రొమాన్స్ హద్దులు దాటదు
ABN , First Publish Date - 2022-11-04T05:34:55+05:30 IST
‘‘ఊర్వశివో రాక్షసివో’ హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రం కాదు. ఆ పాత్రకు అధిక ప్రాధాన్యం ఉంటుంది అంతే. కెరీర్, ప్రేమ, పెళ్లి విషయాల్లో ఈ తరం యువతీ యువకుల ఇష్టాలు...

‘‘ఊర్వశివో రాక్షసివో’ హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రం కాదు. ఆ పాత్రకు అధిక ప్రాధాన్యం ఉంటుంది అంతే. కెరీర్, ప్రేమ, పెళ్లి విషయాల్లో ఈ తరం యువతీ యువకుల ఇష్టాలు, సంఘర్షణకు ఈ చిత్రం అద్దం పడుతుంది’ అని దర్శకుడు రాకేశ్ శశి అన్నారు. ఈ చిత్రంలో అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా నటించారు. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మోగిలినేని నిర్మించారు. శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా రాకేశ్ శశి చెప్పిన విశేషాలు.
సినిమాలో కథానాయిక పాత్ర కీలకం కాబట్టే టైటిల్ కథకు రిలేటెడ్‌గా పెట్టాం. సాఫ్ట్వేర్ నేపథ్యంలో సాగే కథ ఇది. మధ్య తరగతి అబ్బాయి, విదేశాల్లో పెరిగిన అమ్మాయి అడ్డంకులను అధిగమించి తమ ప్రేమను ఎలా గెలిపించుకున్నారు అనేది కథ.
సినిమాలో రొమాన్స్ ఉంది గానీ ఎక్కడా హద్దులు దాటదు. గీతాఆర్ట్స్ చిత్రం కాబట్టి కుటుంబంతో కలసి చూసేలా ఉంటుంది. హీరో, హీరోయిన్‌తో పాటు వెన్నెల కిశోర్, సునీల్ పాత్రలు ఆద్యంతం వినోదం పంచుతాయి.
‘విజేత’ సినిమా చూశాక అరవింద్‌గారు పిలిచి ‘సినిమా చేద్దాం’ అన్నారు. శిరీష్ కోసమే ఈ కథ రాశాను. ఆయన కెరీర్లో మంచి చిత్రంగా నిలిచిపోతుందనే నమ్మకం ఉంది. ‘ఇప్పటిదాకా నా సినిమాల్లో నేనే కనిపించేవాణ్ణి. తొలిసారి ఇందులో నా పాత్ర కనపడుతుంది’ అని శిరీష్ అనడం ఆనందం కలిగించింది.