ప్రేక్షకులను అంచనా వేయలేం..!

ABN , First Publish Date - 2022-08-14T05:30:00+05:30 IST

శ్వనీదత్‌- వైజయంతీ మూవీస్‌... ఈ పేర్లకు యాభై ఏళ్ల చరిత్ర ఉంది. ఆ ఘనత వెనుక ఎనలేని శ్రమ దాగుంది.

ప్రేక్షకులను అంచనా వేయలేం..!

అశ్వనీదత్‌- వైజయంతీ మూవీస్‌... ఈ పేర్లకు యాభై ఏళ్ల చరిత్ర ఉంది. ఆ ఘనత వెనుక ఎనలేని శ్రమ దాగుంది.ఈ ప్రతిష్టని మరో యాభై ఏళ్లు కొనసాగించాలన్నది అశ్వనీదత్‌ కల. ఆ కలని, ఆ కష్టాన్నీ తమ భుజాలపై వేసుకొని ముందుకు సాగుతున్నారు కుమార్తెలు ప్రియాంక దత్‌.. స్వప్నదత్‌. ముఖ్యంగా ‘మహానటి’, ‘సీతారామం’ చిత్రాలకు మూలస్థంభంలా నిలిచారు స్వప్న. ఆయా చిత్రాల కథల దగ్గర్నుంచి, ప్రమోషన్‌ వరకూ... అన్ని విషయాల్లోనూ స్వప్న పాత్ర స్పష్టంగా కనిపిస్తుంటుంది. అరుదుగా మీడియా ముందుకు వచ్చే స్వప్న ‘నవ్య’తో ప్రత్యేకంగా మాట్లాడారు... 



విజయవాడలో పెరిగాం. చాలా సంతోషంగా గడిచింది. అక్కడ పెరగడం వల్లే సినిమాలపై ప్రేమ ఎక్కువ అయింది. మేం వాస్తవ ప్రపంచంలో పెరిగాం. జీవితంలోని కఠినత్వాన్ని దగ్గరగా చూశాం. కానీ ఈ తరం బుడగ లాంటి ఒక కల్పిత ప్రపంచంలో విహరిస్తోంది. అది బద్ధలయితే వారి పరిస్థితి మరోలా ఉంటుంది. 

మా కుటుంబ సభ్యులం పరాజయాలతో రాటుదేలాం. కష్టం వస్తే అందరం ఒక్కటైపోతాం. ‘సీతారామం’ సినిమా కోసం నాగీ (నాగ్‌ అశ్విన్‌) తన టీమ్‌తో వారం రోజుల పాటు ప్రచార కార్యక్రమాలపైనే కూర్చొన్నారు. ఇక మా ఆయన విజయం కోసం తిరుపతి వెళ్లొస్తారు. ఆయన నాకు గొప్ప అండ. ఇక అమ్మానాన్నకు మేమే సర్వస్వం. 

‘ప్రాజెక్ట్‌-కె’ బ్రహ్మాండంగా జరుగుతోంది. నాగీ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తారు.

స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు... 

మీ అందరికీ కూడా స్వాతంత్ర్యోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్య్ర దినోత్సవం అనగానే మా చిన్ననాటి రోజులు గుర్తుకొస్తాయి. స్కూల్లో చాలా ఉత్సాహంగా జరుపుకొనేవాళ్లం. దేశభక్తి అనేది అనిర్వచనీయమైన అనుభూతి. దానికి ప్రతీకగా ‘సీతారామం’లో ఒక సైనికుడు ఎలా ఉంటాడో చూపించాం. 


ఒక నిర్మాతగా ప్రేక్షకుల నాడి ఎలా పట్టుకుంటారు? 

