పవన్‌ చెల్లెలుగానే చూస్తున్నారు!

ABN , First Publish Date - 2022-08-07T20:25:54+05:30 IST

ఏడేళ్ల క్రితమే... మలయాళంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది సంయుక్త మీనన్‌(Samyuktha Menon). ఓ డజను సినిమాలు(Movies) చేసింది. వాటితో రాని గుర్తింపు ఒక్క ‘భీమ్లా నాయక్‌’(bimla nayak)తో సంపాదించేసింది. ఈ సినిమా

పవన్‌ చెల్లెలుగానే చూస్తున్నారు!

ఏడేళ్ల క్రితమే... మలయాళంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది సంయుక్త మీనన్‌(Samyuktha Menon). ఓ డజను సినిమాలు(Movies) చేసింది. వాటితో రాని గుర్తింపు ఒక్క ‘భీమ్లా నాయక్‌’(bimla nayak)తో సంపాదించేసింది. ఈ సినిమాలో పవన్‌(Pawan Kalyan)ని ‘అన్నా..’ అని పిలిచి - తెలుగు ప్రేక్షకులందరికీ చెల్లాయి అయిపోయింది. ఇప్పుడు తెలుగులో ఏకంగా నాలుగు సినిమాలు చేస్తోంది. టాలీవుడ్‌ గురించి ఆమె ఏమంటోందంటే...


థియేటరా? క్రికెట్‌ స్టేడియమా?

‘‘భీమ్లా నాయక్‌ ఒప్పుకొంటున్నప్పుడు తెలుగు సినిమా గురించి నాకు పెద్దగా తెలీదు. కానీ చాలా విన్నాను. హీరోలను దేవుళ్లుగా చూస్తారని చెప్పుకొంటే ఆశ్చర్యపోయాను. ఈ సినిమాలో నేను హీరోయిన్‌ని కూడా కాదు. ఓ చిన్న పాత్ర అంతే. కానీ పవన్‌ కల్యాణ్‌ని ‘అన్నా..’ అని పిలిచాను. అప్పటి నుంచి నేను ఎక్కడికి వెళ్లినా పవన్‌ ఫ్యాన్స్‌ ‘చెల్లెమ్మా’ అని పిలుస్తున్నారు. ఈ సినిమాని నేను థియేటర్లో చూశా. అక్కడ కూర్చుంటే క్రికెట్‌ స్టేడియంలో ఉన్నట్టు అనిపించింది. సినిమాని ఓ పండగలా ఎలా జరుపుకొంటారో తెలుగు ప్రేక్షకుల్ని చూశాకే అర్థమైంది.’’


అప్రమత్తంగా ఉంటా!

‘‘సెట్‌కి వెళ్లే ప్రతీసారి భయపడుతూనే ఉంటా. ‘నా వల్ల ఒక్క తప్పు కూడా జరక్కూడదు’ అని దేవుడికి దణ్ణం పెట్టుకొంటా. ఎందుకంటే సినిమా అనేది వందల మంది కష్టం. ఒకరోజు షూటింగ్‌ అంటే లక్షల్లో ఖర్చవుతుంది. ప్రతీ నిమిషం విలువైనదే. అందుకే ప్రతీ క్షణం అప్రమత్తంగా ఉంటా. సెట్‌కి వెళ్లే ముందే ఆ రోజు సీన్‌ ఏంటి? నేనేం చేయాలి? అనేదాన్ని మననం చేసుకొంటా.’’



డబ్బింగ్‌ నాదే...

‘‘నా పాత్రకు మరొకరితో డబ్బింగ్‌ చెప్పించుకొంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది. తెరపై నన్ను నేను చూసుకోలేను. ‘అది నేను కాదు కదా’ అనిపిస్తుంది. అందుకే ‘భీమ్లా నాయక్‌’ ఒప్పుకొన్నప్పుడే తెలుగు నేర్చుకోవాలని ఫిక్సయ్యా. లాక్‌డౌన్‌ సమయం బాగా కలిసొచ్చింది. ఆశ మేడమ్‌ అనే ఓ ట్యూటర్‌ని నియమించుకొని తెలుగు నేర్చుకొన్నా. ‘భీమ్లా నాయక్‌’కి నేనే డబ్బింగ్‌ చెప్పుకొన్నా. ‘బింబిసార’లోనూ నా గొంతే వినిపించా. ఇప్పుడు తెలుగు బాగా వచ్చేసింది. అప్పుడప్పుడూ ఇంట్లో కూడా తెలుగే మాట్లాడుతున్నా.’’


పుస్తకాలు చదువుతా...

‘‘పవన్‌కల్యాణ్‌ చాలా కూల్‌గా ఉంటారు. విరామంలో ఆయన పుస్తకంతోనే కనిపిస్తారు. నాక్కూడా సాహిత్యం అంటే ఇష్టం. ఎక్కువగా రస్కిన్‌ పుస్తకాలు చదువుతుంటా. ఆయన శైలి అద్బుతంగా ఉంటుంది. కళ్ల ముందు ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తారు. నా చేతిలో రస్కిన్‌ పుస్తకం చూసి... ‘మీరు రస్కిన్‌ అభిమానా’ అని పవన్‌ నన్ను అడిగారు. మేమిద్దరం ఆయన రచనల గురించి మాట్లాడుకొన్నాం.’’


సెట్‌ కన్నా లొకేషన్‌ బెస్ట్‌

‘‘మలయాళం సినిమాలతో పోలిస్తే.. తెలుగు సినిమాలు, ఇక్కడి సెట్లూ చాలా భిన్నంగా అనిపించాయి. ఒక్కో సినిమానీ యేడాది పాటు తీస్తున్నారు. అదే మలయాళంలో అయితే నెల రోజుల్లో సినిమా పూర్తయిపోతుంది. అక్కడ ఇన్ని భారీ సెట్లు ఉండవు. సహజమైన వాతావరణంలోనే చిత్రీకరిస్తారు. నా వరకూ అదే ఇష్టం. ఎందుకంటే.. ప్రాంతాన్ని బట్టి భాష మారిపోతుంది. యాస మారిపోతుంది. తెలుగులో చూడండి. రాజమండ్రిలో ఒకలా మాట్లాడతారు. వరంగల్‌లో మరోలా మాట్లాడతారు. నిజంగా వరంగల్‌లో షూటింగ్‌ చేస్తే.. అక్కడి వాతావరణాన్ని, భాషని, ప్రజల నడవడికను అర్థం చేసుకొనే అవకాశం ఉంటుంది. అది మన నటనలో చాలా మార్పు తీసుకొస్తుంది.’’


Updated Date - 2022-08-07T20:25:54+05:30 IST