బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ‘పుష్ప’ జోరు ఇంకా తగ్గలేదు. అక్కడ మాస్ జనం ఇంకా ‘పుష్ప’ నామజపం మానలేదు. ఏమాత్రం ఊహించని రేంజ్లో దాదాపు రూ. 80 కోట్లకు పైగానే గ్రాస్ వసూళ్ళు చేసి ట్రేడ్ పండితుల్ని ఆశ్చర్యపరిచింది. బన్నీ మాస్ మేకోవర్, కేరక్టర్ ట్రాన్ఫార్మేషన్, యాక్టింగ్ అండ్ యాక్షన్ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. వరల్డ్ వైడ్ గా దాదాపు రూ. 300 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్స్ తెచ్చుకొని సౌత్ సత్తా ఏంటో చాటిచెప్పింది ‘పుష్ప’. ఈ సినిమా కారణంగా డైరెక్టర్ సుకుమార్ పేరు నార్త్‌లో మారుమోగిపోతోంది. దీంతో చాలా మంది నార్త్ మేకర్స్ సుకుమార్ గత చిత్రాలపై కన్నేశారు. అందులో భాగంగా గోల్డ్ మైన్స్ అనే సంస్థ రామ్ చరణ్ ‘రంగస్థలం’ చిత్రాన్ని హిందీలో డబ్బింగ్ చేయడానికి రెడీ అయింది.
ఈ నెల 26న బన్నీ ‘అల వైకుంఠపురములో’ చిత్రం హిందీ వెర్షన్ ను విడుదల చేయబోతోంది ఇదే సంస్థ. ఫిబ్రవరిలో ‘రంగస్థలం’ హిందీ వెర్షన్ ను విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాను దేశవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఈ పీరియాడికల్ క్లాసిక్ మూవీ ఖచ్చితంగా బాలీవుడ్ ప్రేక్షకులకు నచ్చుతుందని గోల్డ్ మైన్ సంస్థ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది. మరి చెర్రీ ‘ఆర్.ఆర్.ఆర్’ విడుదలకు ముందు ‘రంగస్థలం’ చిత్రంతో బాలీవుడ్లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.