Yashoda Film Review: కొత్తదనం కోరుకునేవాళ్ళకి 'యశోద'

Twitter IconWatsapp IconFacebook Icon
Yashoda Film Review: కొత్తదనం కోరుకునేవాళ్ళకి యశోద

సినిమా: యశోద 

నటీనటులు: సమంత, వరలక్ష్మి, రావు రమేష్, ఉన్ని ముకుందన్, మురళి శర్మ, సంపత్, శత్రు, తదితరులు 

సినిమాటోగ్రఫీ: ఎం సుకుమార్ 

సంగీతం: మని శర్మ 

దర్శకత్వం: హరి మరియు హరీష్ 

నిర్మాత: శివలెంక కృష్ణ ప్రసాద్ 


-- సురేష్ కవిరాయని


సమంత రుత్ ప్రభు (#SamanthaRuthPrabhu) ఇప్పుడు వార్తల్లో వున్న వ్యక్తి.  ఒక పక్క ఆమె సినిమా 'యశోద' (#Yashoda) విడుదల అయింది, ఇంకో పక్క ఆమె ఆరోగ్యం మీద అనేక వార్తలు సాంఘీక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇలా ఉన్న సమయంలో ఆరోగ్యం సహకరించకపోయినా సినిమా కోసమని ఒక వీడియో ఇంటర్వ్యూ, అలాగే తన సాంఘీక మాధ్యమాల్లో కొన్ని ఫోటోస్ షేర్ చేసి సినిమా కోసం ప్రచారం చేసింది సమంత. దానికి తోడు ఈ సినిమా ప్రచార వీడియోస్ కూడా ఆసక్తికరంగా ఉండటం, అందులో ఇప్పుడు నడుస్తున్న వార్త 'సరోగసి'  మీద సినిమా కథ ఉండటం, మరింత ఆసక్తిని రేపింది. హరి మరియు హరీష్ ఇద్దరు దీనికి దర్శకత్వం వహించగా, మని శర్మ సంగీతం అందించారు. శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాత. వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్ లాంటి నటులు కూడా వున్నారు. సినిమా ఎలా ఉందొ చూద్దాం. 

Yashoda Film Review: కొత్తదనం కోరుకునేవాళ్ళకి యశోద

(Yashoda story) కథ:

యశోద (సమంత) తన చెల్లెలి ఆపరేషన్ కోసం డబ్బులు కావాలని సరోగసీ బిడ్డని కనడానికి ఒప్పుకుంటుంది. ఆమెని ఎవా అనే క్లినిక్ కి తీసుకెళ్లి అక్కడ ఉంచుతారు. ఆ క్లినిక్ లో సమంత లా చాలామంది అయిదు, ఏడు, ఎనిమిది నెలల గర్భిణీలు చాలామంది వుంటారు. ఆ క్లినిక్ ని మధు (వరలక్ష్మి శరత్ కుమార్) అనే ఆమె నడుపుతూ ఉంటుంది, ఆమెకి డాక్టర్ గౌతమ్ (ఉన్ని ముకుందన్) సహాయం చేస్తూ ఉంటాడు. ఇంకో వేపు ఒక టాప్ మోడల్, ఒక వ్యాపారవేత్త కారులో వెళుతూ ఆక్సిడెంట్ కి గురయి చనిపోతారు. అది ఆక్సిడెంట్ కాదు, మర్డర్ అన్న కోణం లో ఒక పోలీస్ ఆఫీసర్ (శత్రు) పరిశోధన చేస్తాడు. పోలీస్ కమీషనర్ (మురళి శర్మ) ఒక సీనియర్ ఆఫీసర్ (సంపత్) నాయకత్వంలో శత్రు, మరికొందరు పోలీస్ ఆఫీసర్ లను ఇచ్చి ఈ మర్డర్ మిస్టరీ ని ఛేదించమని చెప్తాడు. బాగా డబ్బున్న విదేశీ వనితలు ఆరు నెలలకి ఒకసారి ఎందుకు హైదరాబాద్ వచ్చి వెళుతుంటారు, అలాగే ఒక టాప్ హాలీవుడ్ నటీమణి మరణం వెనక ఎవరున్నారు, ఇవన్నీ సందేహాలు వస్తాయి. ఈ మర్డర్ మిస్టరీల వెనక ఎవరున్నారు, వాళ్ళని ఎందుకు మర్డర్ చెయ్యాల్సి వచ్చింది, అలాగే సమంత వున్న ఎవా క్లినిక్ లో  ఏమి జరుగుతోంది, ఈ రెండిటికి ఏమైనా సంబంధం వుందా, ఏంటి అనే సస్పెన్స్ స్క్రీన్ మీద చూడాల్సిందే. 