ప్రేక్షకులు మన అంచనాలకు అందరు. వాళ్లని అర్థం చేసుకోవడానికి మన పరిధి సరిపోదని అనుకుంటాను. వాళ్లు దేన్ని చూడ్డానికి ఇష్టపడతారు, దేన్ని ఇష్టపడరు అనేది మనం అంచనా వేయలేం. మనం అత్యుత్తమం అనుకున్నదాన్ని సినిమాగా తీస్తాం. ముఖ్యంగా ప్రేమ కథలు అయితే ప్రేక్షకులను సులభంగా ఆకట్టుకుంటాయి. ‘మహానటి’ సినిమా తీసేటప్పుడు ‘ఈ తరానికి ఏం తెలుస్తుంది, ఎవరికి అర్థమవుతుంది’ అన్నారు. చిన్నపిల్లలు సహా అన్ని వర్గాలవారూ ఆదరించారు. ‘సీతారామం’ విషయంలోనూ అలాగే పొరపడ్డారు. ‘ప్రేక్షకులు థియేటర్లకు రావడంలేదు. ‘కేజీఎఫ్‌’ లాంటి సినిమాలనే చూస్తున్నారు’ అనుకున్నారు. కానీ దానికి భిన్నంగా ఘన విజయం అందించారు.  

మాకన్నా కష్టపడతారు

మా నాన్నకు మాకన్నా ధైర్యం, ఉత్సాహం ఎక్కువ. అమితోత్సాహంతో పనిలోకి దూకుతారు. ఇప్పటికీ మాకన్నా ఎక్కువ కష్టపడతారు. ఎక్కువ రిస్క్‌ తీసుకుంటారు. ఇప్పడప్పుడే ఆయన రిటైర్‌ అయ్యేలా లేరు. 


తారక్‌, దుల్కర్‌, నాని, ప్రభాస్‌ నా అభిమాన తారలు. కీర్తి సురేష్‌ మంచి నటి. సాయిపల్లవి వ్యక్తిత్వం చాలా ఇష్టం. శేఖర్‌ కమ్ముల నచ్చిన దర్శకుడు. ప్రభాస్‌ షూటింగ్‌లో ఉంటే అది మా సినిమానా, ఆయన సినిమానా అనేది కూడా తెలియదు. కలివిడిగా ఉంటారు. ఏం తింటారు అని అడుగుతారు. 

ప్రేక్షకుల అభిరుచిలో వచ్చిన మార్పులను ఎలా పసిగడతారు?

అంటే ‘ఫలానా ఫార్మాట్‌లో చేస్తే సినిమా చూస్తారు’, ‘ఫలానా ఫార్మాట్‌లో అయితే చూడరు’ అని మనం అనుకోవడమే తప్ప ఇంత మేర హాస్యం, ఇంతమేర యాక్షన్‌ ఉండాలని కొలబద్దలు ఏమీ లేవు. ఒక మంచి సినిమా తీసి, అందులో ప్రేక్షకులు లీనమయ్యేలా చేశామా... వాళ్లు మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నారా అనేవి ముఖ్యం. స్టార్‌ హీరో, భారీ ఫైట్లు, ఐటమ్‌ సాంగ్‌లు కావాలని ప్రేక్షకుడు కోరుకోడనేది నా ఆలోచన. 


తెలుగు పరిశ్రమలో సక్సెస్‌ రేటు ఐదారు శాతానికి మించదు. అయినా మూస ధోరణిలోనే సినిమాలు రావడానికి కారణం? 

దీనికి సమాధానం చెప్పడానికి నేను సరైన వ్యక్తిని కాను అంటాను. కానీ మా విషయానికొస్తే ఏ సినిమా తీయడం అయినా పర్వతాన్ని అధిరోహించినట్టే. ఎంతో కష్టపడి ఆఖరుకు శిఖరంపై జెండా పాతాక కలిగే ఆనందం అనిర్వచనీయం. అయితే అన్ని సినిమాలూ ఒకే ఫార్ములాలో ఉంటున్నాయనేది పాక్షిక సత్యం. కొత్త తరహా చిత్రాలు చెప్పుకోదగ్గ స్థాయిలోనే వస్తున్నాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చేసిన మనమే ‘జాతిరత్నాలు’, ‘సీతారామం’లాంటి సినిమాలు అందిం చాం. మా సమష్టి కృషితో తెలుగు సినిమాను గర్వించే స్థాయిలో నిలబెట్టామని చెప్పగలను. 


