ప్రేమ గురించి ఈ నలుగురు హీరోయిన్లు ఏం చెప్పారంటే..!

ప్రేమంటే... రెండు హృదయాలకు ఒకే ఉదయం. ప్రేమంటే... రెండు ప్రపంచాలు ఏకం అయిపోవడం. కళ్లు విప్పకుండా ఈ లోకాన్ని చూడొచ్చేమో కానీ, మరొకరికి మనసు ఇవ్వకుండా ఒక జీవితాన్ని పూర్తి చేయలేం. ప్రేమలో పడనివాళ్లు... ప్రేమలో పడి తేలనివాళ్లు ఉండరేమో..? ప్రేమ కూడా పరీక్షే. ఎన్నిసార్లయినా రాయొచ్చు. అందులో ఫెయిల్‌ అవ్వడం ఉండదు. ప్రేమలో ప్రతి ఓటమి. మరో కొత్త ప్రేమకథకు పునాది. అందులోనూ తొలి ప్రేమ ఎప్పుడూ ప్రత్యేకమే. ఆ అనుభూతి అమృతమయం. ఆ పరిమళం ఓ జీవితకాలం. మన కథానాయికల్లో చాలామంది తొలి ప్రేమ తొలకరి ఝల్లులో తడిసిన వాళ్లే. ఆ జ్ఞాపకాల్ని ఒకసారి తట్టి లేపితే..?!


ఓడిపోనిది ప్రేమ ఒక్కటే: రష్మిక

‘‘ప్రేమ నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఎందుకంటే... జీవితంలో పుట్టుక, చావులా.. ప్రేమ కూడా ఓ ఘట్టమే. ప్రేమపై నాకెప్పుడూ ఒకే అభిప్రాయం ఉంది. ప్రేమ గొప్పది. ప్రేమలో పడిన వాళ్లు ఓడిపోతారేమో..?  కానీ ప్రేమ ఓడిపోదు. నా ప్రేమ కూడా విఫలం అయ్యింది. కానీ ప్రేమపై గౌరవం ఎప్పుడూ తగ్గలేదు. మా ఇంట్లోవాళ్లు నాకు కావల్సినంత స్వేచ్ఛ ఇచ్చారు. కానీ దాన్ని నేనెప్పుడూ దుర్వినియోగం చేయలేదు.  నా తొలి సినిమా ‘కిరిక్‌ పార్టీ’ చేస్తున్నప్పుడు రక్షిత్‌ శెట్టి పై అభిమానం ఏర్పడింది. అది ప్రేమగా ఎప్పుడు మారిందో నాకే తెలీదు. సెట్లో ప్రతిక్షణం పిక్నిక్‌లా గడిచేది. ‘మేం ప్రేమించుకోవడానికే ఈ సినిమా తీస్తున్నారు’ అనిపించేది. ఇంట్లోవాళ్లెవరూ మా ప్రేమకు అభ్యంతరం చెప్పలేదు. దాంతో పెళ్లి చేసుకుందామనుకున్నాం. కానీ పరిస్థితులు మారాయి. ఇద్దరి మధ్యా అభిప్రాయ బేధాలు మొదలయ్యాయి.  ఆ ప్రేమకథ గడిచిపోయిన అధ్యాయం. భవిష్యత్తులో మళ్లీ ప్రేమిస్తానా, లేదా? అనేది ఇప్పుడే చెప్పలేను’’.


