‘డిస్కోరాజా’ మూవీ రివ్యూ

ABN , First Publish Date - 2020-02-02T00:31:13+05:30 IST

త‌న‌దైన బాడీలాంగ్వేజ్‌, మేన‌రిజ‌మ్స్‌, ఎన‌ర్జీతో త‌న కంటూ ఓ ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకున్న హీరో ర‌వితేజ‌. `రాజాదిగ్రేట్‌` స‌క్సెస్ త‌ర్వాత ర‌వితేజ చేసిన

‘డిస్కోరాజా’ మూవీ రివ్యూ

బ్యాన‌ర్‌: ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌

న‌టీన‌టులు: ర‌వితేజ‌, న‌భా న‌టేశ్‌, పాయ‌ల్ రాజ్‌పుత్‌, తాన్యా హోప్‌, బాబీ సింహ‌, సునీల్‌, వెన్నెల‌కిషోర్‌, స‌త్య‌, అజ‌య్‌, స‌త్యం రాజేష్ త‌దిత‌రులు

సంగీతం: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌

సినిమాటోగ్ర‌ఫీ: కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని

ఎడిటింగ్‌: న‌వీన్ నూలి

నిర్మాత‌: రామ్ తాళ్లూరి

ద‌ర్శ‌క‌త్వం: వి.ఐ.ఆనంద్‌

వ్య‌వ‌థి: 149.08 నిమిషాలు

సెన్సార్‌: యు/ఎ


త‌న‌దైన బాడీలాంగ్వేజ్‌, మేన‌రిజ‌మ్స్‌, ఎన‌ర్జీతో త‌న కంటూ ఓ ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకున్న హీరో ర‌వితేజ‌. `రాజాదిగ్రేట్‌` స‌క్సెస్ త‌ర్వాత ర‌వితేజ చేసిన మూడు సినిమాలు ట‌చ్ చేసిచూడు, నేల టిక్కెట్టు, అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని.. బాక్సాఫీస్ వ‌ద్ద ప్లాప్ చిత్రాలుగానే మిగిలాయి. దీంతో రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ సినిమా చేయాల‌నే ఆలోచ‌న‌తో కాకుండా డిఫ‌రెంట్ సినిమాలు చేసే ద‌ర్శ‌కుడు వి.ఐ.ఆనంద్‌తో చేతులు క‌లిపాడు ర‌వితేజ‌. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రూపొందిన సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్ `డిస్కోరాజా`. ర‌వితేజ‌తో గ‌తంలో `నేల‌టిక్కెట్టు` సినిమాను నిర్మించిన రామ్ తాళ్లూరియే ఈ సినిమాను నిర్మించ‌డం విశేషం. మ‌రి నిర్మాత‌గా రామ్ తాళ్లూరి బాక్సాఫీస్ వ‌ద్ద స‌క్సెస్‌ను అందుకున్నాడా? హ‌్యాట్రిక్ ప్లాపులు త‌ర్వాత ర‌వితేజ‌కి స‌క్సెస్ వ‌చ్చిందా? ద‌ర్శ‌కుడు వి.ఐ.ఆనంద్ ఈ చిత్రంలో ర‌వితేజ‌ను ఎలా ప్రెజెంట్ చేశాడు అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా క‌థ‌లోకి వెళ‌దాం...

క‌థ‌:

