ఓటీటీ గ్లోబల్‌.. కంటెంట్‌ లోకల్‌

ABN , First Publish Date - 2021-10-17T06:13:40+05:30 IST

టాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ దాకా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంటెంట్‌ను ప్రేక్షకుల చెంతకు చేర్చింది ఓటీటీ వేదికలే. ఇప్పుడు మాత్రం లోకల్‌ మంత్రం జపిస్తూ... ప్రాంతీయ భాషలకు చె ందిన కంటెంట్‌తో ప్రేక్షకులకు గాలం వేస్తున్నాయి...

ఓటీటీ గ్లోబల్‌.. కంటెంట్‌ లోకల్‌

టాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ దాకా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంటెంట్‌ను ప్రేక్షకుల చెంతకు చేర్చింది ఓటీటీ వేదికలే. ఇప్పుడు మాత్రం లోకల్‌ మంత్రం జపిస్తూ... ప్రాంతీయ భాషలకు చె ందిన కంటెంట్‌తో ప్రేక్షకులకు గాలం వేస్తున్నాయి. పలు భారతీయ భాషల్లో ఒరిజినల్‌ చిత్రాలు, వెబ్‌ సిరీస్‌లు, టాక్‌ షోలతో చందాదారులను పెంచుకోవడానికి పోటీ పడుతున్నాయి. 


లోకల్‌ కంటెంట్‌తో ఓటీటీలు

ఓటీటీల్లో ప్రాంతీయ భాషా కంటెంట్‌ను అందించే ఓటీటీ వేదికల సంఖ్య దేశవ్యాప్తంగా క్రమంగా పెరుగుతోంది. తెలుగులో ఆహా, ఫిలిమ్‌, ఊర్వశి, స్పార్క్‌... తమిళంలో సన్‌ నెక్స్ట్‌, రీగల్‌ టాకీస్‌, బెంగాలీలో హోయ్‌ చోయ్‌, అడ్డా టైమ్స్‌, మరాఠీలో ప్లానెట్‌ మరాఠీ, గుజరాతీలో సిటీషోర్‌, మలయాళంలో కూడే, కన్నడ, కొంకణ భాషల్లో టాకీస్‌, ఒడియాలో ఒల్లీ ప్లస్‌ లాంటి ఓటీటీ వేదికలు పాపులర్‌ అయ్యాయి. సింప్లీసౌత్‌ ఓటీటీ దక్షిణాది భాషలకు చెందిన కంటెంట్‌ను అందిస్తోంది. ప్రాంతీయ ఓటీటీలకు దక్కిన ఆదరణతో మరిన్ని సంస్థలు ఓటీటీ ఏర్పాటుకు మందుకొస్తున్నాయి. దీంతో స్థానిక ఓటీటీల పోటీని తట్టుకునేందుకు చందాదారుల సంఖ్యను పెంచుకునేందుకు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌, జీ5, హాట్‌స్టార్‌ లాంటి ఓటీటీలు కూడా లోకల్‌ కంటెంట్‌ను పెంచుతున్నాయి. 



భారతీయ ప్రేక్షకుల్లో మారుతున్న అభిరుచి కూడా ప్రాంతీయ కంటెంట్‌ పెరిగేందుకు దోహదం చేస్తోంది. కొరియన్‌ చిత్రం ‘పారసైట్‌’ను చూసిన ప్రేక్షకులే మలయాళ చిత్రం ‘ఉయారే’, తమిళ చిత్రం ‘సూపర్‌ డీలక్స్‌’ను... ‘నైవ్స్‌ ఔట్‌’ లాంటి ఆంగ్ల చిత్రాన్ని అంతే ఉత్సాహంగా చూస్తున్నారు.  ప్రేక్షకులని కథలో లీనమయ్యేలా చేయగలగాలే గానీ ప్రాంతీయ భాషా చిత్రం కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు చూసేలా చేయగల అవకాశం ఓటీటీలో ఉంది. ఇప్పుడదే గ్లోబల్‌ మార్కెట్‌లో స్థానిక కంటెంట్‌కు గిరాకీ పెంచుతోంది. 


ప్రాంతీయ భాషల్లో రూపొందిన సినిమాలు ఓటీటీలో విడుదలయ్యాక మంచి వ్యూస్‌ తెచ్చుకుంటున్నాయి. ‘ఆపరేషన్‌ జావా’, ‘ద గ్రేట్‌ ఇండియన్‌ కిచెన్‌’ లాంటి  మలయాళ సినిమాలు ఓటీటీలో విడుదలై సంచలన విజయాలు నమోదు చేశాయి. ఒక్క మలయాళం అనే కాదు ఇప్పుడు పలు భారతీయ భాషల్లో సినిమాలు, వెబ్‌సిరీస్‌లను అందించడంలో ఓటీటీ వేదికలు పోటీ పడుతున్నాయి. అందుకే, స్థానిక భాషల్లో కంటెంట్‌ అందించడంపై దృష్టి సారిస్తున్నాయి. 


