ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ‘పుష్ప’ మొదటి భాగం ఏ స్థాయిలో విజయం సాధించిందో తెలిసిందే. సినిమా ఇప్పటికీ బాక్సాఫీస్ ను ఏలుతోంది. సినిమా విడుదలై నేటికి సరిగ్గా నెలవుతుంది. అయినా సరే పుష్పరాజ్ తగ్గేదేలే.. అంటూ సత్తా చాటుతున్నాడు. అందులో బన్నీ మ్యానరిజమ్స్ ను అనుకరిస్తూ క్రికెట్ తారలు సైతం సోషల్ మీడియాలో సందడి చేస్తుండడం చూస్తున్నాం. చిత్తూరు యాసను పెర్ఫెక్ట్ గా పలుకుతూ.. బన్నీ తన నటవిశ్వరూపాన్ని ప్రదర్శించాడు. వచ్చేనెలలో రెండో భాగం ‘పుష్ప ది రూల్’ షూటింగ్ ప్రారంభం కానుంది. మొదటి భాగంలోని దోషాల్ని సవరిస్తూ సుక్కు మరింత బెటర్ గా స్ర్కి్ప్ట్ ను తీర్చిదిద్దుతున్నట్టు తెలుస్తోంది.
ముఖ్యంగా పుష్పరాజ్ మ్యానరిజమ్స్ లో స్వల్ప మార్పులు చేయబోతున్నట్టు సమాచారం. పుష్ప ఒక కాలును కుంటుతూ నడవడం, మెడ దగ్గర చెయ్యి పెట్టి తగ్గేదేలే అంటూ డైలాగ్ పలకడం.. వీటిని రెండో భాగంలో మార్చుతున్నారని టాక్. దీనిపై బన్నీ, సుకుమార్ మధ్య డిస్కషన్స్ నడుస్తున్నాయని తెలుస్తోంది. అలాగే ఇతర పాత్రల్ని కూడా వినూత్నంగా డిజైన్ చేయబోతున్నారట. సెకండ్ పార్ట్ లో హీరో, విలన్ మధ్య వార్ ను కూడా ఆసక్తికరంగా తీర్చిదిద్దబోతున్నారట. ఇంకా ఫస్ట్ పార్ట్ కు మించిన రీతిలో దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నారని వినికిడి. మొత్తం మీద ‘పుష్ప ది రూల్’ లో బన్నీ లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ లో మరిన్ని మార్పులు రాబోతున్నాయి. మరి ఈ సారి పుష్ప టైటిల్ కు తగ్గట్టే బాక్సాఫీస్ ను రూల్ చేస్తాడేమో చూడాలి.