
తమ వేతనాలు పెంచమని ఎప్పటినుంచో సినీ కార్మికులు నిర్మాతల్ని అడుగుతూ వస్తున్నారు. అయితే ఈ రోజు (జూన్ 22) అది ఆందోళనగా మారింది. నేటి ఉదయం సినీ కార్మికులంతా కలిసి.. ఫిల్మ్ ఫెడరేషన్ (Film Federation) కార్యాలయాన్ని ముట్టడించారు. తమ డిమాండ్స్ ను వెంటనే నెరవేర్చమని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఈ సమ్మెపై నిర్మాతల మండలి స్పందించింది. నేడు మధ్యాహ్నం సమావేశమైన నిర్మాతల మండలి.. అనంతరం మీడియా ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ (C. Kalyan) మాట్లాడుతూ.. కార్మికుల వేతనాలు పెంచడంలో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. రేపటి నుంచి కార్మికులంతా యధావిధిగా షూటింగ్స్ లో పాల్గొనాలని సూచించారు. అయితే కార్మికుల ఒత్తిడికి తలొగ్గి ఎవరూ వేతనాలు పెంచొద్దు. అందరం కలిసి షూటింగ్స్ జరుపుకుందాం ఎప్పటిలాగా షూటింగ్స్ కు వస్తే.. విధి విధానాలపై ఎల్లుండి చర్చించి ఒక కొలిక్కి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం, లేదంటే.. నిర్మాతలెవరూ షూటింగ్స్ చేయడానికి సిద్ధంగా లేరు. నిర్మాతల్ని ఇబ్బంది పెట్టకండి. వారు సినిమాలు చేస్తేనే మనకు పని ఉంటుంది. అలాగే సమ్మె నోటీసులు పంపించినట్టు వారు చెబుతున్నారు. ఇందులో ఎలాంటి నిజం లేదు. అని సి. కళ్యాణ్ వివరించారు.