40 శాతం స్థానిక కంటెంట్‌

ఓటీటీ అంటే సినిమా ప్రపంచం. అందులో పలు భాషలకు చెందిన విదేశీ చిత్రాలు ఒక్క క్లిక్‌తో అందుబాటులో ఉండడం... ప్రేక్షకులు ఓటీటీలకు ఆకర్షితమవడానికి ఒక కారణం. అయితే, రాను రాను ఓటీటీ వేదికల్లో ప్రాంతీయ భాషలకు చెందిన కంటెంట్‌ పెరుగుతోంది. చిత్ర పరిశ్రమ దెబ్బతినడానికి కారణమైన కరోనా ఓటీటీల్లో ప్రాంతీయ భాషాలకు చెందిన కంటెంట్‌ పెరగడానికి పరోక్షంగా దోహదం చేసింది. ఓటీటీ చందాదారులు చూసే వీడియోల్లో 40 శాతానికి పైగా ప్రాంతీయ భాషా కంటెంట్‌ ఉన్నట్టు ఓ అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా తెలుగు, తమిళ, మలయాళ, బెంగాలీ భాషల్లో లోకల్‌ కంటెంట్‌కే ఎక్కువగా ఆదరణ లభిస్తోంది. ప్రాంతీయ భాషా కంటెంట్‌కు క్రమంగా ఆదరణ పెరుగుతోంది. 2025 కల్లా మొత్తం ఓటీటీ కంటెంట్‌లో ప్రాంతీయ భాషలకు చెందిన కంటెంట్‌ వాటా 50 శాతానికి చేరుతుందని అంచనా. 


ప్రాంతీయ భాషల్లో రూపొందే పలు చిత్రాలను నేరుగా ఓటీటీల్లో విడుదలవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కరోనా వల్ల థియేటర్లు మూతపడడంతో నేరుగా ఓటీటీలో విడుదలయ్యే అగ్రతారల సినిమాల సంఖ్య పెరిగింది. తమిళంలో పలువురు అగ్రనటులు నటించిన చిత్రాలు నేరుగా ఓటీటీలోనే విడుదలవుతున్నాయి. విజయ్‌ సేతుపతి ‘కాపే రణసింగమ్‌’, ‘అనబెల్‌ సేతుపతి’, ధనుష్‌ ‘జగమే తందిరమ్‌’ కీర్తి సురేశ్‌ ‘పెంగ్విన్‌’... తెలుగులో నాని నటించిన ‘వి’, ఈ ఏడాది ‘టక్‌ జగదీష్‌’, కీర్తీ సురేశ్‌ ‘మిస్‌ ఇండియా’ చిత్రాలు మచ్చుకు కొన్ని. ప్రతి నెలా సుమారు పది దాకా మలయాళ సినిమాలు వివిధ ఓటీటీలలో విడుదలవుతున్నాయి. 


తమిళంలో కొత్త ట్రెండ్‌

కంటెంట్‌ ఓరియంటెడ్‌ సినిమాల విడుదలకు ఓటీటీ వేదికల నుంచి ఆదరణ దక్కుతోంది. పరిమిత బడ్జెట్‌తో ఆలోచన రేకెత్తించే కథ, కథనాలతో తెరకెక్కే తమిళ చిత్రాలను ఓటీటీ కోసం రూపొందించడం ఇప్పుడిప్పుడే అక్కడ ట్రెండ్‌గా మారుతోంది. కుటుంబ అనుబంధాల నేపథ్యంలో జ్యోతిక నటించిన ‘ఉడాన్‌ పిరప్పే’ (తెలుగులో ‘రక్త సంబంధం’) చిత్రం ఇటీవల ఓటీటీలోనే విడుదలైంది. గత ఏడాది నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వ్యూస్‌ దక్కించుకున్న టాప్‌ టెన్‌ చిత్రాల్లో ‘అల వైకుంఠపురములో’ నిలవడం విశేషం. గతంలో బాలీవుడ్‌, హాలీవుడ్‌ చిత్రాలను చూసేందుకు ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడేవారు. కానీ ఇప్పుడు ఓటీటీల్లో పలు ప్రాంతీయ భాషా చిత్రాలు అందుబాటులో ఉండడంతో మంచి టాక్‌ తెచ్చుకుంటే చాలు భాషను పట్టించుకోకకుండా ఆ సినిమాను చూస్తున్నారు. హిందీతో పోల్చితే ఇతర భారతీయ భాషల్లోనే సృజనాత్మక, కొత్త తరహా కథాంశాలతో సినిమాలు తెరకెక్కుతుండటమూ కలిసి వస్తోంది. 


అయితే ఓటీటీల్లో సినిమాలు, వెబ్‌ సిరీస్‌లకు మాత్రమే ప్రాంతీయ భాషల్లో కంటెంట్‌ పరిమితమవలేదు. చాట్‌ షోలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తెలుగులో ‘ఆహా’ ఓటీటీ కోసం సమంత ‘సామ్‌ జామ్‌’ అనే టాక్‌ షో చేశారు. అలాగే, అంతర్జాతీయంగా ఆదరణ పొందిన పలు షోలను స్ఫూర్తిగా తీసుకుని ప్రాంతీయ భాషల్లో ఓటీటీ కోసం మళ్లీ కొత్తగా షోలు రూపొందిస్తున్నారు. 

ఓటీటీ పుణ్యమా అని ప్రాంతీయ భాషలకు చెందిన నటీనటులకు జాతీయ స్థాయిలో గుర్తింపు, అవకాశాలు వస్తున్నాయి. బాలీవుడ్‌లో పలు చిత్రాలు చేసినా రాని గుర్తింపు ‘స్కామ్‌ 1992’ వెబ్‌సిరీస్‌తో రాత్రికి రాత్రే ప్రతీక్‌ గాంధీకి వచ్చింది. అతడిని స్టార్‌ యాక్టర్‌ని చేసింది. అంతకు ముందు ఏదో ఒక భాషకు చెందిన సినిమాలతో సరిపెట్టుకునే నటులు ఇప్పుడు పాన్‌ ఇండియా స్థాయి చిత్రాల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. ఓటీటీ మాధ్యమాల ద్వారా ప్రేక్షకులకు వారు సుపరిచితులు కావడమే దానికి కారణం. 

Updated Date - 2021-10-17T06:13:40+05:30 IST