వాసు(ర‌వితేజ‌) అనాథ‌. త‌న‌తో పాటు మ‌రికొంత మంది అనాథ‌ల‌ను చేర‌దీసి పెంచుతుంటాడు. వారు ఉంటున్న ఇల్లును కొనుక్కోవాల‌ని అనుకుంటారు. దాని కోసం పాతిక ల‌క్షల రూపాయ‌ల‌ను పోగు చేస్తారు. అయితే ఆ డ‌బ్బులు వేరొక‌రు దొంగలిస్తారు. ఆ డ‌బ్బును వెతుక్కుంటూ వాసు గోవా వెళ‌తాడు. అయితే వాసు ల‌డ‌క్‌లో చ‌నిపోయి మంచు గ‌డ్డ‌ల్లో కూరుకుపోతాడు. అత‌ని శ‌వాన్ని తీసుకొచ్చిన శాస్త్ర‌వేత్త ఆ శ‌వంలోని అవ‌య‌వాలు పాడు కాకుండా ఉండ‌టం చూసి ఆశ్చ‌ర్య‌పోతాడు. ప్ర‌భుత్వానికి తెలియ‌కుండా తాను చేస్తున్న ఓ ప్ర‌యోగం ద్వారా ఆ శ‌వానికి ప్రాణం పోస్తాడు. అయితే ప్రాణం వ‌చ్చిన త‌ర్వాత స‌ద‌రు వ్య‌క్తికి ఏవీ గుర్తుండ‌వు. అతని గురించి తెలిసిన కొంద‌రు వ్య‌క్తులు చంప‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తారు. అప్పుడు వారికి షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. డాక్ట‌ర్ల ప్ర‌యోగం ద్వారా ప్రాణం పోసుకుంది వాసు కాద‌ని.. 35 ఏళ్ల క్రితం చంప‌బ‌డ్డ డిస్కోరాజా అని. అస‌లు డిస్కోరాజా ఎవ‌రు? అత‌ని 35 ఏళ్ల క్రితం ఎవ‌రు చంపేస్తారు? మ‌రి వాసు ఏమ‌వుతాడు? వాసు ఎవ‌రు? డిస్కోరాజాకి, సేతుకి ఉన్న వైర‌మేంటి? అనే విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే...

 

విశ్లేష‌ణ‌:

డిస్కోరాజా..డిస్కో మ్యూజిక్‌ను ఇష్ట‌ప‌డే రాజా అనే ఓ గ్యాంగ్‌స్ట‌ర్ క‌థ. సింపుల్‌గా చెప్పాలంటే ఇదే సినిమా లైన్‌. రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ మూవీ. నాన్న ర‌వితేజ చ‌నిపోవడం.. అత‌నికి కొడుకు ర‌వితేజ ఉండ‌టం. అత‌నిపై ప‌గ సాధించ‌డానికి వ‌చ్చిన విల‌న్స్ భ‌ర‌తం ఎలా ప‌ట్టార‌నేది మూల క‌థ‌. అయితే దీనికి తండ్రి పాత్ర‌లో1980 బ్యాక్‌డ్రాప్‌లో కాస్త ట‌చింగ్ ఇవ్వ‌డం . కొడుకు పాత్ర‌ను అనాథ చూపించి అత‌ని చుట్టూ క‌థ‌ను న‌డ‌ప‌డం. చివ‌ర‌కు తండ్రే అస‌లు త‌న వెనుక క‌థ ఏం జ‌రిగిందో తెలుసుకునే క్ర‌మంలో న‌డిచే సినిమా. ఓ ర‌కంగా చెప్పాలంటే కొడుకు పాత్ర‌కు ఈ సినిమాలో పెద్ద‌గా స్కోప్ లేదు. అత‌నికే స్కోప్ లేదంటే అత‌ని గ‌ర్ల్‌ఫ్రెండ్ పాత్రకు ఇంకేం స్కోప్ ఉంటుంది. అలాంటి పాత్ర‌లో న‌భా న‌టేశ్ న‌టించింది. ఆమెకు ఈ సినిమాలో న‌టించే సీనే క‌న‌ప‌డ‌లేదు. ఇక ఏదో సినిమా చేయాల‌నే ఉద్దేశంతో చేసేసిన‌ట్లుగా ఉంది. ఇస్మార్ట్ శంక‌ర్‌తో న‌భా న‌టేశ్‌కు మంచి క్రేజే ద‌క్కింది. కానీ.. ఆ క్రేజ్ ఈ సినిమాతో పోయింది. ఇక సినిమాను న‌డిపించే మెయిన్ పాత్ర డిస్కోరాజాది. ఈ పాత్ర‌తో పాటు అత‌ని కొడుకు పాత్ర‌ను ర‌వితేజ క్యారీ చేశాడు. తండ్రి పాత్ర‌.. కొడుకు పాత్ర ఒకే ఏజ్‌లో ఉండే కాన్సెప్ట్ ఉండే సినిమా కావ‌డంతో ర‌వితేజ‌ను ఎక్క‌డా ఏజ్ డిఫ‌రెన్స్ చూపించాల్సిన అవ‌స‌రం లేకుండా పోయింది. ఆ విష‌యంలో డైరెక్ట‌ర్ వి.ఐ.ఆనంద్‌ను అభినందించాలి. ఈ రెండు పాత్ర‌ల‌కు ఉన్న క‌మ‌ర్షియ‌ల్ ట‌చ్‌.. కొత్త‌ద‌నం లేని పాత్రలు కావ‌డంతో ర‌వితేజ రెండు పాత్ర‌ల‌ను త‌న‌దైన స్టైల్లో చేసేశాడు. లుక్ ప‌రంగా యంగ్‌గా క‌నిపించి ఆక‌ట్టుకున్నాడు.

