సీనియర్ నటి రమ్యకృష్ణ తనని కించపరిచేలా మాట్లాడారంటూ నటి వనితా విజయ్‌కుమార్ ఇటీవల వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే! రమ్యకృష్ణ కారణంగానే డ్యాన్స్ రియాల్టీ నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ విషయంపై రమ్యకృష్ణ స్పందించారు. రమ్యకృష్ణ న్యాయనిర్ణేతగా ఉన్న బీబీ జోడిగల్ డ్యాన్స్ షోలో వనితా విజయ్‌కుమార్ కంటెస్టెంట్‌గా ఉన్నారు. తాజాగా జరిగిన ఎపిసోడ్లో డ్యాన్స్ సరిగ్గా చేయలేదంటూ వనితకు తక్కువ మార్కులు ఇచ్చారు రమ్యకృష్ణ. దీంతో భావోద్వేగానికి గురైన వనిత ట్విటర్ వేదికగా ఆ షోకి గుడ్‌బై చెబుతున్నట్లు వెల్లడించారు. ‘ఇకపై డ్యాన్స్ షోలో ఉండాలనుకోవడం లేదు. మన కంటే సీనియర్ ప్రతివిషయంలో మనల్ని కించపరుస్తూ మాట్లాడితే తట్టుకోవడం కష్టం. క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఒక మహిళ మరొక మహిళకు అండగా ఉండాలి’ అని వనితా విజయ్‌కుమార్ పోస్ట్ పెట్టారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా రమ్యకృష్ణ స్పందించారు. ‘‘రియాల్టీ షో షూటింగ్ సమయంలో అసలు ఏం జరిగిందో ముందు వనితని అడిగి తెలుసుకోండి. నాకు వరకూ అదేం పెద్ద విషయం కాదు. ఇప్పటికీ ఈ విషయంపై వివరణ కావాలంటే ‘నో కామెంట్’ అనే సమాధానం చెబుతాను’’ అంటూ రమ్యకృష్ణ అన్నారు.