Yashoda Film Review: కొత్తదనం కోరుకునేవాళ్ళకి యశోద

విశ్లేషణ : 

హరి మరియు హరీష్ లు దర్శకత్వ ద్వయం తమిళ సినిమాలు కొన్ని చేసి, ఇప్పుడు ఈ 'యశోద' సినిమాతో తెలుగులో ఆరంగేట్రం చేశారు. వీళ్ళు ఇద్దరూ ఇంటర్నెట్ లో వచ్చిన వార్తల ఆధారంగా ఈ కథని తాయారు చేసాము అని చెప్పారు. అలాగే 'సరోగసీ' అనే విషయం ఇప్పుడు ఎక్కడా పెద్దగా చర్చల్లో వుంది. ఈ సినిమాలో కూడా అదే పాయింట్ తీసుకొని, దాని చుట్టూ కథ అల్లి, ఇంకా 'సరోగసి' కన్నా పెద్ద విషయాన్ని  చెప్పాలనుకున్నారు. ఈ విషయం తెలుగు ప్రేక్షకులకి చాలా కొత్తగా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి సబ్జెక్టు ఎవరూ తెలుగులో ఇంతవరకు చెప్పలేదు. 'సరోగసి' మీద సినిమాలు వచ్చాయి కానీ, అసలు దాని వెనక వున్నా ఇంకో పెద్ద మాఫియా ఎలా దాగి వుంది, అసలు 'సరోగసి' అన్నది డబ్బున్న వాళ్ళకి పిల్లలు కనడానికేనా, లేక ఇంకేమయిన కారణాలు ఉన్నాయా అన్నది లోతుగా చూపించారు కథలో.  దర్శకులు వాళ్ళు ఏమి చెప్పాలని అనుకున్నారో అదే చెప్పారు స్క్రీన్ మీద, అనవసరంగా ఎక్కడా సాగదీయకుండా. అందుకే సినిమా నిడివి కూడా తక్కువగానే ఉంటుంది. 

Yashoda Film Review: కొత్తదనం కోరుకునేవాళ్ళకి యశోద

ఇందులో 'యశోద' క్యారక్టర్ వేసిన సమంత చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది. అలాగని ఆమెని ఎదో మామూలుగా చూపెట్టలేదు, ఒక హీరో లాగా చూపించారు. భావేద్వేగాలు కూడా వున్నాయి, అవి కూడా బాగా కనెక్ట్ అయ్యేట్టు చూపించారు. క్లినిక్ లో గర్భిణీలు అక్కడ ఏమి జరుగుతోంది అన్న విషయం కూడా కొంచెం కొంచెం చూపించారు చాల తెలివిగా. ఎందుకంటే వాళ్ళ మీదే ఎక్కువ ఫోకస్ పెడితే చూస్తే ప్రేక్షకుడికి బోర్ కొడుతుంది, అందుకని వాళ్ళని కొంచెం చూపించి, మళ్ళీ క్లినిక్ బయట ఏమి జరుగుతోందో కథలోకి వెళుతూ స్క్రీన్ ప్లే కూడా చక్కగా అందించారు ఇద్దరు దర్శకులు. సినిమా మొదలు పెట్టడమే చాలా ఆసక్తికరంగా పెట్టి, అలాగే ఆ టెంపో ని మెన్ టైన్  చేసుకుంటూ వెళ్లారు.  క్లైమాక్స్ కొంచెం హడావిడిగా చేసినట్టు అనిపించింది. రెండో సగం మీద ఇంకా బాగా దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. కొన్ని సన్నివేశాలు ఆలా సినిమాటిక్ గా వచ్చి వెళ్లిపోతాయి. కానీ చివర్లో ఆ న్యూస్ క్లిప్పింగ్స్ వెయ్యటం వలన నిజంగా ఇలా జరుగుతుందా అని ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్ ల ఫ్లాష్ బాక్ కథ ఇంకా కొంచెం బాగా చెప్పి ఉంటే బాగుండేది. ఏమైనా కూడా సినిమాలో కొన్ని లోపలున్నా, కొత్త కథ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ జంట దర్శకులుని అభినందించాల్సిందే. చేసిన సమంత ని కూడా.  