వైఫల్యాల నుంచి పరిశ్రమ పాఠాలు నేర్చుకోవడంలేదనేదానిపై మీ స్పందన? 

నాన్న గారికి నిర్మాతగా 50 ఏళ్ల అనుభవం ఉంది. కానీ నాది ఇంకా మూడు సినిమాల వయసే. నా సినిమాల గురించి మాత్రమే నేను చెప్పగలను. నేను అయితే ఫార్ములాను పట్టించుకోను. కథ నచ్చితే చేస్తాను. 


సినిమా అనేది అనిశ్చితితో కూడింది కదా! అలాంటి సమయంలో ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారు? 

‘ఎందుకో మాకు ఈజీ సినిమాలు పడడం లేదు. కష్టమైన సినిమాలే పడుతున్నాయి’ అనిపిస్తుంది. ప్రతిసారీ రిలీజ్‌ వరకూ కష్టపడాల్సిందే. ఒక హిట్‌ పడ్డాక కూడా మళ్లీ అవే సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే అది మా ఎంపిక మీదనే ఆధారపడి ఉంది. ధైర్యంగా ముందుకెళ్లడం, సమష్టిగా నిర్ణయం తీసుకోవడం ద్వారా దాన్ని అధిగమిస్తాం. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఫలితం అనుకూలంగా వస్తే ఆ మజాయే వేరు. 


ఓటీటీ కోసమే సినిమాలు తీయడాన్ని ఎలా చూస్తారు?

ఓటీటీ అయినా, థియేటర్‌ అయినా ప్రేక్షకులు వాళ్లే. థియేటర్‌లో సినిమా చూసిన ఆనందం ఓటీటీలో ఎక్కడ వస్తుంది. 


నిర్మాతగా మీకు గుర్తుండిపోయే ప్రశంస?

టెలివిజన్‌లో నేను విఫలమైనప్పుడు చాలామంది ‘డాటర్‌ స్ట్రోక్‌’ అని విమర్శించారు. వాళ్లే ఇప్పుడు ‘అమ్మాయిలు అయినా ‘వైజయంతి’ పేరు నిలబెడుతున్నారు’ అంటున్నారు. 


ఇంత స్పష్టత, నిబద్ధత ఉన్న మీరు టెలివిజన్‌ రంగంలో ఎలా విఫలమయ్యారు? 

ఏ రంగంలో అడుగుపెట్టినా నేను సక్సెస్‌ అవ్వగలను అని చెప్పలేను. జీ తెలుగు, ఈ టీవీకి ఫస్ట్‌ ‘సరిగమప’ ప్రోగ్రాం చేసింది నేనే. మా టీవీకి కూడా మేజర్‌  ప్రోగ్రాంలు చేశాను. 2006 లోనే నెలకు లక్షన్నర దాకా సంపాదించుకొనేదాన్ని. స్వతహాగా మేం నిర్మాతలం. కానీ బ్రాడ్‌కాస్టింగ్‌ అనేది వేరు. దోశ బాగా వేస్తామని దోశ పిండి వ్యాపారం చేసినట్లు అయింది మా పని. లోకల్‌ టీవీ ఐడియా ఫెయిల్‌ అయినా అందులో మేం ప్రసారం చేసిన కంటెంట్‌ను పెద్ద ఛానళ్లు భారీ మొత్తాలకు కొన్నారు. కంటెంట్‌ ఈజ్‌ కింగ్‌. 


ఎదురుదెబ్బ తగిలాక ఎలా అనిపించింది?

