సంక్రాంతికి గుర్తుండిపోయే గిఫ్ట్‌ ఇచ్చారు

ABN , First Publish Date - 2022-01-19T06:07:23+05:30 IST

‘‘రౌడీబాయ్స్‌’తో పరిశ్రమకి కొత్త హీరో వచ్చాడు’ అనే ప్రశంస సంతోషాన్నిస్తోంది. ఇన్నాళ్లు కష్టపడింది ఈ రోజు కోసమే. ప్రేక్షకులు హీరోగా యాక్సెప్ట్‌ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది...

సంక్రాంతికి గుర్తుండిపోయే గిఫ్ట్‌ ఇచ్చారు

‘‘రౌడీబాయ్స్‌’తో పరిశ్రమకి కొత్త హీరో వచ్చాడు’ అనే ప్రశంస సంతోషాన్నిస్తోంది. ఇన్నాళ్లు కష్టపడింది ఈ రోజు కోసమే. ప్రేక్షకులు హీరోగా యాక్సెప్ట్‌ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. దిల్‌రాజు, శిరీష్‌ గారుకి ఇండస్ట్రీలో ఒక బ్రాండ్‌ ఉంది. వాళ్ల పేరు చెడగొట్టకూడదని చాలా కష్టపడ్డాను. సినిమా హిట్టవడంతో సంక్రాంతి ఆనందం రెట్టింపు అయింది’’ అన్నారు ఆశిష్‌. ఆయన కథానాయకుడిగా నటించిన ‘రౌడీబాయ్స్‌’ సంక్రాంతికి విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సందర్భంగా ఆయన సినిమా విశేషాలను పంచుకున్నారు.  


24 ఏళ్ల నుంచి సంక్రాంతి చేసుకుంటున్నాను. ఈ సంక్రాంతి మాత్రం నాకు చాలా స్పెషల్‌. ఎప్పటికీ గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాలని మిగిల్చింది. దిల్‌రాజు గారు ప్రతి సంక్రాంతికి సక్సెస్‌ కొడుతున్నారు. అందుకే ‘రౌడీబాయ్స్‌’ రిలీజ్‌కి ముందు మా ఇద్దరిలో చిన్న టెన్షన్‌ ఉండేది.  ‘రౌడీబాయ్స్‌’ హిట్టవడంతో రెండింతలు ఆనందంగా ఉంది. 


సినిమాను ఫస్ట్‌ బాబాయే చూశారు. ‘బాగా చేశావు, సినమా జనాలకు నచ్చుతుంది’ అని అప్పుడే చెప్పారు. నేను బాధపడతానేమో అని అలా చెబుతున్నారు అనుకున్నాను. కానీ ఇప్పుడు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చేసరికి అందరం హ్యాపీగా ఉన్నాం. సినిమా రిలీజయిన రోజే మార్నింగ్‌  షో అమ్మా, నాన్నతో కలసి చూశాను. వాళ్ల కళ్లలో ఆనందభాష్పాలు కనిపించాయి. గర్వంగా ఫీలయ్యారు. చూసినవాళ్లందరూ ‘నీ నటన అద్భుతంగా ఉంది, ఫస్ట్‌ సినిమా లాగా చేయలేదు, ఎమోషనల్‌ సీన్లు చాలా బాగా చేశావు అని చెబుతున్నారు. ‘కంగ్రాట్స్‌’ అని కొరటాల శివ ఫోన్‌ చేసి ప్రశంసించారు. స్నేహితులు చాలా హ్యాపీ. యూత్‌ కాబట్టి వాళ్లకు ప్రథమార్థం బాగా నచ్చింది. ద్వితీయార్థంలో ఎమోషనల్‌ సీన్లలో నా పెర్‌ఫార్మెన్స్‌ బాగుందని మరి కొందరు అన్నారు.


