బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా రవీనా టండప్ చాలా కాలం కొనసాగింది. గోవిందా, అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్ తదితరులతో కలిసి ఆమె నటించింది. అయితే, ప్రస్తుతం ఈమెకు చెప్పుదగ్గ స్థాయిలో అవకాశాలు రావడం లేదు. దీంతో కొన్నేళ్లుగా సినీ ఇండస్ట్రీలో పాతుకుపోయిన నెపోటిజం గురించి ఆమె గొంతెత్తి మాట్లాడుతోంది. తాజాగా ఓ ఇంటర్యూలో మాట్లాడిన ఆమె.. సంచలన వ్యాఖ్యలు చేసింది. హీరోల గాళ్‌ఫ్రెండ్స్ అభద్రతకు లోను కావడంతో తనను అనేక సినిమాల నుంచి తప్పించారని ఆరోపించింది.
హీరో పేరును ప్రస్తావించకుండా తాను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది. ‘ఓ హీరోతో నేను చాలా సినిమాల్లో నటించా. మేము చేసిన ప్రతి సినిమా హిట్ కావడంతో హిట్ కాంబినేషన్‌గా మాకు పేరొచ్చింది. అదే జోరులో ఇద్దరం మరో సినిమా చేసేందుకు రెడీ అయ్యాం. అయితే, ఆ హీరోతో అప్పటికే డేటింగ్లో ఉన్న యువతి నన్ను చూసి అభద్రతకు లోనైంది. సినిమాలో నుంచి నన్ను తప్పించాలని హీరోని బలవంతం చేసింది. గాళ్‌ఫ్రెండ్ మాటను హీరో కాదనలేదు. దీంతో అతడితో కమిటైన రెండు సినిమాలు నా చేయి జారిపోయాయి. అనంతరం అదే యువతి మరో స్టార్ హీరో వద్దకు వెళ్లి మళ్లీ ఇదే కోరిక కోరింది. ఆ తర్వాత నాకు అవకాశాలు తగ్గాయి. కొన్ని రోజులకు ఆ యువతి మొదటి హీరోను వదిలేసింది. అపుడు తప్పు తెలుసుకుని ఆ హీరో నా దగ్గరకొచ్చాడు. కలిసి సినిమాలు చేద్దామని కోరాడు. ఇపుడు ఆ విషయం తల్చుకుంటే నవ్వొస్తుంది’ అని రవీనా టండన్ వెల్లడించింది.