అందుకే ‘బంగార్రాజు’ బీభత్సంగా ఆడుతోంది: పీపుల్ స్టార్

ABN , First Publish Date - 2022-01-20T01:29:49+05:30 IST

అక్కినేని నాగేశ్వరరావు ఆత్మ.. నాగార్జున, నాగచైతన్యలోకి వచ్చింది.. అందుకే ‘బంగార్రాజు’ చిత్రం పెద్ద హిట్ అయిందని అన్నారు పీపుల్ స్టార్ ఆర్. నారాయణమూర్తి. కింగ్ నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో

అందుకే ‘బంగార్రాజు’ బీభత్సంగా ఆడుతోంది: పీపుల్ స్టార్

అక్కినేని నాగేశ్వరరావు ఆత్మ.. నాగార్జున, నాగచైతన్యలోకి వచ్చింది.. అందుకే ‘బంగార్రాజు’ చిత్రం పెద్ద హిట్ అయిందని అన్నారు పీపుల్ స్టార్ ఆర్. నారాయణమూర్తి. కింగ్ నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘బంగార్రాజు’. ఈ చిత్రం జనవరి 14న విడుదలై సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో రన్ అవుతోంది. ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న సందర్భంగా మంగళవారం రాజమండ్రిలో బంగార్రాజు బ్లాక్ బస్టర్ మీట్‌ను చిత్రయూనిట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఆర్. నారాయణమూర్తి అతిథిగా హాజరయ్యారు. 


ఈ కార్యక్రమంలో ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ.. ‘‘నేను అక్కినేని నాగేశ్వరరావుగారి అభిమానిని. ఆయన చిరునవ్వు, ఆయన ఆశీస్సుల వల్లే ‘బంగార్రాజు’ హిట్ పెద్ద అయింది. అక్కినేని నాగేశ్వరరావుగారి ఆత్మ.. నాగార్జున, నాగచైతన్యలోకి వచ్చింది. అందుకే ఈ సినిమా విజయవంతంగా దూసుకెళుతోంది. 2022లో సంక్రాంతి బ్లాక్ బస్టర్‌గా నిలబెట్టి ఆడిస్తున్న ప్రేక్షకులదే ఈ విజయం. వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. సినిమాలో కుటుంబ విలువలు చూపించారు.. బతికుండగానే హాయిగా బతికుండండి.. అని సందేశాన్ని ఇచ్చారు. అందుకే ఈ చిత్రం బీభత్సంగా ఆడుతోంది. ఇంత మెలోడ్రామా ఉంది కాబట్టే సినిమా ఆడుతోంది. నాగార్జునగారు ఆల్ రౌండర్. అన్నమయ్య, రామదాసు చిత్రాలతో జన్మ ధన్యం చేసుకున్నారు. ఈ విజయం ఆయనది. నాగచైతన్య విజయాలతో పరుగులు పెడుతున్నారు. ఇంత బాగా చేస్తాడని అనుకోలేదు. అద్బుతంగా నటించారు. క్లైమాక్స్‌లో మీ నటనకు ఏడ్చాను. తండ్రికి లేఖ రాస్తారు కదా? ఆ సీన్ అద్బుతంగా అనిపించింది. 


దర్శకుడు కళ్యాణ్ కృష్ణకు సెల్యూట్. నాగచైతన్యకు బీభత్సమైన హిట్ వస్తుందా? అని ఎదురుచూసిన వాడిలో నేనూ ఒకడిని. క‌ృతి శెట్టి మహజ్జాతకురాలు. ఉప్పెన బ్లాక్ బస్టర్ అయింది.. శ్యామ్ సింగరాయ్ బ్లాక్ బస్టర్ అయింది.. ఇప్పుడు బంగార్రాజు బ్లాక్ బస్టర్ అయింది. సంక్రాంతి పండుగ ఉందని వైఎస్ జగన్ గారు కూడా కర్ఫ్యూని వాయిదా వేశారు. ఈ నాలుగు రోజులు మినహాయింపు ఇచ్చారు. అందుకే ఈ సినిమా ఇంత బాగా ఆడింది. ఆయనకు కూడా ధన్యవాదాలు. ఎన్టీఆర్ కథానాయకుడు, రాముడు భీముడు సినిమాలను నాగార్జునగారితో చేయండి అని దర్శకుడు కళ్యాణ్ కృష్ణను అడిగాను. అదే నా కోరిక. నాగేశ్వరరావుగారి ఇద్దరు మిత్రులు సినిమా కూడా చేయాలి. నన్ను ఇక్కడకు పిలిచిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. నాలుగు నెలల్లోనే సినిమాను తీసి బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు నిర్మాత నాగార్జునకు వందనాలు’’ అని అన్నారు.

Updated Date - 2022-01-20T01:29:49+05:30 IST