల కిశోర్‌పైనే సాగింది. ఆ సన్నివేశాలు చక్కని హాస్యాన్ని పంచాయి. పదివేల కోట్లు అనే ట్విస్ట్‌తో ఇంటర్వెల్‌ కార్డ్‌ వేశారు. అక్కడి వరకూ వేగంగా సాగిన సినిమా సెకెండాఫ్‌ ప్రారంభం నుంచి సాగదీతగా సాగింది. దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌ బలమైనదే అయినా దానిని ట్రీట్‌ చేసిన విధానం కరెక్ట్‌గా లేదు. పదివేల డాలర్లు తీసుకోవడానికి వచ్చిన హీరో ఎయిర్‌పోర్ట్‌లో పరిచయమైన ఓ వ్యక్తి కోసం, ఆమెను కష్టం నుంచి గట్టెక్కించడం కోసం ఇంత రిస్క్‌ చేస్తాడా అన్నది రియాలిటీకి దూరంగా ఉంది. కథలో బలం ఉంటే లాజిక్కులు, మ్యాజిక్కులు గురించి ఎవరూ పట్టించుకోరు. నత్తనడకన సాగుతున్న తరుణంలోనే సగటు ప్రేక్షకుడికి లాజిక్కులు గుర్తొస్తాయి. ఈ చిత్రం విషయంలోనూ అదే జరిగింది. సోసైటీలో వ్యాపారవేత్తల తీరు ఎలా ఉంది? బ్యాంక్‌ వ్యవస్థ ఎలా ఉంది అనే విషయాలను బాగానే చూపించారు. కానీ అవన్నీ వాస్తవాలకు దూరమే! రాసుకున్న కథకు కమర్షియల్‌ అంశాలను మిళితం చేసి హీరో స్టార్‌డమ్‌కు తగ్గట్లు తెరకెక్కించడంలో దర్శకుడు తడబడ్డాడు.  మహేశ్‌.. దర్శకుల హీరో. కథ లాక్‌ అయిన తర్వాత దర్శకుడు ఏం చెబితే అది చేసుకుంటూ వెళ్లిపోతాడనే పేరుంది. అంత వరకూ మహేశ్‌ వంద శాతం న్యాయం చేశాడు. మహేశ్‌లాంటి స్టార్‌తో సినిమా అంటే కథ మీద బాగా కూర్చొవలసిన అవసరం ఉంది. కానీ దర్శకుడు హీరో క్యారెక్టర్‌ మీద మాత్రమే దృష్టి పెట్టి లాజిక్కులు లేకుండా వదిలేశారు. సెకెండాఫ్‌ అంతా ప్రేక్షకుడి ఊహకు అందేలా ఉంది. అభిమానులను దృష్టిలో పెట్టుకుని హీరోపై రాసిన డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి. ఇక ఎవరెలా చేశారంటే.. మహేశ్‌ గ్లామర్‌తోపాటు మంచి టైమింగ్‌తో అలరించాడు. అతని వన్‌మెన్‌ షో అనడం అతిశయోక్తికాదు. అందంతోనే కాదు.. డైలాగ్‌లు, మ్యానరిజం, ఫైట్లు, డాన్స్‌లతో అలరించారు. హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఇప్పటి వరకూ ఆమె గ్లామర్‌, డీగ్లామర్‌ పాత్రలు చేసినా ఇలాంటి ట్రెండీ పాత్ర చేయడం ఇదే మొదటిసారి. కీర్తి పాత్ర ఫస్టాఫ్‌ అంతా బాగానే అలరించింది. సెకెండాఫ్‌లో మాత్రం అక్కడక్కడా దర్శనమిచ్చింది. మహేశ్‌, కీర్తి సురేశ్‌ మీద కాలు వేసే సన్నివేశం కాస్త ఎబ్బెట్టుగా అనిపించింది. ఆ సందర్భంలోనే సుబ్బరాజు కాంబినేషన్‌ సన్నివేశాలు అంతగా ఆకట్టుకోలేదు. సముద్రఖని ప్రతినాయకుడిగా అలరించారు. అతిథిగా నదియా పాత్ర కీలకం. ఇంకాస్త నిడివి పెంచి ఉంటే బావుండేది. తనికెళ్ల భరణి, బ్రహ్మాజీ, రవిప్రకాశ్‌ పాత్రల మేరకు న్యాయం చేశారు. వెన్నెల కిశోర్‌ నవ్వించాడు. టెక్నికల్‌ విషయాలకొస్తే.. మది కెమెరా పనితనం గ్రాండ్‌గా ఉంది. పాటలతో ఆకట్టుకున్న తమన్‌ నేపథ్యసంగీతంతో రోత పుట్టించాడు. ‘కళావతి’, ‘మ..మ.. మహేశ్‌’ పాటలు ప్రేక్షకుల చేత ఈలలు వేయించాయి. ‘పెన్నీ’ సాంగ్‌ అంతగా ఆకట్టుకోలేదు. సెకెండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు, ఫైట్‌ సన్నివేశాలకు కత్తెర వేసుంటే సాగదీత లేకుండా క్రిస్ప్‌గా ఉండేది. నిర్మాతలు పెట్టిన బడ్జెట్‌ తెరపై కనిపిస్తుంది. లాజిక్కులు పట్టించుకోకుండా హీరో క్యారెక్టరైజేషన్‌, పాటలు, ఫైట్లు, కమర్షియల్‌ అంశాలు ఆశించే ఆడియన్స్‌ ఓ మాదిరిగా సినిమా నచ్చుతుంది. (Sarkaaru vaari paata review)


ట్యాగ్‌లైన్‌: సర్కారు పాట సరిగ్గా సాగలేదు! 

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.