‘Sameer Wankhede సలామ్’ అంటోన్న హిందూ సేన... ‘మేం హిందువులమే’ అంటూ భార్య ట్వీట్!

ABN , First Publish Date - 2021-10-27T03:04:43+05:30 IST

ఎన్సీబీ ఢిల్లీ ఆఫీస్ బయట దర్శనమిచ్చిన పోస్టర్లని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు మంగళవారం తొలగించారు. ఎన్సీబీ ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేకు మద్దతుగా ఈ ప్రత్యేక పోస్టర్లు వెలిశాయి...

‘Sameer Wankhede సలామ్’ అంటోన్న హిందూ సేన... ‘మేం హిందువులమే’ అంటూ భార్య ట్వీట్!

ఎన్సీబీ ఢిల్లీ ఆఫీస్ బయట దర్శనమిచ్చిన పోస్టర్లని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు మంగళవారం తొలగించారు. ఎన్సీబీ ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేకు మద్దతుగా ఈ ప్రత్యేక పోస్టర్లు వెలిశాయి. ‘సమీర్ వాంఖడే కో సలామ్’ అని వాటిపై రాసి ఉండటంతో ఒకింత కలకలం రేగింది. షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ని అరెస్ట్ చేయటంతో ఆయనకు ‘హిందూ సేన’ అనే సంస్థ ‘సలామ్’ చేస్తున్నామంటూ మద్దతు పలికింది! డ్రగ్స్ కేసు కేసు విషయం కాస్తా హిందూ, ముస్లిమ్ రంగు పులుముకుంటుండటంతో ఎన్సీబీ అధికారులు తమ ఆఫీస్ బయట కనిపించిన వివాదాస్పద పోస్టర్లని తొలగించారు... 


సమీర్ వాంఖడే ఢిల్లీ నుంచీ ముంబై దాకా వార్తల్లో నిలుస్తున్నారు. షారుఖ్ కొడుకుని ఆయన అరెస్ట్ చేయటంతో గత కొన్ని రోజులుగా పెద్ద దుమారమే రేగుతోంది. అయితే, అతడి మతం ఇదంటూ, అదంటూ నానా రచ్చ కూడా మరో వైపు జరుగుతోంది. మహారాష్ట్రలోని ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నవాబ్ మాలిక్ వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నాడు. సమీర్ వాంఖడే తల్లి ముస్లిమ్ అంటూ, తండ్రి కూడా మతం మారాడంటూ ఆయన కామెంట్స్ చేశాడు. దానిపై స్సందించిన సమీర్ వాంఖడే ‘‘నా తండ్రి హిందూ, నా తల్లి ముస్లిమ్. మా కుటుంబం సెక్యులర్ ఫ్యామిలీ’’ అంటూ వివరణ ఇచ్చారు. వాంఖడే భార్య కూడా తాజాగా తమ మతం గురించి వివరించింది. ‘‘సమీర్ మొదటి పెళ్లి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం జరిగింది. మా ఇద్దరి పెళ్లి మాత్రం ‘2017 హిందూ వివాహ చట్టం’ ప్రకారం జరిగింది...’’ అని ఆమె ట్వీట్ చేసింది. తాము ఇద్దరూ పుట్టుకతోనే హిందువులమని కూడా మిసెస్ సమీర్ వాంఖడే అన్నారు. తాను కానీ... భర్త సమీర్ కానీ... ఎప్పుడూ మరే మతంలోకి మారలేదని క్రాంతి రెడ్కర్ వాంఖడే స్పష్టతనిచ్చారు.

Updated Date - 2021-10-27T03:04:43+05:30 IST