ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి కలయికలో ఓ సినిమా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి రేర్ కాంబినేషన్ లోని సినిమా ఎలా ఉండబోతుందనే ఆసక్తి అందరిలోనూ ఉంది. అయితే బోయపాటి ట్రేడ్ మార్క్ హైఓల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ గానే ఈ సినిమా ఉంటుందని వేరే చెప్పాలా? దానికి తగ్గట్టుగానే ఓ బ్రహ్మాండమైన స్టోరీ రాసుకున్నాడట బోయపాటి. ఇంతకు ముందు సీనియర్ హీరోతో బోయపాటి తీసిన ‘అఖండ’ ఏ స్థాయిలో సక్సెస్ అయిందో తెలిసిందే. దానికి ఏ మాత్రం తగ్గని రేంజ్ లో రామ్, బోయపాటి కాంబో మూవీ ఉండబోతున్నట్టు టాక్. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ఓ అదిరిపోయే అప్డేట్ వచ్చింది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలోె రామ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని తెలుస్తోంది. అలాగే అందులో ఒకటి హీరో అయితే రెండోది విలన్ అని టాక్. రాజకీయ నేపథ్యంలో సాగే ఇద్దరు అన్నదమ్ముల పవర్ ఫుల్ స్టోరీతో ఈ మూవీ తెరకెక్కనుందట.
మన హీరోలు.. హీరో, విలన్ గా ద్విపాత్రాభినయం చేయడం టాలీవుడ్ లో ఎప్పటి నుంచో ఉన్నదే. గతంలో యన్టీఆర్ ‘శ్రీరామపట్టాభిషేకం’ లో రాముడిగా, రావణుడిగా డ్యూయల్ రోల్స్ లో అదరగొట్టారు. అలాగే కృష్ణ ‘అంతం కాదిది ఆరంభం’, మానవుడు దానవుడు, చిరంజీవి ‘నకిలీ మనిషి’, కృష్ణంరాజు ‘అగ్నిపూలు’, మోహన్ బాబు ‘యమ్. ధర్మరాజు యం.ఏ’, గోపీచంద్ ‘గౌతమ్ నందా’, సూర్య ‘24’ లాంటి సినిమాల్లో హీరోగానూ, విలన్ గానూ నటించి మెప్పించారు. ఇప్పుడు ఈ జెనరేషన్ హీరోల్లో రామ్.. హీరోగానూ, విలన్ గానూ నటించనుండడం విశేషంగా మారింది. ముఖ్యంగా ఇందులో విలన్ గా రామ్ బాడీ లాంగ్వేజ్, నటన నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని టాక్. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.