సినిమా రివ్యూ : ‘రొమాంటిక్’

ABN , First Publish Date - 2021-10-29T21:49:24+05:30 IST

పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ ‘ఆంధ్రాపోరీ’ మూవీతో టీనేజ్ హీరోగా ఎంట్రీ ఇవ్వగా.. ఆ తర్వాత ‘మెహబూబా’తో హీరోగా తెరకు పరిచయం అయ్యాడు. అయితే ఆ రెండు సినిమాలతోనూ ఆకాశ్ అంతగా మెప్పించలేకపోవడంతో... ఇప్పుడు పూరీనే స్వయంగా నిర్మాతగా మారి తనయుడిని ‘రొమాంటిక్’ చిత్రంతో హీరోగా నిలబెట్టే బాధ్యత తీసుకున్నారు.

సినిమా రివ్యూ : ‘రొమాంటిక్’

సినిమా టైటిల్: రొమాంటిక్

విడుదల తేదీ: 29 అక్టోబర్, 2021

నటీనటులు: ఆకాశ్ పూరీ, కేతికా శర్మ, ఉత్తేజ్, రమ్యకృష్ణ, సునయన, మకరన్ దేశ్ పాండే, ఖయ్యూం, భరత్ రెడ్డి, మీనా తదితరులు

సినిమాటోగ్రాఫర్: నరేశ్ రానా

ఎడిటర్: జునైద్ సిద్ధిఖి

సంగీతం: సునీల్ కాశ్యప్

నిర్మాతలు: పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్

కథ, స్ర్కీన్‌ప్లే, మాటలు: పూరీ జగన్నాథ్

దర్వకత్వం: అనిల్ పాదూరి


పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ ‘ఆంధ్రాపోరీ’ మూవీతో టీనేజ్ హీరోగా ఎంట్రీ ఇవ్వగా.. ఆ తర్వాత ‘మెహబూబా’తో హీరోగా తెరకు పరిచయం అయ్యాడు. అయితే ఆ రెండు సినిమాలతోనూ ఆకాశ్ అంతగా మెప్పించలేకపోవడంతో... ఇప్పుడు పూరీనే స్వయంగా నిర్మాతగా మారి తనయుడిని ‘రొమాంటిక్’ చిత్రంతో హీరోగా నిలబెట్టే బాధ్యత తీసుకున్నారు. తన పరపతి అంతా ఉపయోగించి పెద్ద పెద్ద స్టార్స్‌, డైరెక్టర్స్‌తో.. సినిమాకి భారీ ప్రమోషన్స్ చేయించారు. ఈ రోజే (శుక్రవారం) ‘రొమాంటిక్’ సినిమా థియేటర్స్‌లో విడుదలైంది. ఇంతకీ ఆకాశ్ హీరోగా స్థిరపడేంత స్టఫ్ ఈ సినిమాలో ఉందా? సినిమా ప్రేక్షకులకు ఏ మేరకు కనెక్ట్ అవుతుంది? అనే విషయాలు రివ్యూలో చూద్దాం.


కథ:

వాస్కోడిగామ (ఆకాశ్ పూరీ) చిన్నతనంలోనే పోలీసాఫీసరైన తండ్రి (భరత్ రెడ్డి), తల్లి (సీరియల్ నటీమణి మీనా)ని పోగొట్టుకుంటాడు. నానమ్మ(రమాప్రభ ) సంరక్షణలో పెరిగి పెద్దవాడై.. గోవాలో క్రిమినల్ యాక్టివిటీస్‌కు అలవాటు పడతాడు. బాగా డబ్బు సంపాదించి మేరీ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో తమ ఏరియాలోని పేదవారికి ఇళ్ళు కట్టించాలన్నది ప్లాన్. అక్కడ ఒక డ్రగ్ డీలర్ గ్యాంగ్‌లో చేరి.. అనుకోకుండా అతణ్ణి చంపి.. తను గ్యాంగ్ స్టర్ అవుతాడు. ఇంతలో మోనిక (కేతికా శర్మ) అనే అమ్మాయితో తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయికి కూడా అతడంటే ఇష్టం ఏర్పడుతుంది. ఓ పోలీస్ కానిస్టేబుల్ (ఉత్తేజ్) చెల్లెలు ఆమె. వాస్కో‌కి శ్యాంసన్ (మకరన్ దేశ్ పాండే) అనే మరో డ్రగ్ లీడర్‌కి మాల్ విషయంలో శత్రుత్వం ఏర్పడుతుంది. వాస్కోడిగామా ఓ పోలీసాఫీసర్‌ను చంపడం వల్ల అతడి కేస్‌ను ఇన్వెస్టిగేట్ చేయడానికి ఏసీపీ రమ్యా గోవారికర్ (రమ్యకృష్ణ) రంగంలోకి దిగుతుంది. ఒక పక్క శత్రువులు, మరో పక్క ప్రేయసితో రొమాన్స్, ఇంకో పక్క ఏసీపీ‌తో క్యాట్ అండ్ మౌస్ గేమ్.. వీటిని వాస్కో ఎలా ఎదుర్కొన్నాడు? అతడి ప్రేమ వ్యవహారం ఎలాంటి మలుపు తిరిగింది అన్నది మిగతా కథ.


