Ranga Ranga Vaibhavanga Review: రంగ రంగ ఇంత ఘోరంగా..

ABN , First Publish Date - 2022-09-02T21:24:39+05:30 IST

వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) ‘ఉప్పెన’ (Uppena) అనే సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. చిరంజీవి (Chiranjeevi) మేనల్లుడుగా.. మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. వైష్ణవ్ తేజ్ రెండో సినిమా ‘కొండపొలం’ (Kondapolam) సరిగా ఆడకపోయినా..

Ranga Ranga Vaibhavanga Review: రంగ రంగ ఇంత ఘోరంగా..

సినిమా: రంగ రంగ వైభవంగా (Ranga Ranga Vaibhavanga)

నటీనటులు: వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ, నవీన్ చంద్ర, నరేష్, ప్రభు, ప్రగతి, తులసి తదితరులు

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

సినిమాటోగ్రఫీ: శ్యామ్‌దత్ సైనుద్దీన్

ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు

నిర్మాత: బివిఎస్ఎన్ ప్రసాద్

కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: గిరీశాయ

విడుదల తేదీ: 02 సెప్టెంబర్, 2022


-సురేష్ కవిరాయని


వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) ‘ఉప్పెన’ (Uppena) అనే సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. చిరంజీవి (Chiranjeevi) మేనల్లుడుగా.. మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. వైష్ణవ్ తేజ్ రెండో సినిమా ‘కొండపొలం’ (Kondapolam) సరిగా ఆడకపోయినా.. నటుడిగా అతనికి మంచి పేరు వచ్చింది. ఇప్పుడు మూడో సినిమా – ‘రంగ రంగ వైభవంగా’ (Ranga Ranga Vaibhavanga) విడుదలైంది. చినమామయ్య పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పుట్టినరోజు నాడు ఈ సినిమా విడుదలవడం వైష్ణవ్ తేజ్‌కి ప్లస్ పాయింట్‌గా భావించారు. దీనికి సంగీతం దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) ఇచ్చారు ఈ సినిమాలో కేతిక శర్మ (Ketika Sharma) కథానాయికగా చేసింది. ఈ ‘రంగ రంగ వైభవంగా’ సినిమా ఎలా ఉందో చూద్దాం..


కథ:

రిషి (వైష్ణవ్ తేజ్) మరియు రాధ (కేతికా శర్మ) ఇద్దరూ.. వేరు వేరు కుటుంబాలకు చెందిన వారైనా.. చిన్నప్పటి నుండి కలిసి పెరుగుతారు. వాళ్ల తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులుగా ఉంటారు. రిషి మరియు రాధ ఒకే కాలేజీలో చదువుతున్నా.. చిన్న ఇగో ప్రాబ్లమ్ కారణంగా వాళ్ళిద్దరూ మధ్యలో మాట్లాడుకోవడం మానేస్తారు. ఆ తర్వాత ఒక చిన్న సంఘటన జరిగి మళ్లీ ఇద్దరు మాట్లాడుకోవడం మొదలుపెడతారు. రిషి అన్నయ్య, రాధ అక్కయ్య కూడా ప్రేమలో వుండి, పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటారు. అది రాజకీయవేత్త అయినటువంటి రాధ అన్నయ్య (నవీన్ చంద్ర)కి నచ్చదు. చిన్న గొడవ జరిగి, రెండు కుటుంబాల మధ్య మాటలు ఆగిపోతాయి, కుటుంబాలు విడిపోతాయి. మళ్లీ ఏ విధంగా ఈ రెండు కుటుంబాలు కలిశాయి? రిషి- రాధల వివాహం జరిగిందా.. లేదా? అనే విషయాలు తెలియాలంటే తెర మీద చూడాల్సిందే. 


విశ్లేషణ:

ఈ సినిమాతో గిరీశాయ (Gireesaaya) అనే కొత్త దర్శకుడు పరిచయమయ్యాడు. కథ, స్ర్కీన్‌ప్లే కూడా ఆయనే అందించాడు. కానీ ఒక పాత కథను తీసుకొని కొంచెం అటు ఇటు మార్చడం తప్ప గిరీశాయ చేసిందేమీ లేదు. అలాగే దర్శకుడిగా సినిమాని ఆసక్తికరంగానూ చిత్రీకరించలేకపోయాడు, ఎందుకంటే కథలో పట్టులేదు కాబట్టి. ప్రేక్షకులకి రాబోయే సన్నివేశాలు ఏ విధంగా వుంటాయో, ఏమి జరగబోతుందో అనేది ముందే తెలిసిపోతుంది. ఎక్కడా కూడా కొత్తదనం కనిపించదు. ‘కంటెంట్ బాగుండాలి...’ అని అంటూ ఉంటారు కదా, మరి ఒక సీనియర్ నిర్మాత అయిన బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ కథని ఎలా అంగీకరించారో ఆయనకే తెలియాలి. అందుకని కాబోలు ఆయన ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ మీద కూడా పెద్దగా దృష్టి పెట్టలేదు. (Ranga Ranga Vaibhavanga Review)


ఇక నటీనటుల విషయానికి వస్తే వైష్ణవ్ తేజ్‌కి ఇందులో వేసిన రిషి రోల్ అంత చెప్పుకోదగ్గది కాదు.. ఆ పాత్ర పరిమితులకి తగ్గట్టు అతను నటించాడు. కేతిక శర్మ అందంగా కనిపించింది, అంతే. రిషి తండ్రిగా సీనియర్ నటుడు నరేష్.. మరొక రొటీన్ రోల్‌ ప్లే చేశాడు. రాధ తండ్రి పాత్రలో తమిళ్ యాక్టర్ ప్రభు అంతగా మెప్పించలేకపోయాడు. ఆయన ఫేస్‌లో ఒక్క ఎక్స్‌ప్రెషన్ కూడా కనపడదు. నవీన్ చంద్ర రోల్‌లో రెండు షేడ్స్ ఉంటాయి, కానీ అతనికి కూడా అంత ప్రాముఖ్యం లేదు. కథ బాగోలేనప్పుడు వీళ్ళందరూ ఎన్ని చేసినా అది ప్రేక్షకులను అలరించదు. ఈ సినిమాకి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఇచ్చారు. అతని సంగీతం అంటే ప్రేక్షకులకు ఒక అంచనా ఉంటుంది, కానీ ఈ సినిమాలో అతను నిరాశపరిచాడు. పాటలు కూడా సినిమాకి అదనంగా అందించేదేమీ లేదు. ఇంకా మిగతా సాంకేతిక అంశాలన్నీ సాదాసీదాగా ఉన్నాయి. తన మొదటి సినిమాకి ఒక అవుట్ డేటెడ్ కథని ఎంచుకోవడం, దానిని సరిగా చిత్రీకరించలేకపోవడం దర్శకుడు గిరీశాయ వైఫల్యంగా భావించవచ్చు. మొత్తం మీద ‘రంగ రంగ వైభవంగా’ చివరికి (ఘో)రంగ రంగ వైఫల్యంగా ఉంది. మిస్ అయినా.. ఏమీ చింతించక్కర్లేదు. (Ranga Ranga Vaibhavanga Review)


ట్యాగ్‌లైన్: రంగ రంగ ఇంత ఘోరంగా..

Updated Date - 2022-09-02T21:24:39+05:30 IST