‘భీమ్లా నాయక్’ అడవి తల్లి పాటపై ‘సిరివెన్నెల’ ఏమన్నారంటే: రామజోగయ్య శాస్త్రి

ABN , First Publish Date - 2021-12-05T01:24:41+05:30 IST

ఒక తల్లి కడుపున పుట్టిన ఇద్దరు పిల్లలు తగువు లాడుకుంటుంటే చూడలేని కన్నతల్లి యొక్క మనోవేదన ఏమిటన్నది ఈ పాట సారాంశం. ఇక్కడ కన్నతల్లి ఎవరో కాదు. ‘అడవి తల్లి‘. ఇలాంటి ఒక భావన ఈ పాటలో కావాలని

‘భీమ్లా నాయక్’ అడవి తల్లి పాటపై ‘సిరివెన్నెల’ ఏమన్నారంటే: రామజోగయ్య శాస్త్రి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. స్క్రీన్‌ప్లే- సంభాషణలు ప్రముఖ రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తున్న ఈ చిత్రం నుండి ‘అడవి తల్లి మాట’ అనే పాటను శనివారం మేకర్స్ విడుదల చేశారు. ఈ వీడియోలో స్వర్గీయ సిరివెన్నెల సీతారామశాస్త్రికి నివాళిగా ఆయన ఫొటోతో పాటు ‘మీ ఉచ్ఛ్వాసం కవనం.. మీ నిశ్వాసం గానం...మీ జ్ఞాపకం అమరం’ అనే వాక్యాలను చూపించారు. లోతైన అర్థంతో రామజోగయ్య శాస్త్రి రచించగా.. ఆవేదనా భరితంగా సాగిన థమన్ స్వరాలు ఓ వైపుగుండెల్ని పిండేస్తే.. మరో వైపు దుర్గవ్వ, సాహితి చాగంటిల గళంలో హృదయం బరువెక్కేలా ఈ పాట రూపుదిద్దుకుంది. రెండు నిమిషాల ముప్ఫై రెండు సెకన్లు ఉన్న ఈ పాటలో కనిపిస్తున్న దృశ్యాలు ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి.


ఈ పాట గురించి రామజోగయ్య శాస్త్రి తెలుపుతూ.. ‘‘ఒక తల్లి కడుపున పుట్టిన ఇద్దరు పిల్లలు తగువు లాడుకుంటుంటే చూడలేని కన్నతల్లి యొక్క మనోవేదన ఏమిటన్నది ఈ పాట సారాంశం. ఇక్కడ కన్నతల్లి ఎవరో కాదు. ‘అడవి తల్లి‘. ఇలాంటి ఒక భావన ఈ  పాటలో కావాలని దర్శకులు చెప్పిన వెంటనే నేను, సంగీత దర్శకుడు తమన్ ఆలోచనలు సాగిస్తున్న దశలో, గుండెల్ని రంపపు కోతకు గురి చేస్తుంటే ఎలా ఉంటుందో అలాంటి ఒక శబ్దాన్ని వినిపించారు. దానికి అనుగుణంగా నేను పదాలు కూర్చాను. అలా మా మాటల మధ్యలోనే పాట సిద్ధమైంది. ఆవెంటనే పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, చిత్ర దర్శకుడు సాగర్, చినబాబుగార్లకు వినిపించటం, వారికి ఎంత గానో నచ్చటం, పాట రికార్డ్ అవ్వటం జరిగింది. దీనికి అచ్చంగా పల్లెతనం తొణికిస లాడే గొంతులు సరితూగాయి. నా అదృష్టం ఏమిటంటే ఈ పాట విడుదల అవకముందే, రాసిన వెంటనే మా గురువుగారైన సిరివెన్నెల సీతారామశాస్త్రిగారికి వినిపించటం జరిగింది. పాట విన్న వెంటనే ‘ఈ పాట నేనే రాశానా అన్న భావన, ఈ పల్లె భాష నాకెలా తెలుసు అన్న ఆశ్చర్యం నీకు కలగలేదా..? అంత బాగా రాసావు’ అంటూ మెచ్చుకుని ఆయన ఆశీర్వదించడం ఒకటైతే, చిత్ర కథానుసారం ఓ కీలక సందర్భంలో, అందరినీ ఒక మంచి భావోద్వేగానికి లోనయ్యే లాంటి ఈ గీతం రచించే అవకాశం నాకు రావటం మరో అదృష్టంగా భావిస్తున్నాను..’’ అని అన్నారు.

Updated Date - 2021-12-05T01:24:41+05:30 IST