నాలుగు తరాల నుంచి ఇదే వింటున్నాం.. దీనికి ఎలాంటి ఢోకా లేదు: Salman Khan
ABN , First Publish Date - 2021-11-23T18:14:51+05:30 IST
ఇంతకుముందు ఎవరైనా యాక్టింగ్ కెరీర్‌గా ఎంచుకోవాలంటే వెండితెర మాత్రమే మార్గంగా కనిపించేది. కానీ కోవిడ్-19 నేపథ్యంలో లాక్‌డౌన్ జరిగి అన్ని రంగాల్లో ఎన్నో మార్పులు సంభవించిన సంగతి తెలిసిందే

ఇంతకుముందు ఎవరైనా యాక్టింగ్ కెరీర్‌గా ఎంచుకోవాలంటే వెండితెర మాత్రమే మార్గంగా కనిపించేది. కానీ కోవిడ్-19 నేపథ్యంలో లాక్‌డౌన్ జరిగి అన్ని రంగాల్లో ఎన్నో మార్పులు సంభవించిన సంగతి తెలిసిందే. అలాగే సినిమా రంగంలోనూ జరిగి వచ్చిన ఓటీటీ ఔత్సాహిక నటీనటులకి ఒక వరంగా మారిపోయింది. దీంతో వారి స్టార్ వాల్యూతో సంబంధం లేకుండా ఎంతోమంది కొత్త నటులు తెర మీదకి వచ్చారు. దీంతో చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్‌డమ్‌కి అంతం మొదలైందని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ విషయంపై తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ స్పందించాడు.
సల్మాన్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘అంతిమ్: ది ఫైనల్ ట్రూత్’. సల్లు భాయ్ హీరోగా నటిస్తున్న సినిమాలో ఆయన చెల్లెలి భర్త ఆయుష్ శర్మ విలన్‌గా చేస్తున్నాడు. నవంబర్ 25న విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో మట్లాడాడు ఈ స్టార్.
ఈ సందర్భంగా ‘స్టార్‌డమ్ త్వరలో ఎండ్ అవుతుందా?’ అని ఓ రిపోర్టర్ అడగగా.. ‘నేను అలా అనుకోవట్లేదు. మేము వెళితే ఆ స్థానంలోకి కొత్త వాళ్లు వస్తారు. ఇది ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. కాకపోతే ఇది ఎన్నో విషయాల కలయిక. మూవీస్ ఎంపిక, నిజ జీవితంలో ఉండే విధానంవంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. కొత్త తరం కోసం సూపర్ స్టార్‌డమ్ ఎదురుచూస్తోంద’ని సల్మాన్ చెప్పాడు. అంతేకాకుండా గత నాలుగు తరాల నుంచి ఇలాంటి మాటలే వింటున్నామని, కానీ స్టార్‌డమ్‌కి ఎలాంటి సమస్య రాలేదని తెలిపాడు. కష్టపడి పని చేస్తే స్టార్‌గా ముద్ర వేసుకోవచ్చని ఈ కండల వీరుడు పేర్కొన్నాడు.
అయితే, కాగా సల్లు భాయ్ గత చిత్రం ‘రాధే’కి ప్రభుదేవా దర్శకత్వం వహించగా.. ఆ సినిమా థియేటర్స్‌తో పాటు ఓటీటీలో ఒకేసారి విడుదలై మిక్స్‌డ్ టాక్‌ని సాధించింది. కాగా 2018 మరాఠీ సినిమా ‘ముస్లీ ప్యాట్రన్’కి రిమేక్‌గా వస్తున్న సల్మాన్ తాజా చిత్రానికి మహేశ్ మజ్రేకర్ దర్శకత్వం వహిస్తుండగా.. ఇది కేవలం థియేటర్స్‌లో మాత్రమే రిలీజ్ కానుంది.