వారి కోసం నేను త్వరగా చనిపోవాలి.. ఆర్జీవీ షాకింగ్ ట్వీట్లు

సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్లు ఇప్పుడందరికీ షాకిస్తున్నాయి. సంక్రాంతి శుభాకాంక్షలు అని పెడితే షాక్ ఎందుకని అంతా అనుకుంటున్నారా?. కానీ అక్కడ చెప్పింది వర్మ. ఆయన దేనినీ మాములుగా చెప్పరు కదా!. ఇంతకు ముందు ఏపీ ప్రభుత్వంపై వరుస ట్వీట్స్‌తో ఎలా అయితే తన ప్రతిభను కనబరిచారో.. అదే విధంగా ఇప్పుడు సంక్రాంతిని కూడా వర్మ వదలలేదు. ఆయన ట్వీట్స్‌ విషయానికి వస్తే.. 


‘‘అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీ అందరికీ పెద్ద ఇల్లు, ముఖేష్ అంబానీ కంటే ఎక్కువ డబ్బు ఆ భగవంతుడు అనుగ్రహించాలని, ఇకపై ఎటువంటి వైరస్‌లు మీ దరికి చేరకూడదని కోరుతున్నాను. ప్రపంచంలోని అబ్బాయిలందరికీ అందమైన అమ్మాయిలు.. అలాగే అమ్మాయిలకు అందమైన అబ్బాయిలు లభించాలి.

భర్తలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.. మీ భార్యలు ఎప్పటికీ మిమ్మల్ని బాధించకూడదు.. మీరు ఏం చేసినా వారు ఓకే చేయాలనే మీ కోరికను ఆ దేవుడు తీర్చాలని కోరుకుంటున్నాను.

సినిమా నిర్మాతలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.. మీకు ఏ విధంగా టికెట్ ధరలు ఉండాలో అలా నిర్ణయించుకునేటట్లుగా, అలాగే ఫ్లాప్‌లలో మీరు పోగొట్టుకున్న డబ్బంతా చెల్లించేలా ఏపీ ప్రభుత్వం అంగీకరించేలా చేయమని ఆ దేవుడిని కోరుతున్నాను.

చిన్న సినిమాలను నిర్మించే వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.. మీరు తీసే ప్రతీ సినిమా బాహుబలి కంటే చాలా పెద్ద హిట్ అవ్వాలి.

నన్ను ద్వేషించే వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.. నేను త్వరగా చనిపోవాలని కోరుకునే వారి కోరికను సాధ్యమైనంత త్వరగా ఆ దేవుడు తీర్చాలి..’’ అని వర్మ తన వరుస ట్వీట్స్‌లో పేర్కొన్నారు.






అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.