Yashoda Film Review: కొత్తదనం కోరుకునేవాళ్ళకి యశోద

ఇంక నటీనటుల విషయానికి వస్తే, సమంత నీ సినిమా మొత్తం. చాలా బాగా చేసింది. పాత్రలో ఇమిడిపోవడమే కాకుండా, తన డైలాగ్స్ తానే చెప్పుకోవటం వలన, భావోద్వేగాలు ఇంకా బాగా వచ్చాయి. పోరాట సన్నివేశాల్లో కూడా అద్భుతంగా చేసింది. అలాగే చివర్లో ఆమె 'ధైర్యం మగాడికే ఉంటుందా' అన్న డైలాగ్ చెప్పినప్పుడు క్లాప్స్ కూడా పడతాయి. ఆమె బాగా చేసింది. వరలక్ష్మి శరత్ కుమార్ చాల సినిమాల్లో నెగటివ్ రోల్స్ వేసింది, ఇందులో కూడా చక్కగా చేసింది. సమంత ఒక పక్క అయితే, వరలక్ష్మి ఇంకో వేపు తన పాత్ర ద్వారా మెప్పించింది. ఉన్ని ముకుందన్ తన పాత్రకి తగ్గట్టు నటించాడు. మురళి శర్మ, శత్రు, సంపత్ అందరూ బాగా సపోర్ట్ చేసారు. సినిమా చాల సీరియస్ గా నడుస్తుంటే, రావు రమేష్ పాత్ర మాత్రం చిన్నగా నవ్విస్తుంది. అతని రోల్ కొంచెం పెంచి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. క్లినిక్ లో చాలామంది కనిపిస్తారు, అందులో దివ్య శ్రీ పాద గర్భిణీ గా వేసిన పాత్ర బాగుంది. 


ఇంక మణిశర్మ నేపధ్య సంగీతం సినిమాకి ఒక హైలైట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మణిశర్మ సీనియర్ సంగీత దర్శకుడు అందులోకి నేపధ్య సంగీతం ఇవ్వటం లో దిట్ట, అందుకని ఈ సినిమాకి అతను ఒక మూల స్థంభం లా నిలుచున్నారు. అలాగే క్లినిక్ సెట్ చాల బాగా వేసాడు అశోక్. ఎందుకంటే అదే సినిమాకి ఆయువుపట్టు, అందులోనే కథ నడుస్తుంది. సెట్స్ బాగున్నాయి. పులగం చిన్నారాయణ, చల్లా భాగ్యలక్ష్మి లు మాటలు చక్కగా రాసారు. అక్కడ ఎంతవరకు కావాలో అలానే రాసారు, అంతే కానీ ఎదో హైప్ కోసం, వేరే దాని కోసం రాయలేదు. 


చివరగా 'యశోద' సినిమా ఒక కొత్త కథతో, కాన్సెప్ట్ తో వచ్చింది. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకి ఇది కచ్చితంగా నచుతుంది. సమంతని అభిమానించే వాళ్ళకి ఈ సినిమా ఇంకా బాగా నచుతుంది. హరి మరియు హరీష్ లు కొత్తదనం తో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టడం హర్షణీయం. 'యశోద' ఒక భావోద్వేగాలతో కూడిన థ్రిల్లర్ సినిమా. అక్కడక్కడా చిన్న చిన్న లోపాలున్నా, సినిమా ఆసక్తికరంగా ఉంటుంది. చూడొచ్చు. 

(#YashodaFilm #Samantha #Hari&Harish #Surrogacy #UnniMukundan #MuraliSharma)

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.