మిషన్‌ ఇంపాజిబుల్‌తో రీ ఎంట్రీ

చాలా గ్యాప్‌ తర్వాత తిరిగి టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇస్తున్నారు కథానాయిక తాప్సీ పన్ను. ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రం తెరకెక్కించిన స్వరూప్‌ ఆర్‌.ఎస్‌.జె  దర్శకత్వంలో రూపొందుతున్న ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ చిత్రంలో తాప్సీ లీడ్‌రోల్‌లో నటిస్తున్నారు. మంగళవారం నుంచి ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు.  చేతికట్టుతో ల్యాప్‌టాప్‌లో సీరియస్‌గా చూస్తున్న తాప్సీ వర్కింగ్‌ స్టిల్‌ను విడుదల చేసి ఆమెకు చిత్ర యూనిట్‌ స్వాగతం పలికింది. ఈ సందర్భంగా తాప్సీ మాట్లాడుతూ ‘‘ఏడేళ్లుగా ఒక ప్రేక్షకురాలిగా నన్ను నేను చూడాలనుకునే కథల్లో భాగం అయ్యేందుకు అన్వేషిస్తున్నాను. ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ చిత్రం కూడా అలాంటి వాటిలో ఒకటి. ఆకట్టుకునే కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. మంచి సినిమాలుచేస్తానని ప్రేక్షకులు నాపై పెట్టుకున్న అంచనాలను నిలబెట్టుకోగలను అనే నమ్మకం కథ విన్నాక నాలో కలిగింది’’ అని అన్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్‌మెంట్‌ బ్యానర్‌పై నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2019లో వచ్చిన ‘గేమ్‌ ఓవర్‌’ తర్వాత తాప్సీ చేస్తున్న తెలుగు చిత్రం ఇదే. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో ‘రష్మీ రాకెట్‌’, ‘లూప్‌ లపేటా’, ‘దొబారా’ ‘శభాష్‌ మిథూ’ చిత్రాల్లో నటిస్తున్నారు. తమిళంలో ‘ఏలియన్‌’, ‘అన్నాబెల్లె సుబ్రమణియం’ ‘జనగణమన’ సినిమాలు చేస్తున్నారు.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.