నా అతిని భరించినంతకాలం సినిమాలు చేస్తూనే ఉంటా: సంపూ

బర్నింగ్‌ స్టార్ సంపూర్ణేష్‌బాబు హీరోగా ఆర్కే మలినేని దర్శకత్వంలో గుడూరు శ్రీధర్‌ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణా టాకీస్‌ పతాకాలపై ఆశా జ్యోతి గోగినేని నిర్మించిన చిత్రం ‘క్యాలీ ఫ్లవర్‌’. ‘శీలో రక్షతి రక్షిత:’ అనేది ఉపశీర్షిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబరు 26న థియేటర్స్‌లో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హీరో సంపూర్ణేష్‌బాబు మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు.


ఆయన మాట్లాడుతూ.. ‘‘ ‘క్యాలీఫ్లవర్‌’ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్నాను. పెద్దాయన ఆండ్రి ఫ్లవర్ అయితే రెండో పాత్రకు క్యాలీఫ్లవర్ అనిపెట్టారు. క్యాలీఫ్లవర్ అనే టైటిల్ ఎందుకు పెట్టారు అని నేనూ అడిగాను. క్యారెక్టర్ పాత్ర పేరు కూడా అదే.. ఒకానొక సమయంలో కాపాడే కవచంగా కూడా మారుతుందని డైరెక్టర్ అన్నారు. శీలం అనేది ఆడవాళ్లకే కాదు.. మగవాళ్లకు కూడా ముఖ్యం. అది కనుక పాటిస్తే ప్రపంచంలో ఎలాంటి సమస్యలు ఉండవు అనే పాయింట్ చెప్పాడు. కొత్త చెబుతున్నాడని అనిపించింది.. అంతే వెంటనే ఓకే చెప్పేశాను. కొబ్బరిమట్టలో చెప్పినట్టుగా సినిమా అంతా భారీ, లెంగ్తీ డైలాగ్స్ ఉండవు కానీ కోర్ట్ సీన్‌లో మాత్రం అలాంటి డైలాగ్స్ ఉంటాయి. 35 ఏళ్లు వచ్చే వరకు పెళ్లి చేసుకోకూడదని వంశపారపర్యంగా వస్తుంది. అందుకే అంత వరకు పవిత్రంగా ఉండాలని, ఏ అమ్మాయి కూడా దగ్గరగా వచ్చి మాట్లాడకూడదని, అంత దూరంలో ఉండాలని ఆ స్కేల్ వాడాం.

ఈ సినిమాలో గెటప్స్ బాగా సెట్ అయ్యాయి.. హీరో రేప్‌కు గురవ్వడం, ఆ తరువాత వచ్చే పాటలు ఇలా అన్నీ బాగుంటాయి. అందరూ ఎంజాయ్ చేస్తారు. అందుకే హృదయ కాలేయం, కొబ్బరిమట్ట సినిమాల్లా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. డైరెక్టర్ ఆర్కే ఇంతకు ముందు సీరియల్స్ చేశారు. ఈ కథను ఎప్పటి నుంచో అనుకున్నారట. సంపూర్ణేష్ బాబు అయితే బాగుంటుందని అనుకున్నారట. అలా నా వద్దకు ఈ కథ వచ్చింది. ఇందులో నేను ఫ్లోర్ మూమెంట్స్ వంటివి ఏం చేయలేదు. కానీ కొన్ని స్టెప్స్ కొత్తగా ట్రై చేశాను.


నేను ఎంత అతి చేసినా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఇంకా చెప్పాలంటే నేను అతి చేస్తేనే ఆదరిస్తారు. రొటీన్ హీరోల్లా చేస్తే నా సినిమా ఎవ్వరూ చూడరు. ఇది దృష్టిలో పెట్టుకునే నా కోసం కథలు రాస్తుంటారు. హ‌ృదయ కాలేయంలో చితిలోంచి లేచి రావడం, కొబ్బరిమట్టలో కొడితే సుమో చేతిలోకి వస్తుంది. అది మరీ పరాకాష్ట. సింగం 123లో ఇంట్లో స్మిమ్మింగ్ పూల్‌లో దూకితే ఎక్కడో సముద్రంలో తేలుతా.. ఇలాంటి అతి ఉంటేనే నా సినిమా ప్రేక్షకులకి నచ్చుతుంది. ఈ అతిని భరించినంతకాలం ఇటువంటి సినిమాలు చేస్తూనే ఉంటా. నా వరకు ఈ రోజు సంతోషంగా ఉన్నామా? రేపు మంచిగా ఉంటామనే నమ్మకం ఉందా? అనే ఆలోచిస్తాను. నటుడిగా ఏం చేయడానికైనా రెడీ. ఏ పాత్రలు వస్తే అవి చేస్తాను. ప్రస్తుతం హీరోగా నాలుగు సినిమాలు చేస్తున్నాను. అందుకే గెస్ట్ అప్పియరెన్స్ ఎక్కువగా చేయలేకపోతోన్నాను. ఒక సినిమాలో ఓ క్యారెక్టర్ వేశాను. నరసింహాచారి నుంచి సంపూగా ఎదగడం, ఆటోలో తిరగడం నుంచి ఫ్లైట్‌లో తిరిగే స్థాయి వరకు వచ్చాను. అదే నాకు సంతోషం. ప్రస్తుతం నా చేతిలో ఐదు సినిమాలు ఉండటం అదృష్టం. ఉన్నదాంట్లో ఎంతో కొంత దానం చేయడం నాకు ఆనందంగా ఉంటుంది. అది నిజంగా తెలియని సంతృప్తినిస్తుంటుంది..’’ అని తెలిపారు.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.