ఎప్పటికీ థియేటరే రారాజు: ఎస్‌కెఎన్‌!

ABN , First Publish Date - 2021-07-07T00:03:12+05:30 IST

నేను ఎవరితోనైనా అసోసియేట్‌ అవుతా. నేను, దర్శకుడు మారుతి, నిర్మాతలు బన్నీ వాసు, యూవీ వంఽశీ- ప్రమోద్‌ సినిమాల్లోకి రాకముందు నుంచే స్నేహితులం.

ఎప్పటికీ థియేటరే రారాజు: ఎస్‌కెఎన్‌!

‘‘నేను ఎవరితోనైనా అసోసియేట్‌ అవుతా. నేను, దర్శకుడు మారుతి, నిర్మాతలు బన్నీ వాసు, యూవీ వంఽశీ- ప్రమోద్‌ సినిమాల్లోకి రాకముందు నుంచే స్నేహితులం.  మేమంతా అల్లు అరవింద్‌గారి సలహా, సూచనలతో ముందుకెళ్తాం. అందుకే మా మధ్య క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌ ఉండవు. లెక్కల కన్నా స్నేహానికే విలువిస్తాం’’ అని నిర్మాత ఎస్‌కెఎన్‌ అన్నారు. ‘ఈరోజుల్లో’, ‘టాక్సీవాలా’ చిత్రాలతో నిర్మాతగా మారిన ఆయన ప్రస్తుతం ఆరు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. బుధవారం ఎస్‌కెఎన్‌ పుట్టినరోజు సందర్భంగా సినిమాలు భవిష్యత్తు ప్రణాళికల గురించి మీడియాతో పంచుకున్నారు. ఆ విశేషాలు...


జర్నలిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించి అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌, రవితేజ వంటి స్టార్‌ హీరోలకు పీఆర్వోగా పని చేశాను.  ‘ఈ రోజుల్లో’ చిత్రంతో నిర్మాతగా మారాను. ‘భలేభలే మగాడివోయ్‌’, ‘మహానుభావుడు’, ‘ప్రతిరోజూ పండగే’ వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించాను. ‘టాక్సీవాలా’తో పూర్తిస్థాయి నిర్మాతగా మారాను. తాజాగా మారుతి దర్శకత్వంలో గోపీచంద్‌ హీరోగా రూపొందుతున్న ‘పక్కా కమర్షియల్‌’ చిత్రానికీ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌తో కలిసి ఓ సినిమా నిర్మిస్తున్నా. త్వరలో ఆ చిత్రానికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తాం. రచయిత, దర్శకనిర్మాత సాయి రాజేష్‌తో అసోసియేట్‌ అయ్యి మూడు సినిమాలు చేయబోతున్నా. అలాగే ‘కలర్‌ఫోటో’ దర్శకుడు సందీప్‌రాజ్‌తో రెండు సినిమాలున్నాయి. రాహుల్‌ సంకృత్యాన్‌, వీఐ ఆనంద్‌, కరుణ్‌ కుమార్‌లతోనూ కమిట్‌మెంట్స్‌ ఉన్నాయి. ఇవి కాకుండా ఆహా ఓటీటీ కోసం ‘త్రీ రోజేస్‌’, జీ5, ఓ ఇంటర్‌నేషనల్‌ ఓటీటీ కోసం వెబ్‌సిరీస్‌ గురించి చర్చలు జరుగుతున్నాయి. న్యూ టాలెంట్స్‌ను ప్రోత్సహించడానికి మారుతి, నేను కలిసి మాస్‌ మూవీ మేకర్స్‌ అనే బ్యానర్‌ను ప్రారంభించి వెబ్‌ కంటెంట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం. 

అదృష్టమో.. దురదృష్టమో! 

ప్రస్తుతం మూడు సినిమాలు, మూడు వెబ్‌సిరీస్‌లు సెట్స్‌పై ఉన్నాయి. ఏడాదికి మూడు ప్రాజెక్ట్‌లు చేయాలనుకున్నా. కరోనా కారణంగా షూటింగ్‌లు ఆలస్యం కావడంతో ఒకేసారి ఆరు ప్రాజెక్ట్‌ల వర్క్‌ జరుగుతోంది. కాబట్టి చాలా బిజీగా ఉంటున్నాను. ఇది అదృష్టమో! దురదృష్టమో! తెలియడం లేదు. 

థియేటర్‌లో చూస్తేనే ఆ కిక్‌...

సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ను ఏ డిజిటల్‌ ప్లాట్‌పామ్‌ రీ ప్లేస్‌ చేయలేదు. కొన్ని సినిమాలను తెరపైనే చూడాలి. అలా చూస్తేనే సినిమా కిక్‌ తెలుస్తుంది. కరోనా వల్ల థియేటర్లు మూతపడి నిర్మాతలు ఆర్ధిక ఇబ్బందులు పడుతూ ఓటీటీ వైపు కన్నేస్తున్నారు. ఈ సమయంలో ఆ నిర్ణయం తీసుకోవడం తప్పులేదెమో అనిపిస్తుంది! థియేటర్స్‌ వ్యవస్థ మనుగడ బావుండాలి. అది థియేటర్స్‌కు మాత్రమే కాదు.. ఇండస్ర్టీకి కూడా మేలు. కొంతమంది నిర్మాతలు ఈ పరిస్థితుల్లో ఓటీటీలకు వెళుతున్నారు. దాన్ని తప్పుపట్టలేం. కానీ ఒక వ్యక్తిగా, ప్రేక్షకుడిగా, నిర్మాతగా బిగ్‌స్రీన్‌పై సినిమా చూేసందుకే మొగ్గుచూపుతాను. థియేటర్స్‌లో సినిమా విడుదలై ఆ తర్వాత ఓటీటీకి వేస్తనే బెటర్‌ అని నా అభిప్రాయం. సినిమా అనేది మన దైనందిన జీవితంలో ఓ భాగం. మనం ఆఫీస్‌లకు, హోటళ్లకు, షాపింగ్‌లకు  వెళ్తున్నాం. అలాగే సినిమాలకు వెళతాం. ప్రస్తుతం వ్యాక్సిన్‌ డ్రైవ్‌ పెరిగింది. ప్రేక్షకుల్లో కూడా కాస్త భయం తగ్గింది.  థర్డ్‌ వేవ్‌ సమస్య లేకుండా ఉంటే థియేటర్స్‌ రీ ఓపెన్‌ అవుతాయి. ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తారనే నమ్మకం ఉంది. ఎప్పటికీ థియేటరే రారాజు అని నేను అనుకుంటున్నా.  


Updated Date - 2021-07-07T00:03:12+05:30 IST