రాజనాల తెరపై కనిపిస్తే ప్రేక్షకులు భయపడేవారట!

ABN , First Publish Date - 2021-06-20T09:12:10+05:30 IST

ఎన్టీయార్‌, అక్కినేని నాగేశ్వర్రావు, కాంతారావు.. హీరోలు ఎంత వారైనా సరే ఈయన లేకుంటే ఆ సినిమా చప్పనే. ముష్టి యుద్ధాలనుంచి కత్తి తిప్పడం వరకూ ఆయన సిద్ధహస్తుడు. రాజు వెనకాలో, రాణి తమ్ముడుగానో, యువరాణి బావగానో తెరపై రాజనాల కనిపిస్తే చాలు అప్పట్లో జనాలు భయపడేవారట.

రాజనాల తెరపై కనిపిస్తే ప్రేక్షకులు భయపడేవారట!

ఎన్టీయార్‌, అక్కినేని నాగేశ్వర్రావు, కాంతారావు.. హీరోలు ఎంత వారైనా సరే ఈయన లేకుంటే ఆ సినిమా చప్పనే. ముష్టి యుద్ధాలనుంచి కత్తి తిప్పడం వరకూ ఆయన సిద్ధహస్తుడు. రాజు వెనకాలో, రాణి తమ్ముడుగానో, యువరాణి బావగానో తెరపై రాజనాల కనిపిస్తే చాలు అప్పట్లో జనాలు భయపడేవారట. ఏం మోసం చేస్తాడో, ఎవరిని చంపుతాడో అని ప్రేక్షకులు టెన్షన్‌తో సినిమా చివరి వరకు తెగ ఆసక్తిగా చూసేవారు. వెండితెరపైన ఈయన మంచివాడిగా కనిపించేదాని కంటే మాయావి, మోసగాడు, జిత్తులమారి, మేక వన్నెపులిగా కనిపిస్తేనే ప్రేక్షకుల కడుపు నిండుతుంది. ఈ వెండితెర విలన్‌ నిజజీవితంలో గొప్ప ఆశావాది. కళాప్రేమికుడు. మంచి మనసున్నవాడు. రాజనాల గురించి కొన్ని జ్ఞాపకాలురాజనాలను రాజ్‌ అని కొందరు పిలుచుకునేవారు. రాజనాల పూర్తిపేరు రాజనాల కాళేశ్వరరావు. రాజనాల కల్లయ్య అంటూ చాలామంది పిలిచేవారు.


అయితే ఆయన ఇంటిపేరే సొంతపేరు అయ్యింది. అదే తెరపేరు అయ్యింది. నెల్లూరి జిల్లాలోని కావలిలో జన్మించాడు రాజనాల. 1948 సమయంలో నాటకాల్లో తన ప్రతిభను చాటుకున్నాడు. తన స్నేహితుడి సాయంతో మద్రాసు వెళ్లి అక్కడ ‘ప్రతిజ్ఞ’ అనే చిత్రంతో నెగటివ్‌ షేడ్‌ ఉండే పాత్రలో నటించాడు. ఆ తర్వాత ప్రతినాయకుడి పాత్రలో చెలరేగిపోయాడు. సినిమా ఏదైనా తన కళ్లతో, తన యుద్ధ విన్యాసాలతో ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేశాడు. క్రూరమైన చూపు, ఆ వికటాట్టహాసం నవ్వు గురించి ఎంత చెప్పినా తక్కువ. సినిమాల్లో హీరో పాత్రకు ఏమాత్రం వన్నెతగ్గని ప్రతినాయకుడు రాజనాల!


అదే ఆయన రికార్డు

ఆ రోజుల్లో తమిళ సినిమాల్లో యంజీఆర్‌ లాంటి బడా హీరోలకు పెద్ద విలన్‌ నంబియార్‌. ఈ సుప్రసిద్ధ విలన్‌ తర్వాతనే ఏ విలన్లయినా.    అయితే రాజనాల గురించి చెబితే.. ఒక్కమాటలో ‘తెలుగు సినీ నంబియార్‌’! జానపద బ్రహ్మ శ్రీ విఠలాచార్య సినిమా తీశారు అంటే అందులో ఎంజీయార్‌, టి.ఎస్‌. కాంతారావుగారితో పాటు నంబియార్‌ లాంటి రాజనాలగారు ఖచ్చితంగా ఉండి తీరవలసిందే. మాయలమరాఠీ, మంత్రాల ఘనాపాటి రాజనాలగారికి, కాంతారావుగారికి కత్తియుద్ధాలు, మంత్రతంత్రాలు ఉండితీరవలసిందే. లేకపోతే దానికి విఠలాచార్య గారి ట్రేడ్‌ మార్క్‌ లేనట్లే! చివర్లో కాంతారావు పాత్ర గెలవడం రాజనాల పాత్ర నీరుగారిపోవడం సామాన్యమే. దాన్నే ఆంగ్లంలో ‘పొయెటిక్‌ జస్టిస్‌‘ అంటారు.