విశ్లేషణ:

మోహానికి, ప్రేమకు డిఫరెన్స్ తెలియని ఇద్దరు ప్రేమికులు.. తాము మోహంలో ఉన్నామనే భ్రమలో ప్రేమలో పడడం అనే పాయింట్‌తో ఈ సినిమా రూపొందింది. దానికి తగ్గట్టుగానే యూత్‌కు కనెక్ట్ అయ్యే అన్ని అంశాల్ని పుష్కలంగా రాసుకున్నాడు పూరీ. తెరపై దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో దర్శకుడు బాగానే సక్సెస్ అయ్యాడు. ఈ సినిమా మొత్తాన్ని ఆకాశ్ పూరీ తన భుజస్కంధాలపై మోశాడు. పూరీ సినిమాల్లోని హీరోల కేరక్టరైజేషన్‌తో, బాడీలాంగ్వేజ్, డైలాగ్స్‌తో మెస్మరైజ్ చేశాడు. మూడో సినిమాకే మంచి డిక్షన్, ఈజ్ నెస్ బాగా డెవలప్ చేశాడు. ఎక్కడా తడబడకుండా.. తన స్టయిల్ ఆఫ్ యాక్షన్‌తో చెలరేగాడు.. అయితే అతడి ముఖంలో ఇంకా టేనేజ్ ఛాయలు పోలేదు. తండ్రి పూరీ చెప్పినట్టు అతడు రొమాన్స్‌లో ఇంకా ఆరితేరాలని కొన్ని సన్నివేశాల్లో అనిపిస్తుంది. ‘రొమాంటిక్’ అనే సాఫ్ట్ టైటిల్ పెట్టినప్పటికీ ఈ సినిమాను పూర్తిగా బోల్డ్ అండ్ యాక్షన్ ప్యాక్డ్ మూవీగా తెరకెక్కించాడు దర్శకుడు అనిల్ పాదూరి.  


కర్లో యార్ మర్లో అనే యాటిట్యూడ్‌తో సాగే కేరక్టరైజేషన్‌తో ఆకాశ్ గ్యాంగ్ లీడర్‌గా ఎదిగే సీన్స్ మెప్పిస్తాయి, అలాగే పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీట్ తెరిచే సీన్, డ్రగ్ దందా మొదలు పెట్టే సీన్స్ అన్నీ.. పూరీ సినిమాలను గుర్తుకు తెస్తాయి. పేరుకు తగ్గట్టే ఈ సినిమాలోని రొమాన్స్‌ను పీక్స్ లో చూపించాడు దర్శకుడు. హీరోయిన్‌తో ఆకాశ్ రొమాంటిక్ సీన్స్ అన్నీ కుర్రకారుకు తెగ నచ్చేస్తాయి. మోనికగా కేతికా శర్మ గ్లామర్ అపీరెన్స్ మెప్పిస్తుంది. ఆమె ఈ సినిమా తర్వాత మరో కృతి శెట్టిగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక పోలీసాఫీసర్‌గా రమ్యకృష్ణ పాత్ర చాలా పవర్ ఫుల్‌గా ఉంటుంది. అలాగే ఆమె పలికే డైలాగ్స్ కూడా మెప్పిస్తాయి. విలన్‌గా మకరన్ దేశ్ పాండే పర్వాలేదనిపిస్తాడు. అయితే క్లైమాక్స్ విషయంలో నిర్మాత పూరీ, దర్శకుడు అనిల్ పాదూరి సాహసమే చేశారని చెప్పాలి. నిర్మాణ విలువలు, సంగీతం, సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటాయి. లాజిక్కులు పక్కన పెట్టి సినిమాను చూస్తే.. ఇది హీరోగా ఆకాశ్ నిలదొక్కుకునేంత స్థాయి సినిమానే అని చెప్పొచ్చు.   


ట్యాగ్ లైన్: ఎరోటిక్ లవ్ స్టోరి ‘రొమాంటిక్’ 

Updated Date - 2021-10-29T21:49:24+05:30 IST