మూడొందల మంది ఉద్యోగులు నన్ను నమ్ముకొని ఉన్నారు. చాలా ప్రయత్నం చేశాక మోయలేక వదిలేశాం. మమ్మల్ని నమ్మి పెట్టుబడి పెట్టిన నాన్న స్నేహితులు కొంత మంది నష్టపోయారు. అది చాలా నిరాశ కలిగించినా విలువైన పాఠాలు నేర్చుకున్నాం. 


సినిమా నిర్మాణం అత్యంత కష్టంతో కూడుకున్నదా?

అవును. సినిమావాళ్ల జీవితాలు పైకి కలర్‌ఫుల్‌గా కనిపిస్తాయంతే. కానీ చాలా బాధ్యత, ఒత్తిడి, కఠోర శ్రమ ఉంటాయి. ముఖ్యంగా నిర్మాత గురించి చెప్పాలంటే సినిమా హిట్‌ అయితే ఆఖరున పేరు వస్తుంది. అదే ఫ్లాప్‌ అయితే మొదట వినిపిస్తుంది. దీనికంటే రియల్‌ ఎస్టేట్‌లో ఎక్కువగా డబ్బులు వస్తాయి. కానీ మన చేతుల్లో రూపుదిద్దుకున్న ప్రాజెక్ట్‌ని చూసుకున్నప్పుడు చాలా ఉల్లాసంగా ఉంటుంది. ఆ సంతృప్తి కోసమే పనిచేస్తాం. 


ఒక నిర్మాతకు కూతురుగా పరిశ్రమలోకి రావడం ఎలాంటి ప్రభావం చూపింది?

లాభనష్టాలు రెండూ ఉన్నాయి. కొత్తవాళ్లకంటే మాకు కొంచెం ఎక్కువ అవగాహన ఉంటుంది. అయితే బయటవాళ్లు మమ్మల్ని ‘వీళ్లు ఫెయిల్‌ అవ్వాలి’ అని చూస్తారు. ‘ఏదో వాళ్ల నాన్న పేరు అడ్డం పెట్టుకొని వచ్చారు. ఇదంతా నాలుగు రోజుల మురిపెం’ అనుకున్నారు. మా పక్కన ఉండేవాళ్లే ఇవన్నీ అంటున్నారని తెలుసు. మాటలకన్నా చేతలు మాట్లాడతాయనేది నా నమ్మకం. అందుకే ఎక్కువగా ప్రచారం కోరుకోను. మా దృష్టంతా పనిపైనే. అదృష్టం మా వైపు ఉండి నిలదొక్కుకున్నాం. 


సినిమాకు సంబంధించిన క్రాఫ్ట్స్‌లో ఏది ఎక్కువ కష్టం? 

నిర్మాణం అనేది తల్లిలాంటిది. జీవితం ఎన్ని పరీక్షలు పెట్టినా ఆమె ముఖంపై చిరునవ్వు చెరగదు. రోజూ మేం కూడా అలానే ఉంటాం. చిత్రీకరణ పూర్తయిన తరువాత సినిమా చూసినప్పుడు కష్టమంతా మరిచిపోతాం. 


నిర్మాణ వ్యయం పెరగడాన్ని ఎలా చూస్తారు?

అన్ని వస్తువులకు పెరిగినట్టే సినిమా నిర్మాణ వ్యయం పెరిగింది. ఇది ఆందోళన కలిగించేదే. కానీ ఖర్చు తగ్గించుకోవడానికి ప్రతి నిర్మాత చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. కానీ అన్నిసార్లు మనం అనుకున్నట్లు కుదరదు. కొన్నిసార్లు సినిమా డిమాండ్‌ చేస్తే, కొన్నిసార్లు మా పొరపాట్ల వల్ల ఖర్చు పెరుగుతుంది. షూటింగ్‌ వ్యవధిని ఎంత తగ్గించుకుంటే ఖర్చు అంత తగ్గుతుంది. 

సీవీఎల్‌ఎన్‌ ప్రసాద్‌ 

Updated Date - 2022-08-14T05:30:00+05:30 IST