బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న షో ‘కాఫీ విత్ కరణ్’ (Koffee With Karan). ‘డిస్నీ+హాట్ స్టార్’ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ షోలోని తొలి రెండు ఎపిసోడ్స్‌కు రణ్వీర్ సింగ్, ఆలియా భట్, జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ హాజరయ్యారు. మూడో ఎపిసోడ్‌కు సమంత రుత్ ప్రభు (Samantha Ruth Prabhu), అక్షయ్ కుమార్ జంటగా హాజరయ్యి సందడి చేశారు. ర్యాఫిడ్ ఫైర్ రౌండ్లో భాగంగా తాను రణ్వీర్ సింగ్‌కు అభిమానిగా మారిపోయానని సమంత చెప్పింది. ర్యాపిడ్ ఫైర్ రౌండ్లో.. ‘‘నువ్వు బ్యాచిలరేట్ పార్టీని హోస్ట్ చేస్తే అక్కడ డ్యాన్స్ చేయడానికీ ఏ ఇద్దరు బాలీవుడ్ హీరోలను తీసుకుంటావు’’ అని కరణ్ జోహార్ సమంతను అడిగాడు. అందుకు సమంత.. రణ్వీర్ సింగ్ అని రెండు సార్లు చెప్పుకొచ్చింది. కరణ్ అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా కూడా రణ్వీర్ పేరునే సామ్ చెప్పింది. రణ్వీర్తో ఓ యాడ్‌ను షూట్ చేశానని అప్పుడే అతడికి అభిమానిగా మారిపోయానని సామ్ చెప్పింది. తాజాగా రణ్వీర్ సింగ్ (Ranveer Singh) మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. సామ్ ప్రశంసలపై స్పందించాడు.
భవిష్యత్తులో సమంతతో కలసి మరిన్ని ప్రాజెక్టులు చేయాలని కోరుకుంటున్నట్టు రణ్వీర్ సింగ్ చెప్పాడు. ‘‘సమంత అద్భుతమైన మనిషి. నటిగా నాకు ఇష్టం. వ్యక్తిగా అయితే ఆ ఇష్టం మరింత పెరుగుతుంది. ఆమె సహృదయం కలది. జోకులు వేస్తూ పక్కన ఉన్న వారిని నవ్విస్తుంటుంది. ఆమెకు చాలా టాలెంట్ ఉంది. మేం ఇద్దరం కలసి ఓ యాడ్ షూట్ చేశాం. ఆ సమయంలోనే మేమిద్దరం మొదటిసారి కలుసుకున్నాం. అప్పుడే మా మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది’’ అని రణ్వీర్ సింగ్ చెప్పాడు. ఇక కెరీర్ విషయానికి వస్తే.. రణ్ వీర్ తాజాగా ‘సర్కస్’ (Cirkus)లో నటించాడు. ఈ చిత్రానికీ రోహిత్ శెట్టి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న విడుదల కానుంది.