రాజనాల విదేశీ చిత్రాలు కూడా చూస్తూ ఆ చిత్రాలలోని విలన్‌లను మేకప్‌ చేయించుకుని, హావభావాలు ప్రదర్శించడం, ముఖ్యంగా చైనా దేశపు వారిలో వస్త్రధారణ తనదైన స్వంత బాణీలో ప్రదర్శించి ప్రేక్షకులను అలరించేవారు. వారు ఓ చలన చిత్రంలో స్వంతంగా ఒక పాటకూడా పాడారు. 1960ల్లో ‘మాయా ది మెగ్నిషిమెంట్‌’ అనే హాలీవుడ్‌ చిత్రంలో నటించాడు. ఇలా హాలీవుడ్‌లో నటించిన తొలి తెలుగువాడు ‘రాజనాల’ కావటం విశేషం. 


కన్నఊరినీ, పేదరికాన్ని మర్చిపోలేదు

పాతికేళ్లపాటు ప్రతినాయకుడిగా, హాస్యనటుడిగా తెలుగు, తమిళ చిత్రపరిశ్రమను ఏలాడు రాజనాల. ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించాడు. అయినా సరే రాజనాల తన సొంత ఊరును, తను బాల్యంలో అనుభవించిన పేదరికాన్ని మరువలేదు. ఓసారి కావలి మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో ఓ సన్మానసభ ఉంది. దాన్ని అభిమానులు ఏర్పాటు చేశారు. కావలిలోనే గ్రామదేవత శ్రీ శాంభవిమాత ఆలయం ఉంది. ఆమె పార్వతీరూపం అని నమ్మకం ప్రజలకు. ఆ ఆలయం ఎదురుగా ఒక దిగుడుబావి ఉండేది. గ్రామంలో అన్ని బావులలో నీరు ఇంకిపోయినా ఆ బావిలో నీరు ఎల్లవేళలా ఉండటం మహాత్మ్యంగా విశేషంగా భావించేవారు అక్కడి భక్తావళి. రాజనాల ఆసభలో ఇలా అన్నారు- ‘నేను చిన్నప్పుడు ఈ బావిలోని నీటిని బిందెలో దింపి భుజంపై పెట్టుకుని మోసుకుని ఇంటికి తీసుకుపోయేవాడిని. ఆ రోజులను ఎప్పుడూ నేను మరిచిపోలేదు. మరిచిపోను’’ అన్నారు. అంతకాదు. వారు శాంభవిమాతకు ఆరోజుల్లోనే ఎంతో విలువైన వెండిపళ్లేన్ని కానుకగా సమర్పించి తన భక్తిప్రపత్తులు మరో మారు ప్రదర్శించారు. ఆలయంలోని బావితవ్వకానికి శ్రీ కసవరాజు వంశీయులు సాయంచేసినట్లు.


అందరి అడ్డా రాజనాల తోట!

తన ఊరికి దగ్గర్లోనే ముసనూరు అనే ప్రాంతంలో ఆయనకు ఓ తోట ఉండేది. ఎంతో విశాలమైంది. విలువైనది. ఎన్టీయార్‌ లాంటి సినిమాస్టార్లు వచ్చినా తన తోటకు రాజనాలగారు ఆహ్వానించేవారు. చాలామంది ఆ తోటను విడిదిగా చేసుకునేవారు. ఆ తర్వాత కాలానుగుణంగా ఆ తోటను ఒక డాక్టర్‌ గారు కొనుగోలు చేశారు. నాలుగు దశాబ్దాలపాటు 400పైన చిత్రాల్లో నటించారు రాజనాలకు మధుమేహం వచ్చింది. అది రాజనాల గారి జీవితాన్ని మార్చివేసింది. నిమ్స్‌ వైద్యశాలలో ఇక చికిత్స ఏమీ చేయలేమని వైద్యులు ఆయన అనుమతితో ఒక కాలు తీసివేశారు. అయినా రాజనాల ఆశావాదం వీడలేదు. ఆయనను అప్పట్లో కలసిన జర్నలిస్టులు విచారం వెలిబుచ్చగా ఆయన నవ్వుతూ ఇలా అన్నారు- ‘‘ఒక కాలు పోతే బాధ ఎందుకండీ? ప్రపంచంలో రెండు కళ్లూ లేనివారు ఎందరో ఉన్నారు. వాళ్లతో పోలిస్తే, నాకు ఎలాగూ ఒక కాలు ఉంది. కనుక అదృష్టవంతుడిని కదండీ నేను’ అన్నారు ఆశాజీవి. విధి వికటించినా ఏ మాత్రంతొణకని, బెణకని.. భయపడని విలన్‌ ‘రాజనాల’. 


రాజనాల విదేశీ చిత్రాలు కూడా చూస్తూ ఆ చిత్రాలలోని విలన్‌లను మేకప్‌ చేయించుకుని, హావభావాలు ప్రదర్శించడం, ముఖ్యంగా చైనా దేశపు వారిలో వస్త్రధారణ తనదైన స్వంత బాణీలో ప్రదర్శించి ప్రేక్షకులను అలరించేవారు. వారు ఓ చలన చిత్రంలో స్వంతంగా ఒక పాటకూడా పాడారు. 1960ల్లో ‘మాయా ది మెగ్నిషిమెంట్‌’ అనేహాలీవుడ్‌ చిత్రంలో నటించాడు. ఇలా హాలీవుడ్‌లో నటించిన తొలి తెలుగువాడు ‘రాజనాల’ కావటం విశేషం. 


కాకుటూరు సుజాత, హైదరాబాద్‌

ఫోన్‌: 9292758241

Updated Date - 2021-06-20T09:12:10+05:30 IST