‘ఏక్ మినీ కథ’ హీరో సంతోశ్ శోభన్‌కు వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే మారుతి దర్శకత్వంలో ‘మంచి రోజులు వచ్చాయి’ అనే సినిమాలో నటిస్తున్న ఈ యువ హీరో ఇప్పుడు ఓ తమిళ రీమేక్‌లో నటించబోతున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా మెగా కాంపౌండ్ నిర్మించనుందట. వివరాల మేరకు తమిళ చిత్రం ‘ఎట్టు తుట్టాక్కల్’ సినిమా రీమేక్ హక్కులను మెగా డాటర్ సుస్మిత దక్కించుకుంది. రీసెంట్గా సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన సుస్మిత ఇప్పుడీ రీమేక్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటుందని టాక్. తమిళంలో ‘ఎట్టు తుట్టాక్కల్’ను డైరెక్ట్ చేసిన శ్రీగణేశ్ తెలుగులోనూ డైరెక్ట్ చేయబోతున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన వెలువడుతుందని సమాచారం.