Ram gopal Varma: ప్రభాస్‌పై కుట్ర అనేది పెద్ద జోక్‌!

ABN , First Publish Date - 2022-10-07T02:31:07+05:30 IST

‘‘రామాయణాన్ని మేం కొత్తగా చూపిస్తున్నాం. ఇప్పటి వరకూ చూసినట్లు కాకుండా విభిన్నమైన లుక్స్‌లో రామాయణంలో పాత్రల్ని చూపించనున్నాం అని చిత్రబృందం ముందే చెప్పి ఉంటే టీజర్‌ విడుదల అయ్యాక ఈ స్థాయి ట్రోలింగ్‌ జరిగేది కాదు.

Ram gopal Varma: ప్రభాస్‌పై కుట్ర అనేది పెద్ద జోక్‌!

‘‘రామాయణాన్ని మేం కొత్తగా చూపిస్తున్నాం. ఇప్పటి వరకూ చూసినట్లు కాకుండా విభిన్నమైన లుక్స్‌లో రామాయణంలో పాత్రల్ని చూపించనున్నాం అని చిత్రబృందం ముందే చెప్పి ఉంటే టీజర్‌ విడుదల అయ్యాక ఈ స్థాయి ట్రోలింగ్‌ జరిగేది కాదు. చిత్ర బృందం అలా చెప్పకపోవడం వల్లే టీజర్‌ విడుదలయ్యాక ఇన్ని పోలికలు, విమర్శలు వస్తున్నాయి’’ అని రామ్‌గోపాల్‌ వర్మ అన్నారు. తాజాగా ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ఆదిపురుష్‌’ గురించి ఆయన ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ప్యాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ‘ఆదిపురుష్‌’ చిత్రం టీజర్‌ను ఇటీవల అయోధ్యలో విడుదల చేశారు. టీజర్‌ విడుదలైన క్షణాల నుంచే అందులో పాత్రలపై విమర్శలు మొదలయ్యాయి. ఇదొక యానిమేషన్‌ సినిమాలాగా ఉందని కామెంట్స్‌ చేస్తున్నారు. ప్యాన్‌ ఇండియా స్థాయిలో ఎదుగుతున్న ప్రభాస్‌ను తొక్కేయడానికి బాలీవుడ్‌ చేస్తున్న కుట్ర ఇదని మరికొందరు చెబుతున్నారు. ఈ విషయాలపై ఆర్‌జీవీ స్పందించారు. ‘‘బ్రహ్మాస్త్ర ట్రైలర్‌ చూసి వీఎఫ్‌ఎక్స్‌ బాగోలేదని కామెంట్‌ చేశారు. సినిమా చూశాక ఎవరూ మాట్లాడలేదు. బిగ్‌స్ర్కీన్‌పై సినిమా బావుందని అందరూ ప్రశంసించారు.  కోట్లు ఖర్చు పెట్టిన తీసిన సినిమాను ఒక్క నిమిషం నిడివి ఉన్న వీడియో చూసి బాగోలేదని నిర్ణయించకూడదు. పూర్వం నుంచి రామాయణం అంటే ఇలా ఉంటుంది. రాముడు ఇలా ఉంటాడు అని మనకు ఓ ఆలోచన ఉంది. ‘ఆదిపురుష్‌’ అందుకు భిన్నంగా ఉండడంతో విమర్శలు చేస్తున్నారు. ఇటీవల ఓ నిర్మాత నాకు ఫోన్‌ చేసి ‘రాముడికి మీసాలు ఉండటం ఏంటి?’ అన్నాడు. రాముడికి మీసాలు ఎందుకు పెట్టకూడదు అని మేకర్స్‌కి అనిపించి ఉండొచ్చు. నాకు సైఫ్‌ అలీఖాన్‌ లుక్‌ నచ్చలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎస్వీ రంగారావుని రావణాసురుడిగా చూడ్డానికి అలవాటు పడ్డాను. రావణుడంటే లాంగ్‌ హెయిర్‌, గంభీరమైన లుక్‌ చూశాం. ఇప్పుడు సైఫ్‌ని చూసి.. ఇదేంటి ఇలా ఉన్నాడు? అని కాస్త ఫీలయ్యా. దర్శకనిర్మాతలు వందల కోట్లు వెచ్చించి సినిమా తీశారంటే ఏదో కొత్తగా చూపించాలనుకుంటారు. వాళ్ల ఆలోచన తప్పయితే వాళ్లే అనుభవిస్తారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ఏదైనా చేసే హక్కు ఉంది. వాళ్లకు విజన్‌కి తగ్గట్లు సినిమా చేశారు. నీకు నచ్చితే చూడు లేదంటే చూడకు. ట్రోల్స్‌ రూపంలో ఎదుటి వ్యక్తి స్వేచ్ఛను పాడుచేయకూడదు. ఈ చిత్ర బృందం రామాయణాన్ని చూపిస్తున్నాం అని కాకుండా, దాని ఆధారంగా ఓ ఫిక్షనల్‌ సినిమా చేస్తున్నామని చెప్పినా ఇంత రచ్చ జరిగేది కాదు’’ అని అన్నారు. 

