సిద్దార్థ్ ట్వీట్‌కు కౌంటర్ ఇచ్చిన సైనా నెహ్వాల్

హీరో సిద్దార్థ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో సైనా నెహ్వాల్ స్పందించింది. ‘‘ ఆయన ఏం ట్వీట్ చేశారో నాకు తెలియదు. కానీ, నటుడిగా అతడంటే నాకు ఇష్టం. అతడు తన అభిప్రాయాన్ని మంచి పదాలతో వ్యక్తం చేస్తే బాగుండేది. ట్విట్టర్‌లో ఇలాంటి వ్యాఖ్యలతో గుర్తింపు వస్తుందని సిద్దార్థ్ అనుకుంటున్నారు.  ప్రధాని భద్రతే సమస్య అయితే.. దేశంలో ఏది భద్రమయిందో నాకు తెలియదు’’ అని సైనా నెహ్వాల్ తెలిపింది. 


గత వారంలో ప్రధాని నరేంద్రమోదీ పంజాబ్‌లోని ఒక సభలో పాల్గొనాల్సి ఉంది. నిరసనకారులు మోదీ కాన్వాయ్‌ను ప్లైఓవర్‌పై దాదాపుగా 20నిమిషాలు అడ్డగించారు. దీంతో సభ రద్దయిపోయింది. సభలో పాల్గొనకుండానే ఆయన వెనుదిరిగాల్సి వచ్చింది. ఆ ఘటనను ఉద్దేశిస్తూ సైనా నెహ్వాల్ ఒక ట్వీట్ చేసింది. ‘‘  ప్రధాని మోదీకే  భద్రత లభించనప్పుడు మన దేశం సురక్షితమైనదని చెప్పలేం. ప్రధానిపై అరాచకవాదుల  పిరికిపంద చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను ’’ అని సైనా నెహ్వాల్ ట్వీట్ చేసింది. సైనా చేసిన ట్వీట్ ను సిద్దార్థ్ రీ ట్వీట్ చేశాడు. ‘‘కాక్ ఛాంపియన్ ఆఫ్ ది వరల్డ్. థాంక్ గాడ్ ప్రొటెక్టర్స్ ఆఫ్ ఇండియా..షేమ్ యూ రిహన్నా ’’ అని సిద్దార్థ్ ట్వీట్ చేశాడు. సైనాను ‘‘కాక్ ఛాంపియన్ ఆఫ్ ది వరల్డ్ ’’ అనడంతో ఆ ట్వీట్‌పై దుమారం రేగింది.

 

సిద్దార్థ్ చేసిన ట్వీట్‌ను పలువురు ప్రముఖులు ఖండించారు. శివసేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది హీరో వ్యాఖ్యలను ఖండించింది. సింగర్ చిన్మయి శ్రీపాద కూడా సిద్దార్థ్‌కు వ్యతిరేకంగా గళమెత్తింది. ‘‘ సిద్దార్థ్ ఇది చాలా దారుణం. మీటూ ఉద్యమంలో అనేక మంది మహిళలకు మద్దతుగా మీరు మాట్లాడారు. కాక్ అనే పదానికి మరో అర్థం ఉంది. సైనాను ఆ పదంతో సంబోధించడం అవమాన‌కరం ’’ అని చిన్మయి శ్రీపాద ట్వీట్ చేసింది. సైనాకు మద్దతుగా పారపల్లి కశ్యప్ కూడా ట్వీట్ చేశాడు. ‘‘ అభిప్రాయం చెప్పడం తప్పు కాదు. కానీ, చెప్పేటప్పుడు సరైన పదాలు ఉపయోగించాలి ’’ అని కశ్యప్ ట్వీట్ చేశాడు

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.