సినిమాలోని కోడి నాకు బాగా అలవాటైంది.. ఇప్పుడది తినడం లేదట: రాజ్ తరుణ్

యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘అనుభవించు రాజా’. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి సంయుక్తంగా సుప్రియ యార్లగడ్డ నిర్మాణ సారథ్యంలో రూపొందిన ఈ చిత్రం నవంబర్ 26న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా హీరో రాజ్ తరుణ్ మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు. 


ఆయన మాట్లాడుతూ.. ‘‘ ‘అనుభవించు రాజా’ చిత్ర షూటింగ్‌ను చాలా ఎంజాయ్ చేశాను. సినిమాలోని పాత్రకు నా నిజ జీవితానికి ఏ మాత్రం సంబంధం ఉండదు. అనుభవించు రాజాలో ప్రకృతి, వికృతి రెండూ ఉంటాయి. సెక్యూరిటీ గార్డ్ అవ్వాలంటే వెనకాల ఇంత ప్రాసెస్ ఉంటుందా? సెక్యూరిటీ గార్డ్ అంటే అంత ఈజీ కాదని ఈ చిత్రంతో తెలిసింది. మనం ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు చూసే ఫస్ట్ మొహం, రాత్రి ఇంటికి వచ్చేటప్పుడు చూసే చివరి మొహం సెక్యూరిటీ గార్డ్‌దే. వాళ్లు ఒక్క చిరు నవ్వుతో తలుపు తీస్తే మనకు బాగుంటుంది. అదే చిరాకుగా తీశారంటే రోజంతా కూడా మన మూడ్ అలానే అవుతుంది.

తొమ్మిదేళ్ల నుండి నాకు శ్రీను ఫ్రెండ్. సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు సినిమాకు ఈ సినిమాకు అతనిలో చాలా మార్పు వచ్చింది. అప్పుడు కుర్రాడు. ఇప్పుడు ఎంతో కంపోజర్ వచ్చింది. ఎంతో మెచ్యూరిటీ వచ్చింది. పాజిటివిటీ, హానెస్టి ఇలా చాలా వచ్చాయి. పని విషయంలో ఎప్పుడూ క్లారిటీగానే ఉంటాడు. మనిషిలా చాలా మారాడు. ఒక సినిమా ఆడటానికి, ఆడకపోవడానికి చాలా కారణాలుంటాయి. ఏ ఒక్కరినో నిందించలేం. నాకు శ్రీను బలం, సామర్థ్యం ఏంటో తెలుసు. అస్సలు భయపడలేదు. అన్నపూర్ణ స్టూడియో కాబట్టి.. శ్రీను టాలెంట్ చూపించేందుకు అవకాశం దొరికింది. ఆ కథను సుప్రియ గారికి, నాగచైతన్య, నాగార్జునగారికి చెప్పడంతో వారికి నచ్చడం.. తరువాత నా పేరు ప్రాజెక్ట్‌లోకి వచ్చింది. అప్పుడు పూర్తి కథ విన్నాను. ఈ చిత్రం భీమవరం, హైద్రాబాద్ నేపథ్యంలో సాగుతుంది.


నాగచైతన్యగారు ఈ సినిమా చూశారు. ఆయన చూసినప్పుడు నేను అక్కడ లేను. వేరే షూటింగ్‌లో ఉన్నాను. సినిమా చూశాక డైరెక్టర్‌తో నలభై నిమిషాలు మాట్లాడారట. సినిమా చాలా నచ్చిందని అన్నారట. సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. ఫాదర్ అండ్ సన్, ఊరికి సంబంధించిన ఎమోషన్ స్ట్రాంగ్‌గా ఉంటాయి. క్లాస్ పీకినట్టుగా మెసెజ్ ఉండదు. కానీ అండర్ లైన్‌గా ఓ మెసెజ్ ఉంటుంది. అమ్మిరాజు పాత్రలో అజయ్ గారు అద్భుతంగా నటించారు.


గ్యాంబ్లింగ్ అంటే నాకు నచ్చదు. ఆ ఆటలు నేను ఆడను. కోడి పందెలు చూస్తాను కానీ బెట్టింగ్ పెట్టను. ఈ సినిమా సంక్రాంతి పండుగ నుంచి మొదలవుతుంది. అక్కడి పండుగ వాతావరణాన్ని చూపిస్తాం. కోడి పందెంలలో ఎన్నో రకాల కోళ్లు ఉంటాయి. నాకు జంతువులంటే చాలా ఇష్టం. ఈ సినిమాలో వాడిన కోడి నాకు బాగా అలవాటు అయింది. షూటింగ్ లేదని ఆ కోడి దిగాలుగా ఉంటుందట. దానికి కూడా షూటింగ్ అలవాటు అయింది. ఇప్పుడసలు తినడం లేదట. కెరీర్‌ను ప్లాన్ చేయను. ఏది బాగా నచ్చితే అది చేస్తాను. ఇప్పుడు స్టాండప్ రాహుల్ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. త్వరలోనే విడుదల కానుంది. మాస్ మహారాజా ఈ మధ్యే  షూటింగ్ ప్రారంభమైంది. ఫైనల్‌గా ‘అనుభవించు రాజా’ చిత్రం మంచి ఫ్యామిలీ డ్రామా. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి రెండున్నర గంటల పాటు ఎంజాయ్ చేసేలా ఉంటుంది..’’ అని అన్నారు.


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.