సంక్రాంతి బరిలో 8 సినిమాలు.. ఆ 2 చిత్రాల మధ్యే పోటీ

కోలీవుడ్: సంక్రాంతి బరి నుండి పలు పెద్ద చిత్రాలు తప్పుకున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడి కోసం ప్రభుత్వం అనేక ఆంక్షలను విధించడంతో భారీ బడ్జెట్‌ చిత్రాల నిర్మాతలు వెనక్కి తగ్గారు. ముఖ్యంగా రాత్రి కర్ఫ్యూతో పాటు ప్రతి ఆదివారం సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు, సోమవారం నుంచి శనివారం వరకు 50 శాతం ప్రేక్షకుల సామర్థ్యంతో సినిమాల ప్రదర్శన వంటి ఆంక్షలను విధించింది. దీంతో సంక్రాంతికి విడుదల కావాల్సిన భారీ బడ్జెట్‌ చిత్రాలను వాయిదా వేశారు. ఇలాంటి వాటిలో అగ్రహీరో అజిత్‌ కుమార్‌ నటించిన ‘వలిమై’ ఒకటి. అలాగే, విశాల్‌ నటించిన ‘వీరమే వాగై సూడుమ్‌’ కూడా వెనక్కి తగ్గింది. దీంతో అనేక చిన్న బడ్జెట్‌ చిత్రాలు సంక్రాంతి బరిలోకి వచ్చాయి. వాస్తవానికి ఈ చిత్రాలన్నీ సంక్రాంతి తర్వాత విడుదల చేసేలా నిర్మాతలు ప్లాన్‌ చేశారు. ఎపుడైతే పెద్ద చిత్రాలు రేస్‌ నుంచి తప్పుకున్నాయో తమ చిత్రాలను విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు ముందుకు వచ్చారు. ఆ విధంగా ఈ సంక్రాంతిని పురస్కరించుకుని ఈ నెల 13, 14 తేదీల్లో ఎనిమిది చిత్రాలు విడుదలకానున్నాయి. 


వీటిలో ‘నాయ్‌ శేఖర్‌’, ‘ఏజీపీ’, ‘ఎన్న సొల్ల పోగిరాయ్‌’, ‘మరుద’, ‘కొంబు వచ్చ సింగండా’, ‘కార్బన్‌’, ‘ఐశ్వర్యా మురుగన్‌’, ‘పాసక్కార పయ్య’ వంటి సినిమాలున్నాయి. ఈ చిత్రాల్లో ప్రధాన పోటీ మాత్రం ‘నాయ్‌శేఖర్‌’, ‘కొంబు వచ్చ సింగండా’ మధ్య నెలకొంది. ప్రముఖ హాస్య నటుడు సతీష్‌ - పవిత్రా లక్ష్మి జంటగా కిషోర్‌ కుమార్‌ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఏజీఎస్‌ ‘నాయ్‌ శేఖర్‌’ చిత్రాన్ని నిర్మించింది. అలాగే, శశికుమార్‌ - మడొన్నా సెబాస్టియన్‌ జంటగా.. యోగిబాబు తదితరులు నటించిన ‘కొంబు వచ్చ సింగండా’ చిత్రానికి ఎస్‌.ఆర్‌. ప్రభాకరన్‌ దర్శకత్వం వహించారు. రెధాన్‌ ది సినిమా పీపుల్‌ బ్యానరులో నిర్మాత ఇంద్ర కుమార్‌ నిర్మించారు. ఈ రెండు చిత్రాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఇందులో ‘నాయ్‌ శేఖర్‌’ హాస్యభరిత చిత్రం కాగా, ‘కొంబు వచ్చ సింగండా’ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించారు.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.