ప్రభాస్‌ ఎంత మార్కెట్‌ చేశాడన్నదే చూస్తారు...

బాలీవుడ్‌లో కొంతమంది కుట్ర చేసి ఆదిపురుష్‌పై ట్రోలింగ్‌ చేస్తున్నారనే వార్తలు కూడా వచ్చిన నేపథ్యంలో దానిపై కూడా వర్మ స్పందించారు. ప్రభాస్‌పై కుట్ర జరుగుతుంది అన్న విషయం కన్నా పెద్ద జోక్‌ నా లైఫ్‌లో వినలేదు. బాలీవుడ్‌ అనేది వ్యాపారం కోసం మీడియా క్రియేట్‌ చేసిన ఒక లేబుల్‌. ‘బాహుబలి’ లాంటి సినిమాతో ప్యాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన హీరోకి డబ్బిచ్చి సినిమా చేద్దామని ఓ నిర్మాత అనుకుంటాడు.  ఆ నిర్మాతకి మిగిలిన ఇండస్ర్టీకి సంబంధం ఉండదు. ఫైనల్‌గా ఒక బిజినెస్‌మేన్‌ వాడికి ఎంత డబ్బు వస్తుంది అనే చూసుకుంటాడు కానీ.. ఫలానా హీరో ఎదుగుతున్నాడు వాడిని తొక్కేద్దాం అనే ఆలోచన ఎప్పుడూ వర్కౌట్‌ అవ్వదు. ఎస్‌.పి.బాలు ‘మైనే ప్యార్‌ కియా’ అనే సినిమాకి పాటలు పాడారు. అప్పటికే ఆయన దక్షిణాదిన 30 ఏళ్లుగా స్టార్‌ సింగర్‌. ఒక్కసారిగా బాలీవుడ్‌లో కూడా స్టార్‌ సింగర్‌ అయిపోయారు. పదేళ్లు అక్కడ కూడా గాయకుడిగా కొనసాగారు. ఆయన మ్యూజిక్‌ వర్కవుట్‌ అయ్యింది. ఆయన గొంతుతో అక్కడ డబ్బు వస్తుంది కాబట్టి డబ్బు చేసుకున్నారు. తెలుగు సింగర్‌ను తీసుకెళ్లి అక్కడ ఎక్కించేద్దాం అనే కాంటెస్ట్‌ కాదు. నిర్మాతకు కావాల్సింది డబ్బులు. ప్రభాస్‌ అనే యాక్టర్‌ ఎంత మనీ జనరేట్‌ చేస్తున్నాడు అనేది ఒక్కటే వాళ్లు చూస్తారు. ఎవడో సౌత్‌ నుంచి వచ్చాడు తొక్కేద్దాం అనేది మీనింగ్‌ లెస్‌ పాయింట్‌’’ అని వర్మ చెప్పుకొచ్చారు. 

Updated Date - 2022-10-07T02:31:07+05:30 IST