Kaduva: మలయాళ సూపర్‌స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) నటించిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగులో ‘భీమ్లా నాయక్’ పేరుతో రీమేక్ కాగా.. ఆయన నటించడమే కాకుండా దర్శకత్వం కూడా చేసిన ‘లూసిఫర్’ చిత్రాన్ని తెలుగులో ‘గాడ్‌ఫాదర్’ పేరుతో మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేస్తున్నారు. అలాగే ఆయన రీసెంట్గా నటించిన ‘జనగణమన’ చిత్రం ఓటీటీలో విడుదలై మంచి టాక్ని సొంతం చేసుకుంది. ఇలా.. మలయాళంలోనే కాకుండా పృథ్వీరాజ్ సుకుమారన్ తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరవుతున్నారు. ఇప్పుడాయన హీరోగా నటించిన ‘కడువా’ (Kaduva) చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. పృథ్వీరాజ్ సుకుమారన్, మాస్ డైరెక్టర్ షాజీ కైలాస్ కాంబినేషన్లో హై ఆక్టేన్ యాక్షన్ మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ తాజాగా ప్రకటించారు. పాన్ ఇండియా ఎంటర్టైనర్గా మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని జూన్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.
ఈ భారీ యాక్షన్ థ్రిల్ డ్రామాలో బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్ మరో ప్రధాన పాత్రలో నటించారు. ‘భీమ్లా నాయక్’ చిత్రంలో రానాకి భార్యగా నటించిన సంయుక్తా మీనన్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటించింది. మ్యాజిక్ ఫ్రేమ్స్ మరియు పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై లిస్టిన్ స్టీఫెన్, సుప్రియా మీనన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు.