సాయిధరమ్ తేజ్ పంపిన ఆడియో మెసేజ్ ఇదే..

సాయిధరమ్ తేజ్ హీరోగా దేవ్ కట్టా దర్శకత్వంలో జీబీ ఎంటర్టైన్మెంట్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘రిపబ్లిక్’. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ అధికారులు, పాలకులు, ప్రజల పాత్ర ఏమిటన్నది వివరిస్తూ రూపొందిన చిత్రమిది. విడుదల తర్వాత ప్రజలను చైతన్యపరిచేలా ఈ చిత్రం ఉందని విమర్శకులతో పాటు ప్రేక్షకులు, పరిశ్రమ ప్రముఖుల నుంచి ఈ చిత్రానికి ప్రశంసలు అందాయి. ఈ సినిమా 26న జీ 5 ఓటీటీ వేదికలో విడుదల కానుంది. అదీ డైరెక్టర్ కామెంటరీతో! ఫస్ట్ టైమ్ .. డైరెక్టర్ కామెంటరీతో సినిమాను విడుదల చేయాలనే సరికొత్త ప్రయత్నానికి ఈ చిత్రంతో ‘జీ 5’ ఓటీటీ వేదిక శ్రీకారం చుట్టింది. ఓటీటీలో ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా బుధ‌వారం హైద‌రాబాద్‌లోని ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో చిత్రయూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సాయిధరమ్ వస్తాడని అంతా ఆశించారు. కానీ ఓ ఆడియో మెసేజ్ మాత్రమే ఆయన పంపించారు. 


ఈ ఆడియోలో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ.. ‘‘హాయ్! నేను మీ సాయి ధరమ్ తేజ్. నాపై మీరు చూపించిన ప్రేమాభిమానాలు, నా కోసం మీరు చేసిన ప్రార్థనలకు థాంక్స్. ‘రిపబ్లిక్’ సినిమా మీతో కలిసి చూడటం కుదరలేదు. ‘జీ 5’ ఓటీటీలో నవంబర్ 26న విడుదల అవుతోంది. సినిమా చూడండి... మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. జై హింద్’’ అని అన్నారు. 


ఈ మీడియా సమావేశంలో సాయి తేజ్ గురించి దేవ్ కట్టా మాట్లాడుతూ.. ‘‘నాలుగేళ్ల క్రితం తేజకు రెండు కథలు చెప్పాను. ‘సుప్రీమ్’, అప్పట్లో వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అవ్వడంతో ఆ ఇమేజ్ బేస్ చేసుకుని... ఆటపాటలు, ఫైట్లు ఉండే మాస్ మసాలా కథలు చెప్పాను. ఒక కథ స్పోర్ట్స్ నేపథ్యంలో ఉంది. ఆల్రెడీ జగపతిబాబుగారితో ‘విన్నర్’ చేస్తున్నానని, ఆ సినిమా చేయలేనని చెప్పాడు. తర్వాత ఇంకో కథ చెప్పాను. రెండు మీటింగ్స్ తర్వాత నాకు తమ్ముడిలా అయిపోయాడు. అంత క్లోజ్ అయ్యాం. నిజాయతీ ఉన్న వ్యక్తి, చాలా ఎమోషనల్ పర్సన్. అందరూ బాగుండాలని కోరుకునే మనిషి. ఈ ‘రిపబ్లిక్’ కథ తన ఇమేజ్‌కు సూట్ కాదని అనుకునేవాడిని. క్లైమాక్స్ చెబితే అసలు చేయడని అనుకుంటూనే... ‘ఇంకో ఐడియా ఉంది. కానీ, నువ్వు చేయవు’ అని చెప్పాను. ‘మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామనే భ్రమలో ఉన్నాం. కానీ, ప్రజాస్వామ్యంలో లేం. మనం ఉంటున్నది ప్రజాస్వామ్యమే కాదని చెబుతూ ప్రజాస్వామ్యం ఎలా ఉండాలో చెప్పే సినిమా ఇది’ అని చెప్పగానే.. ‘ఈ సినిమా నేను చేయాలి’ అని నా దగ్గర ప్రామిస్ తీసుకున్నాడు. క్లైమాక్స్ చెప్పిన తర్వాత ‘ఈ క్లైమాక్స్ మారిస్తే నేను సినిమా చేయను’ అని అన్నాడు. నా సోల్, నాతో అంత బాగా కనెక్ట్ అయ్యాడు. నాకు రెండు ప్లాప్స్ వచ్చి, నేను వెళుతుంటే హీరోలు తప్పించుకుంటున్న రోజుల్లో... తను నన్ను వెంటాడాడు. నేను ‘బాహుబలి’కి డైలాగ్ రాస్తున్నప్పుడు వచ్చి నా ఫ్లాట్‌లో కూర్చునేవాడు. ఆ వర్క్ ఎప్పుడు అయిపోతుందోనని! తన జీవితంలో ఈ సినిమా ఓ మైలురాయి కావాలని సాయి తేజ్ ఎంతో కష్టపడ్డాడు. ‘రిపబ్లిక్’ సక్సెస్‌లో ఎక్కువ క్రెడిట్ తనకే చెందుతుంది’’ అని అన్నారు.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.