Viral Video: 35 ఏళ్ల క్రితం రాముడి పాత్ర వేసిన నటుడికి.. కాళ్లు మొక్కిన మహిళ

ABN , First Publish Date - 2022-10-02T18:21:35+05:30 IST

దాదాపు 35 సంవత్సరాల క్రితం వచ్చిన సీరియల్ ‘రామాయణ్(Ramayan)’లో రాముడి పాత్ర ద్వారా గుర్తింపు పొందిన నటుడు అరుణ్ గోవిల్ (Arun Govil)...

Viral Video: 35 ఏళ్ల క్రితం రాముడి పాత్ర వేసిన నటుడికి.. కాళ్లు మొక్కిన మహిళ

దాదాపు 35 సంవత్సరాల క్రితం వచ్చిన సీరియల్ ‘రామాయణ్(Ramayan)’లో రాముడి పాత్ర ద్వారా గుర్తింపు పొందిన నటుడు అరుణ్ గోవిల్ (Arun Govil). 1980లో వచ్చిన ఈ సీరియల్‌కి ఇప్పటికీ అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా అందులో రాముడిగా నటించిన అరుణ్‌కి అప్పట్లో ఎంతమంది అభిమానులు ఉన్నారో.. ఇప్పటికీ అలాగే ఉన్నారు. ఆయన ఇప్పటికీ తన అభిమానుల నుంచి అదే ప్రేమ, గౌరవాన్ని పొందుతూనే ఉన్నారు. నిజానికి ఆయనపై అభిమానం అనే కంటే రాముడిగా ఆయనపై ఉన్న భక్తి అనాలేమో. తాజాగా వైరల్ (Viral) అవుతున్న ఈ వీడియో చూస్తుంటే అదే అనిపిస్తుంది. 


ఆ వైరల్ వీడియోలో.. అరుణ్ ఎయిర్‌పోర్టు నుంచి బయటికి వస్తున్నాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చింది. కుంకుమ రంగు చీర ధరించిన ఆ మహిళ ఆయన్ని చూసి మోకాళ్లపై కూర్చుని.. ఆయనకి మొక్కుతుంది. ఆ సమయంలో ఏం చేయాలో తెలియని సదిగ్ధంలో పడిపోయిన నటుడు.. ఆ మహిళ ఆపమని ఆమెతో వచ్చిన వ్యక్తికి సైగ చేస్తున్నాడు. కానీ ఆ వ్యక్తి కూడా నటుడి పాదాలకు అంగుళాల దూరంలో నేలను తాకాడు. అదంతా నటుడి భార్యతో పాటు ఇతరులు అలా చూస్తుండిపోయారు. అనంతరం ఆశీర్వాదానికి చిహ్నంగా నటుడు ఆమె మెడలో పసుపు దుపట్టాను వేశారు.


1987-88 మధ్యకాలంలో రామానంద్ సాగర్ దర్శకత్వం వహించిన హిట్ టీవీ షో ‘రామాయణ్‌’లో అరుణ్ గోవిల్ రామ్ పాత్ర పోషించారు. ఈ షోలో సీతగా దీపికా చిఖాలియా, లక్ష్మణ్‌గా సునీల్ లాహ్రీ నటించారు. లాక్‌డౌన్ సమయంలో ఈ సీరియల్‌ని టీవీలో మరోసారి ప్రసారం చేశారు. దాంతో.. రాముడిగా ఆయన క్రేజ్ మరోసారి పెరిగింది.


కొన్నేళ్ల క్రితం ఈ సీరియల్‌లో రాముడి పాత్ర గురించి అరణ్ మాట్లాడుతూ.. ‘రామాయణం తర్వాత నా సినీ కెరీర్ దాదాపు ముగిసింది. నేను అంతకు ముందు సినిమాలు చేసేవాడిని. కానీ ఈ ఇమేజ్ బలంగా ఉండడంతో నాకు కొత్తగా సినిమాలు రాలేదు. నేను సీరియల్స్‌లో పనిచేయడానికి ప్రయత్నించాను. ఆ ఇమేజ్ నుంచి బయటికి రావాలని ప్రయత్నించాను. కానీ అది ఫలించలేదు. నేను రామ్ కావాలని దేవుడు కోరుకున్నాడని నేను తరువాత గ్రహించాను. ఇలాంటి అవకాశం చాలా తక్కువ మందికి మాత్రమే వస్తుంది. చాలా మంది నన్ను అరుణ్ గోవిల్ అని కాకుండా రామ్ అనే పిలుస్తారు. దాని కంటే గొప్ప విషయం ఇంకేం ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు.



Updated Date - 2022-10-02T18:21:35+05:30 IST