అధిక రెమ్యూనరేషన్ అడిగిన హీరోకి రెడ్ కార్డ్.. నిర్మాతలకు అంత దమ్ము ఉందా?

ABN , First Publish Date - 2021-12-04T02:51:39+05:30 IST

ఒక నటుడు అధిక మొత్తంలో రెమ్యునేషన్‌ కావాలని అడగడంతో అతనికి రెడ్‌ కార్డు చూపించారు. అంతటి దమ్ము ఇక్కడ ఉన్న నిర్మాతలకు ఉందా? అని ప్రశ్నించారు. అలాగే, అనేక మంది..

అధిక రెమ్యూనరేషన్ అడిగిన హీరోకి రెడ్ కార్డ్.. నిర్మాతలకు అంత దమ్ము ఉందా?

కేరళ చిత్ర పరిశ్రమకు చెందిన ఒక హీరో అధిక మొత్తంలో పారితోషికం అడిగారని ఆ హీరోకు రెడ్‌ కార్డ్‌ చూపించారని అలాంటి దమ్ము తమిళ నిర్మాతలకు ఉందా అని సీనియర్‌ నిర్మాత కె. రాజన్‌ ప్రశ్నించారు. రాజేంద్ర ప్రసాద్‌, సుందర్‌.జి కలిసి నిర్మించిన ‘కన్మణి పాప’ ఆడియో రిలీజ్‌ తాజాగా చెన్నై నగరంలో జరిగింది. తమన్‌ కుమార్‌, మియాశ్రీ, బేబి మానస్వి, సింగం పులి, శివం, సంతోష్‌ శరణన్‌, నాగ మాసి తదితరులు నటించిన ఈ చిత్రానికి శ్రీమణి దర్శకత్వం వహించారు.  


ఈ ఆడియో రిలీజ్‌ వేడుకలో పాల్గొన్న నిర్మాత కె. రాజన్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ ఆడియో ఫంక్షన్‌కు రావాలని నిర్మాత సుందర్‌ నన్ను ఆహ్వానించినపుడు చిన్న బడ్జెట్‌ చిత్రమైతే ఖచ్చితంగా వస్తానని మాటిచ్చాను. చిత్ర పరిశ్రమను రక్షించేది చిన్న చిత్రాలే. నా దృష్టిలో హీరో విజయ్‌ నటించిన ‘బిగిల్‌’ చిత్రం చిన్నది. ఆ చిత్రం నష్టాలను మిగిల్చింది. ఏ చిత్రమైతే విజయం సాధించి నిర్మాతకు నాలుగు పైసలు లాభం తెచ్చిపెడుతుంతో ఆ చిత్రం పెద్ద చిత్రంగా భావిస్తాను. సినిమా లేకుంటే హీరోలకు రెమ్యునరేషన్‌ లేదు. లైట్‌బాయ్‌కు పనిలేదు. ఒక చిత్రంలో హీరోయిన్‌కు నుదుట బొట్టు మ్యాచింగ్‌ కాలేదని సినిమా షూటింగ్‌ నిలిపివేశారు. ఇలాంటి చర్యల వల్ల నిర్మాతలు నష్ట పోతారు. ఒక చిత్రానికి కెప్టెన్‌ దర్శకుడు అయితే, ఆ తర్వాతే హీరో.



కేరళ రాష్ట్రంలో ఒక నటుడు అధిక మొత్తంలో రెమ్యునేషన్‌ కావాలని అడగడంతో అతనికి రెడ్‌ కార్డు చూపించారు. అంతటి దమ్ము ఇక్కడ ఉన్న నిర్మాతలకు ఉందా? అని ప్రశ్నించారు. అలాగే, అనేక మంది తమిళ అమ్మాయిలు హీరోయిన్‌ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికి నిర్మాతలు అవకాశాలు ఇవ్వాలి. అలాగే, ఒక సినిమాలోని సన్నివేశాలపై నిర్మాతలకు ఏమాత్రం అవగాహన ఉండదు. అదే సమయంలో దర్శకుడు ఉద్దేశపూర్వకంగా, వివాదాల కోసం అలాంటి అంశాల జోలికి వెళ్ళరు. అలాంటిదే ‘జై భీమ్‌’ మూవీలో క్యాలెండర్‌ వివాదం అని నిర్మాత కె. రాజన్‌ పేర్కొన్నారు. ఆ తర్వాత నటుడు ఆరి, నిర్మాత సీవీ కుమార్‌, హీరో తమన్‌, బేబీ మానస్వి ఇతర చిత్ర బృందం సభ్యులు ప్రసంగించారు.

Updated Date - 2021-12-04T02:51:39+05:30 IST