 

వాసు అనే పాత్ర కంటే డిస్కోరాజ పాత్ర‌కున్న ప్రాధాన్య‌త ఎక్కువ‌. 1980 బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ పాత్ర‌లో ర‌వితేజ లుక్ అప్ప‌టి రెట్రో లుక్‌ను పోలి ఉంది. ర‌వితేజ రెట్రో లుక్ మిన‌హా సినిమాలో చెప్పుకోద‌గ్గ ఎలిమెంట్స్ లేవు. హీరో డాన్‌గా ఎదిగడం.. అత‌ని ఓ శ‌త్రువు ఉండ‌టం.. మ‌రో క‌న‌ప‌డ‌ని శత్రువు ఉండ‌టం కామ‌న్‌గా ఇత‌ర సినిమాల్లో ఉన్న‌ట్లే ఉంది. (క‌న‌ప‌డ‌ని శత్రువు పాయింటే మెయిన్ ట్విస్ట్‌). డిస్కోరాజా గ్యాంగ్‌స్ట‌ర్‌గా ఎదిగే క్ర‌మంలో బ్యాంకు దొంగ‌త‌నం కామెడీగా అనిపిస్తుంది. బ్యాంకును దొంగ‌తనం చేసిన దెవ‌రో తెలిసినా పోలీసులు ఆల‌స్యంగా వ‌స్తారు. స‌రే! సినిమా క‌దా..పోలీసులు ఆల‌స్యంగా వ‌స్తారులే అనుకుంటే.. త‌ర్వాత అత‌నెవ‌రో తెలిసినా పోలీసులు, బ్యాంకు అధికారులు ప‌ట్టించుకోక‌పోవ‌డం ఇవ‌న్నీ లాజిక్కుల‌కు అంద‌వు. ఇక డాన్‌గా ఎదిగే క్ర‌మంలో ర‌వితేజ‌ను ప్లేబోయ్‌గా చూపించే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు. అత‌ను మాట‌లు రాని.. విన‌ప‌డ‌ని హీరోయిన్‌ను ప్రేమించ‌డం ఆమె ప్రేమ‌కోసం గ్యాంగ్‌స్ట‌ర్ క‌నుమ‌రుగై కొత్త జీవితాన్ని ప్రారంభించాల‌నుకుంటాడు. ఆ క్ర‌మంలో అత‌నిపై దాడి జ‌ర‌గ‌డం. రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ సినిమా. ఈ విష‌యాలు తెలియ‌ని కొడుకు ర‌వితేజ.. తండ్రిని చంపాల‌నుకోవ‌డం.. కానీ నిజం తెలుసుకుని మెయిన్ విల‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లడం అత‌న్ని చంపేస్తారు. కానీ ఇక్క‌డ అస‌లు ట్విస్టు. అస‌లు హీరో క‌ష్టాల‌కు కార‌ణ‌మైన విల‌న్ మ‌రొక‌డుంటాడు. అత‌న్ని చంప‌డంతో సినిమా ముగుస్తుంది. పాయ‌ల్ రాజ్‌పుత్ పాత్ర జ‌స్ట్ ఓకే. ఓపాట మ‌రికొన్ని సీన్స్‌తో త‌న పాత్ర‌ను ప‌రిమితం చేశారు. కానీ త‌న‌కు ఈ పాత్ర పెద్ద బ్రేక్ ఇవ్వ‌దని సినిమా చూస్తే క‌చ్చితంగా అర్థ‌మ‌వుతుంది. ఇక తాన్యా హోప్ పాత్ర గురించి ఎంత త‌క్కువ‌గా చెప్పుకుంటే అంత బెట‌ర్‌. ఇక రాంకీ, స‌త్య‌, సునీల్‌, ర‌ఘుబాబు, భ‌ర‌త్‌, వెన్నెల‌కిషోర్ త‌దిత‌రులు వారి వారి పాత్ర‌ల ప‌రిధి మేర చ‌క్క‌గా న‌టించారు. ఇక సాంకేతికంగా చూస్తే త‌మ‌న్ సంగీతం `నువ్వు నాతో ఏమ‌న్నావో ...` పాట మాత్ర‌మే విన‌డానికి బావుంది. పాట‌లు చూడటానికి గొప్ప‌గా ఏవీ లేవు. బ్యాగ్రౌండ్ స్కోర్ ఓకే. కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని కెమెరా ప‌నిత‌నం సినిమా ప్రారంభంలో వ‌చ్చే ల‌డ‌క్ సన్నివేశాల్లో సూప‌ర్బ్‌. మిగ‌తా వాటిలో ఓకే అనిపిస్తుంది. ఎడిట‌ర్ మాత్రం సెకండాఫ్‌లో మ‌రో ప‌దిహేను నిమిషాలు క‌త్తెర‌కు ప‌ని చెప్పి ఉండాల్సింది.

