హీరోయిన్గా కెరీర్ సాఫీగా సాగుతున్న సమయంలో 2015 సంవత్సరం జీవితం మొత్తాన్ని కుదిపేసిందని ఆవేదన వ్యక్తం చేశారు సదా. ‘జయం’తో టాలీవుడ్‌కి పరిచయమైన ఆమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 40కు పైగా చిత్రాల్లో నటించారు. తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు సదా. ఆ విశేషాలు...
2015 వరకూ నా జీవితం ఆనందంగా సాగింది. ఆ ఏడాది కుటుంబంలో జరిగిన ఓ ఘటన వల్ల సినిమా ఆఫర్లతో ఎవరూ ఫోన్ చేసినా.. ఎవరో ఏంటో తెలుసుకోకుండా ఆసక్తి లేదని చెప్పేదాన్ని. అంతగా డిస్ట్రబ్ అయ్యాను. ఇంతకీ ఆ విషయం ఏంటంటే అమ్మ మరో పది రోజుల్లో రిటైర్ అవుతుందనగా ఆమెకు గొంతు క్యాన్సర్ ఉందని తెలిసింది. ఆ రోజు అమ్మ పుట్టినరోజు కూడా. డాక్టర్లను సంప్రదించి వెంటనే ఆపరేషన్ చేయించాం. వ్యాధి పెరుగుతూ మరో మూడు ఆపరేషన్లకు దారి తీసింది. క్యాన్సర్ వ్యాధి ఎంత భయంకరమో.. అంతకుమించి ఆ ట్రీట్మెంట్ ఇంకా కష్టమైంది. రేడియేషన్ ట్రీట్మెంట్ చూసి తట్టుకోలేకపోయేదాన్ని. అలా దేని మీద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అమ్మని చూసుకుంటూ ఉండేదాన్ని. ఇప్పుడు ఆమె ఆరోగ్యంగా ఉంది.
‘చంద్రముఖి’ మిస్ అయ్యా...
‘చంద్రముఖి’ సినిమా అవకాశం రెండు సార్లు నా తలుపు తట్టింది. అప్పుడు ‘అపరిచితుడు’ సినిమా షూటింగ్ వల్ల డేట్స్ సర్దుబాటు చేయలేకపోయా. అలా జ్యోతిక చేసిన గంగ పాత్ర మిస్ అయ్యా. ఆ తర్వాత రజనీ సార్‌కి జోడీగా నయనతార చేసిన పాత్రకు అడిగారు. ఆ సమయంలో కూడా బిజీగా ఉండడం వల్ల కుదరలేదు. ‘ఆనంద్’ సినిమా అవకాశం కూడా మొదట నా దగ్గరికే వచ్చింది. అప్పుడూ సరైన నిర్ణయం తీసుకోలేక ఆ సినిమా వదులుకున్నా.
అదొకటే రూమర్...
నేను కెరీర్ బిగినింగ్‌లోనే విక్రమ్ లాంటి స్టార్ హీరోలతో పని చేశా. మాధవన్‌తో వరుసగా మూడు హిట్ సినిమాలు చేయడంతో మా ఇద్దరి మధ్య ఏదో ఉందని రూమర్స్ క్రియేట్ చేశారు. అదొకటి మినహా నా కెరీర్‌పై ఎలాంటి మచ్చ లేదు. నేను రూమర్స్‌ను పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటా.
తోలు ఉత్పత్తులు ఉపయోగించను...
జంతువులు బతికుండగానే యంత్రాలను ఉపయోగించి ఆ చర్మాన్ని వేరే చేస్తారు. నాణ్యత బాగుంటుందని అలా చేస్తారని విన్నాను. మన చర్మానికి చిన్నగా గీరుకుంటేనే తట్టుకోలేం. అలాంటిది బతికుండగానే చర్మాన్ని ఒలిచేేస్త వాటికి ఎంత బాధ కలుగుతుందో తలచుకుంటేనే వణుకు పుడుతుంది. అందుకే తోలుతో తయారు చేసిన ఏ వస్తువుతను వాడను. కొన్నేళ్ల క్రితమే నేను పూర్తి వేగన్‌గా మారిపోయా. ఇక పెళ్లి విషయానికొస్తే.. నా అలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి దొరికితే చేసుకుంటాను. అతను కూడా వీగన్ అయి ఉండాలి. లేదంటే ఒంటరిగా ఉండిపోతా.