‘తులసి తీర్థం’.. సడెన్‌గా వర్మలో ఈ మార్పు ఏంటి?

ఎప్పుడూ వోడ్కాలో మునిగితేలే వర్మ.. ఇప్పుడు ‘తులసి తీర్థం’ పుచ్చుకోబోతున్నాడంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మరు.. ఎందుకంటే వోడ్కాకి వర్మ బ్రాండ్ అంబాసిడర్ లాంటి వాడు. మరి ఈ ‘తులసి తీర్థం’ ఏమిటని అనుకుంటున్నారు కదా..! ఈ టైటిల్‌తో వర్మ ఇప్పుడు ఓ చిత్రం చేయబోతున్నాడు. ఎప్పుడూ తన చిత్రాలకు వింత వింత టైటిల్స్ పెట్టే వర్మ.. ఇటువంటి టైటిల్‌తో సినిమా చేస్తున్నాడంటే నిజంగా నమ్మశక్యం కాదు. కాకపోతే నమ్మాలి. ఎందుకంటే పేరుకే ఇది ‘తులసి తీర్థం’. లోపలంతా వర్మ మార్కే ఉంటుంది. విషయంలోకి వస్తే..  ‘తులసీదళం’ నవల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ రైటర్‌గా నీరాజనాలందుకుని.. మానసిక వికాస రచనలతో వేలాదిమంది జీవితాలను ప్రభావితం చేస్తున్న రచనా సంచలనం యండమూరి ఈ ‘తులసి తీర్ధం’ కథను తీర్చిదిద్దారు. కాన్సెప్ట్ పరంగా ఇది ‘తులసిదళం’కు సీక్వెల్ కానుంది.

      

ఇప్పటివరకు తన సొంత కథలతో మాత్రమే సినిమాలు తీస్తూ.. నిత్యం వివాదాల్లో ఉండే రాంగోపాల్ వర్మ.. ఇప్పుడు యండమూరి కథ అయిన ‘తులసి తీర్ధం’ను తెరకెక్కించేందుకు ఓకే చెప్పడమే కాదు ఫస్ట్ లుక్ పోస్టర్‌ని కూడా వదిలారు. భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ రేర్ కాంబినేషన్ చిత్రాన్ని అత్యాధునిక గ్రాఫిక్స్‌తో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అతి త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ హారర్ థ్రిల్లర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు అతి త్వరలో వెల్లడించనున్నారు.


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.