 

సినిమాలో ప్రేక్ష‌కుడికి న‌చ్చే మూడు ఎలిమెంట్స్‌లో ప్రారంభం ల‌డ‌క్‌లో వ‌చ్చే సీన్స్‌.. ఇంట‌ర్వెల్ బ్యాంగులో శాస్త్ర‌వేత్త‌లు, డాక్ట‌ర్స్ ద‌గ్గ‌ర ఉండేది డిస్కోరాజా అని తెలిసే సంద‌ర్భం.. ఇక క్లైమాక్స్ సునీల్ మెయిన్ విల‌న్ అని వ‌చ్చే ట్విస్ట్ . ఇవి త‌ప్ప సినిమాలో చెప్పుకోద‌గ్గ అంశాలేవీ లేవు. ద‌ర్శ‌కుడు వి.ఐ.ఆనంద్ తాను రాసుకున్న రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాకు 1980 బ్యాక్ డ్రాప్ ఇచ్చేసి, గొప్ప సైంటిఫిక్ యాక్ష‌న్ మూవీ అనే రేంజ్‌లో బిల్డ‌ప్ ఇచ్చేశాడు. కానీ ప్రేక్ష‌కుడి స‌హనానికి సినిమా ఓ ద‌శ‌లో ప‌రీక్ష పెడుతుంది. ఇక సినిమా అసాంతం గొప్ప‌గా చూపించే బాబీ సింహ విల‌నిజం క్లైమాక్స్‌లో తేలిపోయింది. సునీల్‌ను హైలైట్ చేసే ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. మ‌రి ఈ సినిమాతో అయినా సునీల్‌కు విల‌న్‌గా అవ‌కాశాలు వ‌స్తాయేమో చూడాలి.

 

చివ‌ర‌గా.. డిస్కోరాజా.. కాస్త 1980 బ్యాక్ డ్రాప్‌తో సాగే రొటీన్ బోరింగ్ క‌మ‌ర్షియ‌ల్ డ్రామా.. సింపుల్‌గా చెబితే బోరింగ్ రాజా ఆనాలేమో!

రేటింగ్‌: 2/5

Updated Date - 2020-02-02T00:31:13+05:30 IST