రెహమాన్‌ కొత్త పాటకు అరుదైన గౌరవం!

దేశం గర్వించదగ్గ సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహమాన్‌. ప్రశంసలు, అవార్డులు, అరుదైన గౌరవాలు ఆయనకు కొత్తేమీ కాదు. విదేశాల్లో కూడా ఆయన సంగీతానికి అభిమానులున్నారు. తాజాగా ఆయన ‘మేరీ పుకార్‌ సునో’ పేరుతో ఓ పాటను రూపొందించి మాతృభూమికి అంకితమిచ్చారు. బాలీవుడ్‌ ప్రముఖ రచయిత గుల్జార్‌తో ఆయనది మూడు దశాబ్దాల మ్యాజికల్‌ జర్నీ. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఎన్నో హిట్‌ సాంగ్స్‌ సంగీత ప్రియులను అలరించాయి. ప్రకృతి మనకు ఇచ్చిన బహుమతులు సూర్యుడు, గాలి, నీరు గొప్పతనాన్ని వివరిస్తూ తాజాగా విడుదలైన ‘మేరీ పుకార్‌ సునో’ పాటకు గుల్జార్‌ అర్థవంతమైన సాహిత్యం అందించారు. ఉత్తరాది, దక్షిణాది గాయనీగాయకులైన చిత్ర,  శ్రేయాఘోషాల్‌, అల్కా యాగ్నిక్‌, సాధన సర్గమ్‌, షాషా తిరుపతి, అర్మన్‌ మాలిక్‌, ఆషిష్‌ కౌర్‌ ఆలపించారు. టీ సిరీస్‌ ద్వారా విడుదలైన ఈ పాటకు కోటిన్నరకు పైగా వ్యూస్‌ వచ్చాయి. అంతే కాదు ఈ పాటకు అమెరికాలో మరో అరుదైన గౌరవం దక్కింది. లాస్‌ ఏంజెల్స్‌, న్యూయార్క్‌ సిటీలో యూట్యూబ్‌ సంస్థ ఈ పాటను బిల్‌బోర్డ్స్‌ డిస్‌ప్లే చేశారు. ఈ విషయాన్ని రెహమాన్‌ సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘మేరీ పుకార్‌ సునో’ పాట  లాస్‌ ఏంజెల్స్‌, న్యూయార్క్‌లోని బిల్‌బోర్డ్స్‌ని టచ్‌ చేసింది’ అని పేర్కొన్నారు. అమెరికాలో బిల్‌బోర్డ్స్‌ మీద ఇండియన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ పాటను డిస్‌ప్లే చేయడం గొప్ప విషయం. రెహమాన్‌ హాలీవుడ్‌లో కూడా మ్యూజిక్‌ కంపోజ్‌ చేశారు. అప్పట్లో రెహమాన్‌ కంపోజ్‌ చేసిన హాలీవుడ్‌ ఆల్బమ్‌ ‘సూపర్‌ హెవీ’ విడుదల సమయంలో ఇలా బిల్‌బోర్డ్స్‌ మీద రెహమాన్‌ పాటను డిస్‌ప్లే చేశారు. 






అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.