ప్రేమ కాదు.. అయోమయం: కియారా అద్వాణీ

‘‘ప్రేమ ఆకర్షణ నుంచే మొదలవుతుంది. అయితే ఆ దశని దాటి ఎంత బలంగా ఆ బంధం నిలబడుతుంది? అనేదే ముఖ్యం. నేను కూడా పదో తరగతిలోనే ప్రేమించా. బహుశా... దాన్ని ప్రేమ అనకూడదేమో..? అయోమయం అనాలేమో..? కలిసి సరదాగా మాట్లాడుకోవడం, గిఫ్టులు ఇచ్చి పుచ్చుకోవడమే ప్రేమ అనుకునేదాన్ని. మా స్కూల్లోనే చదివే ఓ అబ్బాయితో చాలా క్లోజ్‌గా ఉండేదాన్ని. మేమిద్దం ఫోన్లలో గంటల తరబడి మాట్లాడుకునేవాళ్లం. ఎప్పుడూ లేనిది ఫోన్‌ బిల్లు పెరగడం మొదలైంది. వాళ్లకు ఓసారి రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయా. అమ్మానాన్నలది ప్రేమ పెళ్లే. ‘నాక్కూడా అలాంటి ఓ ప్రేమకథ ఉంటే బాగుంటుంది కదా’ అనుకునేదాన్ని. అందుకే పదో తరగతిలోనే ప్రేమించేశానేమో..? ఇప్పుడు తలచుకుంటే అదంతా సిల్లీగా అనిపిస్తుంది’’.

ప్రేమే ఆక్సిజన్‌: రాశీ ఖన్నా

‘‘ఈ సృష్టి నడిచేది ప్రేమ వల్లే. అది ఈ సృష్టికి ఆక్సిజన్‌ లాంటిది. ప్రేమని గౌరవించినవాళ్లే మిగిలిన బంధాలకూ విలువ ఇస్తారన్నది నా నమ్మకం. కాకపోతే.. నేనెప్పుడూ ‘లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌’ అనే మాటని నమ్మను. తొలి చూపులోనే ప్రేమించడం ఒక్క సినిమాల్లోనే సాధ్యం. బయట చాలా లెక్కలుంటాయి. ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికీ, జీవితాంతం కలిసి బతకొచ్చు అనే నమ్మకం కలగడానికి కొంత సమయం పడుతుంది. నాకూ ఓ ప్రేమకథ ఉంది. నా పదహారో ఏటనే ఓ అబ్బాయిని ప్రేమించా. అది ప్రేమ కాదు.. ఆకర్షణే అని తెలియడానికి ఎంతో కాలం పట్టలేదు. అందుకే వెంటనే బయట పడిపోయా. ’’


అదే ప్రాణం: మెహరీన్‌

‘‘చిన్నప్పటి నుంచీ సల్మాన్‌ఖాన్‌ అంటే విపరీతమైన ఇష్టం. ఓరకంగా.. సల్మాన్‌తో నాది వన్‌ సైడ్‌ లవ్‌. ఆ తరవాత నటిగా మారాను. ఇప్పుడు నాకు ప్రేమకీ ఆకర్షణ కు మధ్య తేడా తెలిసింది. బిష్ణోయ్‌తో నా ప్రేమ కథ కూడా చాలా సరదాగా మొదలైంది. తను నాకు ఎప్పటి నుంచో తెలుసు. విహార యాత్ర కోసం ఓసారి అండమాన్‌ వెళ్లాం. అక్కడ సముద్రం మధ్యలో ‘నన్ను పెళ్లి చేసుకుంటావా’ అని అడిగాడు. అప్పుడే నాకు అర్థమైంది. ఇద్దరం పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. నిశ్చితార్థం కూడా అయ్యింది. కానీ... మా ప్రేమ పెళ్లి పీటలెక్కలేదు.  ప్రేమలో గెలిచినప్పుడు కంటే ఓడిపోయినప్పుడే ఎక్కువ అనుభూతుల్ని మూటగట్టుకోవచ్చు. నా జీవితంలోనూ అదే జరిగింది. ప్రేమిస్తే.. నిజాయతీగా ఉండండి.   ప్రేమకు ప్రాణం పోసేది ఆ నిజాయితే. ఇదే ప్రేమికులకు నేనిచ్చే సలహా’’.

-అన్వర్‌

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.