సినిమా రివ్యూ : రౌడీ బాయ్స్

చిత్రం : రౌడీ బాయ్స్

విడుదల తేదీ : 14-01-2022

నటీనటులు : ఆశిష్, విక్రమ్ సహిదేవ్, అనుపమా పరమేశ్వరన్, శ్రీకాంత్ అయ్యంగార్, జయప్రకాశ్, కార్తిక రత్నం, తేజ కూరపాటి,  కోమలీ ప్రసాద్ తదితరులు

ఎడిటర్ : మధు

సినిమాటోగ్రఫీ : మది

సంగీతం : దేవీశ్రీ ప్రసాద్

నిర్మాతలు : దిల్ రాజు, శిరీష్

దర్శకత్వం : హర్ష కొనుగంటి

దిల్ రాజు ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆశిష్ హీరోగా పరిచయమవుతూ.. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ ‘రౌడీ బాయ్స్’. మల్లూ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ కథానాయికా నటించిన ఈ సినిమాని ‘హుషారు’ చిత్రంతో యూత్ లో హుషారు నింపిన హర్ష కొనుగంటి తెరకెక్కించాడు. టీజర్, ట్రైలర్స్ తో అంచనాల్ని పెంచేసిన ఈ సినిమా యువతరానికి ఏ స్థాయిలో కనెక్ట్ అవుతుంది? ఆశిష్ హీరోగా టాలీవుడ్ లో స్థిరపడేందుకు ఈ సినిమా ఏమేరకు దోహదపడుతుంది అనే విషయాలు రివ్యూలో చూద్దాం..

కథ 

అక్షయ్ (ఆశిష్) ఏ మాత్రం బరువు, బాధ్యతలు లేకుండా తిరిగే కుర్రాడు. బీటెక్ ఫస్ట్ ఇయర్‌ ఇంజినీరింగ్ కాలేజ్‌లో చేరడానికి వెళుతూ.. మెడికల్ కాలేజ్ స్టూడెంట్ కావ్య (అనుపమా పరమేశ్వరన్)తో తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. ఆ మెడికల్ కాలేజ్ కి, ఆశిష్ చేరబోయే కాలేజ్ కు అస్సలు పడదు. రెండు కాలేజీల స్డూడెంట్స్ ఎప్పుడు ఎదురు పడినా కొట్టుకుంటూనే ఉంటారు. మెడికల్ కాలేజ్ స్డూడెంట్స్‌ లీడర్ విక్రమ్ (విక్రమ్ సహిదేవ్) కాలేజ్ టాపర్. అతడు కూడా కావ్యని ప్రేమిస్తుంటాడు. ఇంతకీ ఈ ఇద్దరిలో కావ్య ఎవరిని ప్రేమించింది? ఈ ముగ్గురు జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి? ఆశిష్, విక్రమ్ ఇద్దరిలో ఎవరు కావ్యని దక్కించుకున్నారు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

విశ్లేషణ  

దిల్‌‌రాజు లాంటి బడా ప్రొడ్యూసర్ తమ్ముడి తనయుడు కావడంతో.. హీరోగా ఆశిష్‌ లాంఛింగ్ దానికి తగ్గ రీతిలోనే జరిగింది. హీరోయిన్ గా అనుపమా పరమేశ్వరన్, సంగీత దర్శకుడిగా దేవీశ్రీ ప్రసాద్ ను ఎంపిక చేసి.. సినిమాకి విడుదలకు ముందే మంచి క్రేజ్ తీసుకొచ్చారు. ఆ ప్రయత్నంలో ‘హుషారు’ లాంటి సినిమా తీసిన దర్శకుడు హర్ష కొనుగంటిపై పెద్ద బాధ్యతనే ఉంచారు. ఒక సినిమా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో తొలి చిత్రానికి కావాల్సిన అన్ని హంగులూ ఇందులో ఉన్నాయి. డ్యాన్స్, యాక్షన్, కామెడీ, రొమాన్స్ లాంటి వన్నీ కలగలిసే ఒక యూత్ ఫుల్ స్టోరీని దర్శకుడు ఎంచుకున్నాడు. కొన్ని ఎపిసోడ్స్ బాగానే వర్కవుట్ అయ్యాయి. ఇప్పటి యూత్ ఒకమ్మాయి ప్రేమకోసం ఏరూట్లో వెళుతున్నారు? ఇంజినీరింగ్ అండ్ మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ మధ్య రైవలరీ ఏ స్థాయిలో ఉంటుంది? అనే అంశాల్ని బాగానే చూపించాడు. అయితే కథనంపై ఇంకాస్త కసరత్తు చేసి ఉంటే బాగుండేది. కొన్ని చోట్ల జరగబోయే సన్నివేశాల్ని ముందుగానే ప్రేక్షకులు ఊహిస్తారు. 


ఫస్టాఫ్ కాలేజీ నేపథ్యంలోని సన్నివేశాలతోనే కథను నడిపించిన దర్శకుడు.. సెకండాఫ్ ను పూర్తిగా హీరో, హీరోయిన్స్ లివ్ ఇన్ రిలేషన్ షిప్ వైపు వెళ్ళిపోయాడు. ఆ సన్నివేశాల్ని బాగానే హ్యాండిల్ చేశాడు దర్శకుడు.  అయితే సన్నివేశాల్లో కానీ, డైలాగ్స్ లో కానీ ఎక్కడా వల్గారిటీ అన్నదే లేకుండా సినిమాని తెరకెక్కించిందుకు దర్శకుడ్ని అభినందించితీరాలి. అక్షయ్‌గా ఆశిష్ అదరగొట్టాడు. హీరోకి కావల్సిన లక్షణాలన్నీ అతడిలో పుష్కలంగా ఉన్నాయి. డ్యాన్స్, యాక్షన్ సీన్స్ లో ఎంతో అనుభవమున్నట్టు నటించాడు. ఎమోషనల్ సీన్స్ లో కొంచెం మెరుగుపడాలి. తొలి చిత్రమైనా ఎక్కడా తడబడకుండా.. మంచి ఈజ్ చూపించాడు. అలాగే... విక్రమ్ గా విక్రమ్ సహిదేవ్ సహజనటనతో ఆకట్టుకున్నాడు. ఫైట్స్ లోనూ, నెగెటివ్‌ షేడ్స్‌లోనూ తన మార్క్ చూపించాడు. ఇక కథానాయికగా అనుపమా పరమేశ్వరన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సింది ఏముంది? అద్భుతమైన అభినయంతో ఆకట్టుకుంది. తన కెరీర్ లోనే బోల్డెస్ట్ కేరెక్టర్ ను ఆమె చేసిందని చెప్పాలి. కేవలం పాటలకి, గ్లామర్ కే పరిమితమై పోకుండా.. చాలా కీలకమైన పాత్రను చేసింది ఆమె. హీరో తండ్రిగా శ్రీకాంత్ అయ్యంగార్, హీరోయిన్ తండ్రిగా జయప్రకాశ్ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక దేవీశ్రీ సంగీతం సినిమాకి అదనపు బలాన్ని తెచ్చిపెట్టింది. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కో్ర్స్ లో దేవీ మార్క్ కనిపించింది.  సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి బాగా ఎసెట్ అయింది. ప్రొడక్షన్ వేల్యూస్ బాగున్నాయి. టోటల్ గా ‘రౌడీ బాయ్స్’ మెప్పిస్తారు. 

బోటమ్ లైన్ : యూత్‌ఫుల్ ఎంటర్ టైనర్ 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.