వారసులకు సినీరంగంలో తొలి అడుగు సులభం అనేది అందరికీ తెలిసిందే. ఎవరికైనా చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగినదానిపైన ఒకింత ఆసక్తి ఉంటుంది. బాల్యం నుంచి సినిమాలు, షూటింగ్స్‌ చూస్తూ పెరిగాను. యాక్టర్స్‌ని చూసి ఇన్‌ స్పైర్‌ అయ్యేవాణ్ణి. నా ఫేవరేట్‌ హీరో అల్లు అర్జున్‌. ఆయనొక పెద్ద ప్రొడక్షన్‌ బ్యాగ్రౌండ్‌ నుంచి వచ్చినా తనను తాను నిరూపించుకున్నాడు. ఆయనే యాక్టింగ్‌లోకి రావడానికి నాకు ఇన్‌స్పిరేషన్‌. ‘దిల్‌రాజు ఉన్నాడు...అందుకే ఈజీగా వచ్చేస్తున్నాడు’ అనే కామెంట్స్‌ నా చెవిన పడ్డాయి. నేను బాగా పెర్‌ఫామ్‌ చేస్తే ఏదో ఒకరోజున అలాంటివాళ్లందరూ నన్ను గుర్తిస్తారు కదా అనుకున్నాను. అందుకే విమర్శలను పాజిటివ్‌గా తీసుకున్నాను.


సినిమాలో బ్రేకప్‌ సీన్స్‌ నాకు చాలా ఇష్టం. బాగా చేశాను అని నాకు అనిపించింది. ఎమోషనల్‌గా సాగే సీన్లు చేయడం నాకు ఛాలెంజింగ్‌గా అనిపించింది. నాకు రొమాంటిక్‌ కామెడీ, థ్రిల్లర్‌ సినిమాలు చేయాలని ఉంది. నా ఫేవరెట్‌ డైరెక్టర్‌ సందీప్‌రెడ్డి వంగా. ఆయనతో ఓ సినిమా చేయాలనుంది. 


యూఎస్‌లో థియేటర్‌ ఆర్ట్స్‌ చేశాను. ఆ కోర్సులో ఫైట్స్‌ కూడా నేర్చుకున్నాను. మళ్లీ రియల్‌ సతీష్‌మాస్టర్‌ ఒక వారం శిక్షణ ఇచ్చారు. దాంతో షూట్‌కు పూర్తి ఆత్మవిశ్వాసంతో వెళ్లాను. పాత్రను బాగా స్టడీ చేశాను. డైరెక్టర్‌తో కలసి 25 రోజులు వర్క్‌షాప్‌లో పాల్గొన్నాం. అందరం నటనకు కొత్తవాళ్లం కావడంతో వర్క్‌షాపులో కలసి పనిచేయడం వల్ల కెమిస్ట్రి కుదిరింది. అనుపమా కూడా ఖాళీ ఉన్నప్పుడు వర్క్‌ షాపులో పాల్గొన్నారు. 


నా యాక్టింగ్‌ కోర్సు పూర్తి చేసుకొని వచ్చాక ఒక కథ విన్నాం. నచ్చింది. కొన్ని కారణాలవల్ల ఆ ప్రాజెక్ట్‌ చేయలేకపోయాం. ఆ తర్వాత ఏడాదిన్నర వెయిట్‌ చేశాను. ‘రౌడీబాయ్స్‌’ ఐదు రోజుల షూట్‌ తర్వాత కొవిడ్‌ లాక్‌డౌన్‌ వచ్చింది. ఇలా జరిగిందేంటి అని కొంచెం ఫీలయ్యాను. మనకి బ్యాడ్‌టైమా అనిపించి కొంచెం ఫీలయ్యాను. 


సంక్రాంతికి ఏటా చిన్నప్పుడు బంధువుల పిల్లలం అందరం ఒక చోట చేరేవాళ్లం. పతంగులు ఎగురవేసేవాళ్లం. ఇంట్లో బిర్యానీ వండేవాళ్లు. కొంచెం పెద్దవాళ్లమయ్యాక హిమాయత్‌నగర్‌లో మ్యూజిక్‌ పెట్టుకొని డాన్స్‌ చేసుకుంటూ పతంగులు ఎగరేసేవాళ్లం. ఒక సంక్రాంతికి స్నేహితులం అందరం కలసి భీమవరం వెళ్లాం. ఈ సారి ప్రేక్షకులు మాకు మర్చిపోలేని బహుమతి ఇచ్చారు. ప్రమోషన్స్‌ కోసం థియేటర్లకు తిరుగుతున్నాం. అందరికీ థాంక్స్‌ చెబుతున్నాం. 


Updated Date - 2022-01-19T06:07:23+05:30 IST