ఇంకా 40 రోజులు షూటింగ్..
సంక్రాంతికి అసాధ్యం..
మరి ఏ హీరో వెనక్కి తగ్గుతాడు?
జూ.ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ప్యాన్ ఇండియా సినిమా ‘ఆర్ఆర్ఆర్’ విడుదల విషయంలో ఓ ఆసక్తికర వార్త ఫిల్మ్నగర్లో చక్కర్లు కొడుతుంది. డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ అక్టోబర్ 13న విడుదల కావల్సి ఉంది. కరోనా సెకెండ్ వేవ్ పెరగడం, లాక్డౌన్ అమలు ఉండడంతో మళ్లీ షూటింగ్ వాయిదా పడింది. పరిస్థితులు సాధారణ స్థితికి ఎప్పుడొస్తాయో ఎవరూ ఊహించలేని స్థితిలో ఉన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ పూర్తి కావాలంటే ఇంకా 40 రోజులు చిత్రీకరణ చేయాల్సి ఉందని తెలిసింది. షూటింగ్ పూర్తయ్యాక వీఎఫ్ఎక్స్, నిర్మాణానంతర కార్యక్రమాలు ఇంకెంత సమయం పడుతుందో చూడాలి. అందులోనూ రాజమౌళి అవుట్పుట్ విషయంలో సంతృప్తి చెందడం అంత ఈజీ కాదు. జక్కన్న చెక్కుతూ సినిమాను ఓ దారికి తీసుకురావడానికి చాలా సమయమే పట్టేలా ఉంది. పైగా ప్రస్తుత మహమ్మారిని చూస్తుంటే ఈ ఏడాదికి సినిమా రిలీజ్ లేనట్లే కనిపిస్తోంది. అందుకే రాజమౌళి 2022 సమ్మర్లో సినిమా విడుదల చేయాలనుకుంటున్నారట. అయితే హీరోలిద్దరూ.. వచ్చే ఏడాది సమ్మర్ అయితే చాలా ఆలస్యం అవుతుందనీ, సంక్రాంతికి విడుదల చేస్తే అన్ని రకాలుగా బావుంటుందని అభిప్రాయపడ్డారట. ఒక వేళ అదే జరిగితే సంక్రాంతి బరిలో పవన్ కల్యాణ్, మహేశ్ చిత్రాలు కూడా ఉన్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ కూడా అదే సమయానికి ఫిక్స్ అయితే గట్టి పోటీనే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ హీరో సినిమా వెనక్కి తగ్గుతుందనేది చూడాలి. రాజమౌళి చెప్పింది హీరోలు వింటారా? హీరోలు చెప్పింది దర్శకుడు వింటాడా అన్నది చూడాలి! ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 20న 'ఆర్ఆర్ఆర్' బృందం విడుదల చేసే పోస్టర్ను బట్టి విడుదల తేదీ తెలిసే అవకాశం ఉంది.