ఖచ్చితంగా అది తప్పే.. ఏపీ ప్రభుత్వం పునరాలోచించాలి: సాయిమాధవ్ బుర్రా

ABN , First Publish Date - 2022-01-25T22:48:28+05:30 IST

ఖచ్చితంగా అది తప్పే. ఎంత పెద్ద తప్పంటే.. ఒక పవిత్రమైన దేవాలయంలో డస్ట్ ఎక్కువగా ఉందని.. ఆ డస్ట్ క్లీన్ చేయకుండా, ఆ దేవాలయాన్ని కూల్చేసినంత తప్పు. అంత పెద్ద తప్పు అది. అయితే ఇక్కడ ఒక్కటి మాత్రం

ఖచ్చితంగా అది తప్పే.. ఏపీ ప్రభుత్వం పునరాలోచించాలి: సాయిమాధవ్ బుర్రా

సంఘసంస్కరణ ఉద్యమంలో భాగంగా చింతామణి నాటకాన్ని నాడు కాళ్ళకూరి నారాయణరావు రాయటం జరిగిందని, తెలుగు నాటకానికి మాత్రమే ప్రత్యేకమైన పద్యం ఎంత గొప్పదో తెలియజెప్పిన నాటకం ‘చింతామణి’ అని అన్నారు ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా. ఏపీ ప్రభుత్వం ఈ నాటకాన్ని నిషేధించటం సరైన నిర్ణయం కాదన్నారు. ఈ నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం పునరాలోచించాలని తెలుపుతూ.. ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అందులో..


‘‘ఏపీలో చింతామణి నాటకాన్ని నిషేధించారు. దాని గురించి మాట్లాడాల్సి వస్తే.. ఖచ్చితంగా అది తప్పే. ఎంత పెద్ద తప్పంటే.. ఒక పవిత్రమైన దేవాలయంలో డస్ట్ ఎక్కువగా ఉందని.. ఆ డస్ట్ క్లీన్ చేయకుండా, ఆ దేవాలయాన్ని కూల్చేసినంత తప్పు. అంత పెద్ద తప్పు అది. అయితే ఇక్కడ ఒక్కటి మాత్రం క్లియర్‌గా చెప్పగలను. కళాకారులకు కీడు తలపెడదాం.. నాటకరంగానికి కీడు తలపెడదాం అని ప్రభుత్వం చేసిన పని అయితే ఇది కాదు. ఎందుకంటే.. కళాకారులకు, రంగస్థలానికి కీడు చేద్దామనే ఆలోచన ఏ ప్రభుత్వానికైనా ఎందుకు ఉంటుంది? దాని వల్ల వారికి వచ్చే లాభం ఏముంటుంది? ఒకవేళ లాభం ఉంటే మాత్రం అది ఏ పార్టీ అయినా చేసేస్తారు. అందులో సమస్యే లేదు. కానీ ఇందులో ఏం లాభం లేదు. ఏదో చేద్దామని అనుకుంటే.. ఏదో జరిగింది.. అంతకుమించి ఏమీ లేదు. అయితే ఈ తప్పు జరగడానికి అసలు మూలం ఏమిటనేది ఆలోచిద్దాం. 


కళాకారుల నుండి మొదలైంది. కాళ్ళకూరి నారాయణరావుగారనే ఓ మహానుభావుడు సంఘసంస్కరణ ఉద్యమంలో భాగంగా.. సంఘసంస్కరణాభిలాషిగా ఈ నాటకాన్ని రాశారు. వేశ్య మోహంలో పడితే.. ఎంతటి వాడైనా ఎంతగా దిగజారిపోతాడనేది తెలియజేయడానికి ఈ నాటకం రాశారు. అందులోని ప్రతి మాటా, ప్రతి పద్యం ఒక అద్భుతం.. అమృతం. తెలుగు నాటకానికి మాత్రమే ప్రత్యేకమైనటువంటి పద్యం ఎంత గొప్పదో ప్రపంచానికి చెప్పే నాటకం చింతామణి. అంత గొప్ప నాటకాన్ని.. తర్వాత్తర్వాత కాళ్ళకూరి నారాయణరావుగారు రాయని బూతులను చొప్పించి.. ఆ నాటకాన్ని అపవిత్రం చేశారు. చేసింది కళాకారులే.. తప్పు అక్కడి నుండే జరిగింది. అసలు తెలుగు నాటక రంగంలో నాటకాన్ని నిన్నటి వరకు బతికించింది, ఇప్పుడు బతికిస్తుందీ కూడా 75 శాతం ఆర్యవైశ్యులే. వాళ్లే నాటకరంగాన్ని బతికిస్తున్నారు. అలాంటి ఆర్యవైశ్యులే.. మా మనోభావాలు దెబ్బతింటున్నాయి.. ఆ నాటకం బ్యాన్ చేయండి అనే స్థాయికి తీసుకువచ్చారు. సో.. తప్పు అక్కడి నుండే మొదలైంది.. కాదని ఎవరూ అనకూడదు. తప్పు చేశామని ఒప్పుకోవాలి. బ్యాన్ చేసే స్థాయికి తీసుకువచ్చాం. అయితే నేను చెప్పొచ్చేది ఏమిటంటే.. దీనిని బ్యాన్ చేయకూడదు.. చేయాల్సింది వేరే ఉంది. అదేమిటంటే, ఆ నాటకం ఒక అందమైన అమ్మాయి అనుకుంటే.. ఆ అమ్మాయికి ఏదో జబ్బు ఉందని ఆసుపత్రికి వస్తే.. ఆమె జబ్బుని నయం చేయాలి కానీ.. ఆ అమ్మాయిని చంపేస్తారా? వందేళ్ల నుండి బతికి ఉన్న నాటకాన్ని ఎలా చంపేస్తారు? 100 సంవత్సరాలు ఒక మనిషి బతికి ఉంటే.. అయ్యయ్యో.. వందేళ్లు బతికి ఉన్నాడు అని చంపేస్తామా? కాళ్లకి నమస్కారం చేసి ఆశీస్సులు తీసుకుంటాం. అలాగే ‘చింతామణి’ నాటకంలో చొప్పించబడ్డ బూతుల్ని తీసేసి.. నాటక ప్రదర్శనకు అనుమతి ఇవ్వాలని, ప్రభుత్వం వారు దీనిపై పునరాలోచించాల్సిందిగా కోరుతున్నాను..’’ అని సాయిమాధవ్ బుర్రా తెలిపారు.

Updated Date - 2022-01-25T22:48:28+05:30 IST