సల్మాన్ ఖాన్ వేసిన పరువు నష్టం దావాను కొట్టేసిన కోర్టు
ABN , First Publish Date - 2022-01-15T23:10:17+05:30 IST
బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు సల్మాన్ ఖాన్. తన పుట్టిన రోజు సందర్భంగా భాయిజాన్ వరుస సినిమాలను ప్రకటించారు

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు సల్మాన్ ఖాన్. తన పుట్టిన రోజు సందర్భంగా భాయిజాన్ వరుస సినిమాలను ప్రకటించారు. ‘‘బజరంగీ భాయిజాన్’’ సీక్వెల్‌కు ‘‘పవన్ పుత్ర భాయిజాన్’’ అని టైటిల్ పెట్టామని చెప్పారు. అయితే, సల్లూ భాయ్ తన పన్వేల్ ఫామ్‌హౌస్ పొరుగున ఉండే మరో వ్యక్తిపై ముంబై సిటి సివిల్ కోర్టులో పరువు నష్టం దావా వేయగా... ఆయనకు న్యాయస్థానంలో చుక్కెదురైంది. సల్మాన్ పిటిషన్‌ను కోర్టు కొట్టి వేసింది. వివరాల్లోకి వెళ్లితే..
ముంబైలోని పన్వేల్ ప్రాంతంలో సల్మాన్ ఖాన్ ఫాంహౌస్ ఉన్న సంగతి తెలిసిందే. ఆ ఫాంహౌస్ పక్కనే ఉన్న స్థలాన్ని ఖేతన్ కక్కడ్ అనే వ్యక్తి కొనుగోలు చేశారు. ఖేతన్ ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ.. సల్మాన్ పైనా, అతడి ఫాంహౌస్‌పైనా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు తన పరువుకు నష్టం చేకూర్చే విధంగా ఉన్నాయని, భవిష్యత్తులో తనపై అటువంటి వ్యాఖ్యలు చేయకుండా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టులో సల్మాన్ పిటిషన్ దాఖలు చేశారు. ఖేతన్ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూ నుంచి ఆ వ్యాఖ్యలను తొలగించాలని కోరారు. ఆ పిటిషన్ విచారణ చేపట్టబోమని కోర్టు వ్యాఖ్యానించింది. ఖేతన్ కక్కడ్ గురించి చేస్తోన్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలంది. ఆ పిటిషన్‌ను కొట్టివేస్తూ తదుపరి విచారణను ఈనెల 21కి వాయిదా వేస్తూ శుక్రవారం జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు.