రాధేశ్యామ్ నా గౌరవాన్ని పెంచుతుంది
ABN , First Publish Date - 2021-11-21T06:36:18+05:30 IST
ప్రభాస్ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘రాధే శ్యామ్’. భారీ బడ్జెట్‌తో, అత్యంత ఉన్నతమైన సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇలాంటి చిత్రంలో భాగం పంచుకోవడం నటీనటులకూ, సాంకేతిక నిపుణులకూ ఓ కల...

ప్రభాస్ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘రాధే శ్యామ్’. భారీ బడ్జెట్‌తో, అత్యంత ఉన్నతమైన సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇలాంటి చిత్రంలో భాగం పంచుకోవడం నటీనటులకూ, సాంకేతిక నిపుణులకూ ఓ కల. గీత రచయిత కృష్ణకాంత్ (కె.కె)కి ఆ అదృష్టం దక్కింది. ఈ చిత్రంలో కె.కె. ఐదు పాటల్ని రాశారు. ‘ఎవరో వీరెవరో’ అనే గీతం ఇటీవలే విడుదలైంది. ఈ పాటకు మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా కె.కె మాట్లాడుతూ ‘‘ఇప్పటి వరకూ సుమారు 400 పాటలు రాశాను. అవన్నీ ఒక ఎత్తు. ‘రాధే శ్యామ్’ మరో ఎత్తు. ఈ చిత్రం నా గౌరవాన్ని పెంచుతుంది. ‘ఎవరో.. వీరెవరో’ పాటకొస్తున్న స్పందనే అందుకు నిదర్శనం. అన్ని భాషల వారికీ ఈ పాట నచ్చింది. సోషల్ మీడియాలో ఈ పాట గురించి చర్చ జరుగుతోంది. 1970 నేపథ్యంలో సాగే కథ ఇది. కథ మొత్తాన్ని సన్నివేశాల రూపంలో కాకుండా, ఓ పాటలో చెబితే ఎలా ఉంటుందన్న ఆలోచన నుంచి ఈ పాట పుట్టింది. తొలిసారి విన్నప్పుడు పెద్దగా అర్థం కాదు. సినిమా చూస్తే ఇలా ఎందుకు రాశానో తెలుస్తుంది. ప్రతీ పాటనీ దర్శకుడు చాలా శ్రద్ధతో, ఓపిగ్గా రాయించుకున్నారు. ఏదైనా పదం నచ్చకపోతే.. అప్పటికప్పుడు మార్చమనేవారు. అందుకే మంచి పాటలొచ్చాయి. ప్రభాస్ మొన్నటి వరకూ పాన్ ఇండియా స్టార్. ఇప్పుడు గ్లోబర్ స్టార్ అయిపోయారు. అలాంటి హీరో సినిమాలో 5 పాటలు రాసే అవకాశం రావడం అంటే మాటలు కాదు. ఆ అవకాశాన్ని నేను నిలబెట్టుకున్నాననే అనుకుంటున్నా. శ్యామ్ సింగరాయ్, హిట్ 2, ఘోస్ట్ చిత్రాలకు కూడా మంచి పాటలు రాశా’’ అన్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ‘రాధే శ్యామ్’ జనవరి 14న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.